Sayami Kher : ఐరన్ మ్యాన్ రేస్ అంతు చూశా!
ABN, Publish Date - Sep 25 , 2024 | 04:30 AM
తారలు గ్లామర్‌కే పరిమితం కాదు, ఉక్కు మహిళలా తడాఖా చూపించగలుగుతారని నిరూపించింది బాలీవుడ్, టాలీవుడ్ కథానాయకి సయామి ఖేర్! బెర్లిన్‌లో జరిగిన ప్రపంచంలోని అత్యంత కఠినమైన ట్రయథ్లాన్ ‘ఐరన్ మ్యాన్’ రేస్‌లో మొదటిసారిగా పాల్గొని, విజయవంతంగా ముగించగలిగిన సయాని, తన అనుభవాన్ని ఇలా పంచుకుంది.
న్యూస్ మేకర్
తారలు గ్లామర్‌కే పరిమితం కాదు, ఉక్కు మహిళలా తడాఖా చూపించగలుగుతారని నిరూపించింది బాలీవుడ్, టాలీవుడ్ కథానాయకి సయామి ఖేర్! బెర్లిన్‌లో జరిగిన ప్రపంచంలోని అత్యంత కఠినమైన ట్రయథ్లాన్ ‘ఐరన్ మ్యాన్’ రేస్‌లో మొదటిసారిగా పాల్గొని, విజయవంతంగా ముగించగలిగిన సయాని, తన అనుభవాన్ని ఇలా పంచుకుంది.
1.9 కిలోమీటర్ల ఈత, 90 కిలోమీటర్ల బైక్ రైడ్, 21.1 కిలోమీటర్ల పరుగు... విరామం లేకుండా, ఈ మూడింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా పూర్తి చేయడమే ‘ఐరన్ మ్యాన్ 70.3 రేస్’. 70.3 అనేది మొత్తం మైళ్లు. అంటే సుమారు 113 కిలోమీటర్లు. ఈ పోటీలో పాల్గొనడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులతో పాటు, ఎంతో మంది ఔత్సాహికులు జర్మనీలోని బెర్లిన్‌కు చేరుకుంటూ ఉంటారు. శారీరక దారుఢ్యంతో పాటు, దృఢమైన ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ పోటీని అసాంతం పూర్తి చేయగలుగుతారు. ఇలాంటి కఠినమైన పోటీలో పాల్గొనాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందనీ, దానికి కొవిడ్ అడ్డుపడి, చివరకు ఎలాగైతేనేం పూర్తి చేయగలిగానని చెప్పుకొస్తోంది సయాని.
షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే...
‘‘ఐరన్ మ్యాన్ రేస్ నా బకెట్ లిస్ట్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఈ రేస్‌కు సిద్ధపడడం కోసం నేను ఎన్నో ఏళ్లుగా మారథాన్‌లలో పాల్గొంటూనే ఉన్నాను. కానీ ఈ రేస్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ పోయింది. చివరకు ఈ సెప్టెంబర్‌లో మొదటిసారిగా ఈ రేస్‌లో పాల్గొనడమే కాకుండా, విజయవంతంగా పూర్తి చేయగలిగిన మొట్టమొదటి భారతీయురాలిగా నాకెంతో సంతోషంగా ఉంది.
ఈ రేసులో గెలవడం ప్రధానం కాదు. పోటీలో పాల్గొని చివరివరకూ కొనసాగడమే ఎంతో గొప్ప విషయం. ఎంతో అనుభవమున్న క్రీడాకారులు, రేసులో పూర్వ అనుభవం ఉన్నవాళ్లు కూడా మధ్యలోనే విరమించుకుంటూ ఉంటారు. అత్యధిక శారీరక శ్రమకు లోను చేసే ఈ రేసులో పాల్గొనడానికి ఏళ్ల తరబడి శిక్షణ అవసరమవుతుంది. ఓ పక్క షూటింగ్‌లతో బిజీగా గడుపుతూనే, మరో పక్క పరుగు, సైక్లింగ్, ఈతలను సాధన చేస్తూ నేను ఈ రేస్‌కు అన్ని విధాలా సిద్ధ పడ్డాను.
శిక్షణతోనే సాధ్యం
రేసులోకి అడుగు పెట్టినప్పటి నుంచి 8 గంటల పాటు వరుసగా సైక్లింగ్, పరుగు, ఈతలతో నాకు సమయమే తెలియలేదు. కానీ రేసు పూర్తి చేశానని అర్థమైన తర్వాత, పట్టలేనంత సంతోషం కలిగింది. నిజాన్ని జీర్ణించుకోడానికి సమయం పట్టింది. ఈ రేసులో మొదటిసారిగా పాల్గొన్న చాలా మంది రేసును పూర్తి చేయలేక, మధ్యలోనే వెనుదిరిగారు. నేను ఓ పక్క 12 నుంచి 14 గంటల పాటు షూటింగ్స్‌లో పాల్గొంటూ, మరో పక్క రేసు కోసం శిక్షణను కూడా కొనసాగించాను. గత ఫిబ్రవరిలో శిక్షణ మొదలుపెట్టిన మొదట్లో 3 కిలోమీటర్ల పరుగు, 50 మీటర్ల ఈతకే అలసిపోయేదాన్ని. ఆరు నెలల తర్వాత, నా మీద నాకు నమ్మకం పెరిగింది. మునుపటి కంటే ఎంతో మెరుగ్గా ఈత కొట్టగలుగుతున్నట్టు, పరిగెత్తగలుగుతున్నట్టు గ్రహించాను.
షూటింగ్‌లతో ఎంత అలసిపోయినా, ఉదయాన్నే 3:30కు లేచి శిక్షణ మొదలుపెట్టి, మళ్లీ షూటింగ్స్‌కు హాజరవడం అలవాటు చేసుకున్నాను. రేసులో ఎదుర్కోవలసిన సవాళ్ల గురించి నాకు తెలుసు. కానీ మెరుగ్గా శిక్షణ పొందగలిగితే, రేసును పూర్తి చేయడం పెద్ద సమస్య కాదనే విషయాన్ని నేను గ్రహించాను. కాబట్టి శిక్షణ మీదే దృష్టి పెట్టాను.
ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం
ట్రయథ్లాన్ పూర్తిగా శరీర సామర్థ్యానికి సంబంధించిన పోటీ. అయితే ఇలాంటి పోటీలు మానసిక స్థైర్యాన్ని కూడా పెంచుతాయి. మనసులోని గందరగోళాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆ ఆత్మవిశ్వాసాన్ని నేను నటనా వృత్తి కోసం ఉపయోగించడం మొదలుపెట్టాను. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. నటులకు ఇదెంతో ముఖ్యమైన అంశం. కాబట్టి నటులు ఏదో ఒక క్రీడలో పాల్గొంటూ ఉండడం అవసరమని నేను భావిస్తాను’’ అంటూ మీడియాతో తన క్రీడానుభవాన్ని పంచుకుంది సయామి.
Updated Date - Sep 25 , 2024 | 04:30 AM