చిన్న ప్రయత్నం... పెద్ద మార్పు
ABN, Publish Date - Dec 26 , 2024 | 06:33 AM
ఒక సర్పంచ్‌గా ఆమె చేసిన చిన్న ప్రయత్నం ఆ గ్రామ మహిళల ఆలోచనా విధానాన్నే మార్చేసింది. గృహిణి పేరుతో ఇంటి ముందు తగిలించిన నేమ్ ప్లేట్... వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. మగవారికి మగువ ఎందులోనూ తీసిపోదని చెబుతూ...
స్ఫూర్తి
ఒక సర్పంచ్‌గా ఆమె చేసిన చిన్న ప్రయత్నం ఆ గ్రామ మహిళల ఆలోచనా విధానాన్నే మార్చేసింది. గృహిణి పేరుతో ఇంటి ముందు తగిలించిన నేమ్ ప్లేట్... వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. మగవారికి మగువ ఎందులోనూ తీసిపోదని చెబుతూ... వారిని సాధికారత దిశగా అడుగులు వేయిస్తున్నారు శేషన్‌దీ్‌ప కౌర్ సిద్ధూ. ప్రస్తుతం పదవిలో లేకపోయినా... తన ప్రాంత మహిళలకు మార్గదర్శి అయ్యారు ఈ మాజీ సర్పంచ్.
‘‘తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకూ ఇంట్లో ఆడవారికి క్షణం తీరిక దొరకదు. కానీ వారి కష్టం ఎవరికీ పట్టదు. వారి ఆదేవన అరణ్యరోదన. కనీస గుర్తింపునకు నోచుకోని జీవితాలు గృహిణులవి. కాలంతో పోటీపడి పరుగెడుతున్నా... ప్రపంచం మన అరచేతులోకి వచ్చేసినా... మా గ్రామంలో ఇంకా అసమానతలే. ఇది నన్ను కలచివేసింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఎవరో ఒకరు తొలి అడుగు వేయాలి. నేను చేసింది అదే. సర్పంచ్‌గా నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని... గ్రామీణ మహిళల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశాను. పంజాబ్ బతిండా జిల్లా మానక్‌ఖానా గ్రామం మాది. చిన్నప్పటి నుంచి నేను చదువులో ముందుండేదాన్ని. సివిల్స్ సాధించాలన్నది ఆశయం. దాని కోసం ఢిల్లీలో చదువుకొంటూ సన్నద్ధమయ్యాను.
గ్రామానికి తిరిగివచ్చి...
సివిల్స్ కోసం కఠోరంగా శ్రమించాను. 2018లో తొలిసారి పరీక్ష రాశాను. కానీ విఫలమయ్యాను. అది నన్ను బాగా కుంగదీసింది. అంత కష్టపడినా ర్యాంకు సాధించలేకపోవడంతో తిరిగి మా గ్రామానికి వచ్చేశాను. ఈసారి ఇంటి దగ్గరే ఉండి చదువుకొందామని నిర్ణయించుకున్నాను. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరోలా తలుస్తుందంటారు. నా విషయంలోనూ అదే జరిగింది. మా ఊళ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని... నన్ను సర్పంచ్‌గా ఉండమని అడిగారు. పురుషాధిక్యం ఉన్న మా ప్రాంతంలో ఒక మహిళకు ఇలాంటి అవకాశం రావడం అరుదైన పరిణామం. గతంలో మా గ్రామంలో ఏ మహిళ కూడా ఈ పదవిని అలంకరించలేదు. దాంతో అడగంగానే సరేనన్నాను.
మార్పు వైపు తొలి అడుగు...
సర్పంచ్ అయ్యాను. బానే ఉంది. కానీ అసలు సర్పంచ్‌గా నా విధులు, అధికారాలు ఏమిటన్న దానిపై స్పష్టత లేదు. ఎక్కడ మొదలు పెట్టాలి? ఎలా మొదలుపెట్టాలి? అంతా అయోమయం. కానీ మార్పు తేవడానికి నాకు లభించిన అద్భుత అవకాశం ఇది. దీన్ని వదులుకోకూడదని నిశ్చయించుకున్నాను. ఢిల్లీలో ఉండగా మహిళా సాధికారతకు సంబంధించి నేను కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశాను. ఆ అనుభవం నాకు ఇక్కడ పనికివచ్చింది. ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేందుకు కావల్సిన అంశాలపై దృష్టి పెట్టాను. అంతేకాదు, ఎప్పుడూ గుమ్మం దాటని ఆడవారి జీవితాల్లో వెలుగులు నింపి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా పని చేయాలని అనుకున్నా. అందులో భాగంగా తొలుత తమ ఆశయాల సాధన దిశగా మహిళలను ప్రోత్సహించాను.
గ్రంథాలయంతో మొదలు...
ఆరంభంలో అందరూ నన్ను అవహేళన చేశారు. నీవల్ల ఏమవుతుందంటూ ప్రశ్నించారు. ఎవరు ఏమన్నా, ఎంత నిరుత్సాహపరిచినా... నా సామర్థ్యం ఏమిటో నాకు తెలుసు. సర్పంచ్‌గా నా తొలి ముద్ర గ్రంథాలయ నిర్మాణం. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పనుల వంటివి పక్కన పెట్టి ఎవరికీ ఉపయోగంలేని గ్రంథాలయం ఏంటని చాలామంది ప్రశ్నించారు. నాకు పిచ్చి పట్టిందని కొందరు వ్యాఖ్యానించారు. అది ఒక భవనం మాత్రమే కాదు... గ్రామంలోని భవిష్యత్ తరాల ఆశలు, ఆశయాలకు ఒక చిహ్నమని చెప్పాను. పిల్లల ఎదుగుదలలో గ్రంథాలయాల పాత్ర ప్రముఖమైనదని వివరించాను. అందులో అన్ని వయసులవారికీ ఉపయోగపడేలా పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విలువైన పుస్తకాలు పెట్టాము. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు అమర్చాం. క్రమంగా గ్రామస్తులందరూ గ్రంథాలయానికి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు.
కన్నీళ్లు పెట్టుకున్నారు...
గ్రామ అభివృద్ధితో పాటు మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఆ క్రమంలోనే ఇంటి ముందు నేమ్ ప్లేట్లు నన్ను ఆకర్షించాయి. అవి చూసినప్పుడు అనిపించింది... ‘వాటిపై మగవారి పేరు మాత్రమే ఎందుకు రాయాలి’ అని! గృహిణుల పేరుతో నేమ్ ప్లేట్లు రాయించాను. ప్రతి ఇంటి ముందూ వాటిని తగిలించాము. అవి చూసుకొని మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టావంటూ’ కృతజ్ఞతలు చెప్పారు. ఒక యువతి నా దగ్గరకు వచ్చి... ‘ఇప్పటివరకు నన్ను బయటకు అడుగుపెట్టనివ్వలేదు. నా నిర్ణయాలు నేను తీసుకొనే స్వేచ్ఛ లేదు. కానీ ఇవాళ ఇంటి ముందు నా పేరు చూసినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా ఒక మహిళ పేరుతో డోర్ ప్లేటు కనిపించడం మా ఊళ్లో ఇదే మొదలు. ఈ ఏడాది సర్పంచ్‌గా నా పదవీకాలం అయిపోయింది. కానీ మహిళను సాధికారత వైపు నడిపించేందుకు, వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నా పయనం సాగుతూనే ఉంటుంది.’’
మహిళలకు ప్రత్యేకం...
మార్పు వైపు నేను వేసిన మలి అడుగు... మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక పార్కు ఏర్పాటు. నిత్యం ఇంటి పనుల్లో తలమునకలయ్యే ఆడవారికి తమకంటూ కాస్త సమయం కూడా దొరకదు. సరదాగా కాసేపు సేద దీరేందుకు అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, తీరిక సమయంలో కాస్తంత ఆహ్లాదంగా గడిపేలా ఈ పార్కును తీర్చిదిద్దాము. ఇది స్థానిక మహిళల్లో గణనీయమైన మార్పునకు కారణమైంది. ఒక్కొక్కరుగా ఇంటి నుంచి బయటకు వచ్చి, స్వేచ్ఛగా కాసేపు పార్కులో గడుపుతున్నారు. స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకో గలుగుతున్నారు. అంతకముందు ఇక్కడ మహిళల కోసం ఎలాంటి ప్రత్యేక సదుపాయాలూ లేవు.
Updated Date - Dec 26 , 2024 | 06:34 AM