శ్రీగణేశ తత్త్వం
ABN, Publish Date - Sep 06 , 2024 | 06:00 AM
శ్రీగణేశుణ్ణి వినాయకచవితి రోజున పూజ చేసుకోవడం, ఆ రోజు ఆయన జన్మ వృత్తాంతాన్ని ‘వినాయక వ్రతకల్పం’లో చదవడం, ఇళ్ళలో జరిగే శుభకార్యాలల్లో ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవడం... ఇవి అందరూ అనుసరిస్తున్నవే. పార్వతీదేవి నలుగుపిండితో...
సహజయోగ
శ్రీగణేశుణ్ణి వినాయకచవితి రోజున పూజ చేసుకోవడం, ఆ రోజు ఆయన జన్మ వృత్తాంతాన్ని ‘వినాయక వ్రతకల్పం’లో చదవడం, ఇళ్ళలో జరిగే శుభకార్యాలల్లో ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవడం... ఇవి అందరూ అనుసరిస్తున్నవే. పార్వతీదేవి నలుగుపిండితో (భూతత్త్వంతో) వినాయకుణ్ణి సృష్టించడం, తను స్నానానికి వెళ్ళినప్పుడు వినాయకుణ్ణి కాపలాగా పెట్టడం, శివుడు లోపలికి ప్రవేశించకుండా అతను అడ్డుకోవడం, కోపోద్రిక్తుడైన శివుడు అతని తలను ఖండించడం, తదనంతరం ఏనుగు తలను అతనికి శిరస్సు స్థానంలో అతికించడం, త్రిమూర్తులు, ఇతర దేవతలు తమ శక్తులను, ఆయుధాలను గణేశుడికి ప్రసాదించడం... ఇవన్నీ పురాణగాథగా మనకు ఇంతకుమునుపే తెలుసు. కానీ గణేశుణ్ణి గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది. గణేశతత్త్వం ఒక మహా విజ్ఞాన సర్వస్వం. గణేశతత్త్వం గురించి సహజయోగ ప్రదాత శ్రీమాతాజీ నిర్మలాదేవి అనేక ప్రవచనాలలో ప్రస్తావించారు.
విశ్వ సృష్టి ఆరంభంలో... అంతా అంధకారం, శూన్యం. ఉన్నది ఒక్క సదాశివుడే. ఆయన తనలో భాగమైన ఆదిశక్తిని తననుంచి వేరు చేశాడు. తన అభీష్టం మేరకు చరాచర సృష్టి చెయ్యాలని దూరంగా పంపించాడు. ఆ క్రమంలో ఏర్పడిన భీకర శబ్దమే... ప్రప్రథమ నాదం... ఓంకారం. ఆ ఓంకారమే ఆదిదంపతుల ప్రథమ సృష్టి అయింది. అదే మంగళకరం, శుభప్రదం అయిన పవిత్రతామూర్తిని... శ్రీగణేశుణ్ణి సృష్టించింది. ఆ విధంగా పవిత్రతకు ప్రతీకగా, నిరాకారుడిగా శ్రీగణేశుడు ఆవిర్భవించాడు. ఓంకారం కూడా శ్రీగణేశుడి నిరాకారరూపమే. ఓంకార స్వరూపుడైన శ్రీగణేశుడు... చైతన్య రూపంలో విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు.
మానవ శరీరంలో అంతర్గతంగా ఏడు శక్తికేంద్రాలు... అంటే చక్రాలు, మూడు నాడులతో సూక్ష్మశరీర వ్యవస్థ భగవంతుడి శక్తితో నిర్మితమైన ఉంది. ఒక్కొక్క చక్రం, నాడి ఒక్కొక్క అధిష్టాన దేవత ఆధీనంలో ఉంటాయి. అన్నిటికన్నా ప్రప్రథమమైన మూలాధార చక్రంలో శ్రీగణేశుడు అధిష్టించి ఉంటాడు. అందుకే ఆయనకు ప్రథమ పూజ నిర్వహిస్తారు. గణేశుణ్ణి ఆరాధించడానికి ముందు ఆయన తత్త్వాన్ని, గుణాలను, లక్షణాలను తెలుసుకుందాం.
ఎవరైతే పవిత్రమైన నడవడికను కలిగి ఉంటారో.. వారిపట్ల గణేశుడు అత్యంత ప్రసన్నుడిగా ఉంటాడు. అందుకే ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నిటినీ శ్రీగణేశుణ్ణి ప్రసన్నం చేసుకొనే విధంగా... పవిత్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఋషులు రూపొందించారు. మూలాధార చక్రం పంచభూతాలలోని భూతత్త్వంతో నిర్మితమయింది. కాబట్టి మనం భూమాతను ఎంతగా గౌరవిస్తే... గణేశుడు అంతగా అనుగ్రహిస్తాడు. సామరస్య ధోరణి కూడా ఆయన తత్త్వమే. మన కుటుంబ సభ్యుల మధ్య, వ్యక్తుల పట్ల ఆహ్లాదకరమైన సామరస్య దృష్టిని ఏర్పరచుకోవడానికి ఈ తత్త్వం ఉపయోగపడుతుంది. బలమైన కుటుంబ వ్యవస్థకు, ఆరోగ్యకరమైన సమాజానికి ఈ తత్త్వం అత్యవసరమని శ్రీమాతాజీ నిర్మలాదేవి స్పష్టం చేశారు.
గణేశుడిలోని మరొక విశిష్టత... ఆయనలోని జ్ఞాన సంపద. మనలోని జ్ఞానబీజం ఎదిగేకొద్దీ అప్రయత్నంగానే మనల్ని ధార్మికతలోను, ధర్మనిరతిలోను ఉంచుతుంది. ఈ తత్త్వం మనలో పెంపొందినప్పుడు... ఇతరులతో అకారణంగా దూకుడుతో వ్యవహరించం. పరులను హింసించం. మనది కానిది ఏదీ ఉచితంగా ఆశించం. ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన జ్ఞానం శ్రీగణేశుడి వల్లనే వస్తుంది. అప్పుడు మనలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. చదువులో మంచి ఫలితాలను సాధించగలం. అంతేకాదు, ఇది పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. అయితే... శ్రీగణేశుడు మనలోనే ఉన్నాడనే స్పృహ, సమర్పణభావం మనలో ఉండాలి. తద్వారా సమాజంలోని వాతావరణం పవిత్రంగా, నిర్మలంగా ఉంటుంది.
మనలోని కుండలినీశక్తి ఉత్థానం శ్రీగణేశుడి అనుమతితోనే జరుగుతుంది. ఆత్మసాక్షాత్కారం పొందుతున్న సమయంలో.. కుండలిని జాగృతం చెందినప్పుడు... ఆ గణేశుని జ్ఞానమే మన మెదడులోకి చేరుతుంది. ఎందుకంటే కుండలినిలో ఉన్న శక్తి ఆయనే. ఆ జ్ఞానాన్ని గనుక పొందితే... అన్ని చెడు అలవాట్లను, తప్పుడు ఆలోచనలను, అధర్మమైన, అనైతికమైన పనులను అప్రయత్నంగా మీరు విడిచిపెడతారు. అది జరగాలంటే... గణేశతత్త్వం మీలో పెంపొందాలంటే... పసిపిల్లల్లో ఉండే అమాయకత్వం మీలో ఉండాలి. దాన్నే ‘అబోధిత తత్త్వం’ అంటారు. దాన్ని అనుసరిస్తే మనిషి ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. భగవత్ సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతి లభిస్తుంది.
గణేశుడు సర్వశక్తిమంతుడు. ఆదిశక్తి అయిన జగదంబ సృష్టించిన గణాలకు ఆయనే అధిపతి. మూలాధార చక్రంలోని అసమతుల్యత, లోపాలే మనలో కలిగే అనేక శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు, రుగ్మతలకు కారణం. గణేశుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే... కేవలం పూజించడం మాత్రమే కాకుండా... ఆయన తత్త్వాన్ని అర్థం చేసుకోవాలి. సమతుల్యత, సామరస్యం, అబోధిత తత్త్వం, సచ్ఛీలత, నిర్మలచిత్తం, సమర్పణ భావం, వినయ విధేయతలు, ఆత్మవిశ్వాసం, వివేకం, నిర్భయత్వం, ధర్మనిరతి లాంటి సద్గుణాలను గ్రహించి, మనలో స్థిరపరుచుకోవాలి. అదే నిజమైన ఆరాధన. ఇవన్నీ గణేశుని అనుగ్రహంవల్లే ప్రాప్తిస్తాయి. శ్రీమాతాజీ నిర్మలాదేవి ప్రవేశపెట్టిన సహయోగ సాధన దీనికి దోహదపడుతుంది.
డాక్టర్ పి. రాకేష్ 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
Updated Date - Sep 06 , 2024 | 06:00 AM