Navya : బ్రిటన్‌కు పన్ను పాఠాలు
ABN, Publish Date - Jun 24 , 2024 | 02:09 AM
తెలుగు నేలపై పుట్టి... విదేశీ గడ్డపై అడుగుపెట్టి... మన కీర్తిని ఎలుగెత్తి చాటారు అర్చనారావు దన్నమనేని. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) రెవెన్యూ అండ్ కస్టమ్స్ విభాగంలో సీనియర్ సివిల్ సర్వెంట్‌గా విధులు నిర్వరిస్తున్న ఆమె...
తెలుగు నేలపై పుట్టి... విదేశీ గడ్డపై అడుగుపెట్టి... మన కీర్తిని ఎలుగెత్తి చాటారు అర్చనారావు దన్నమనేని. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) రెవెన్యూ అండ్ కస్టమ్స్ విభాగంలో సీనియర్ సివిల్ సర్వెంట్‌గా విధులు నిర్వరిస్తున్న ఆమె... అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సరికొత్త విధానాలతో ఆ దేశ ఖజానాకు రెండు బిలియన్ పౌండ్స్ ఆదాయం సమకూర్చినందుకు గుర్తింపుగా... ప్రతిష్టాత్మక ‘మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ (ఎంబీఈ) అవార్డుకు ఎంపికయ్యారు. ఆ విశేషాలను యూకే నుంచి 38 ఏళ్ల అర్చనారావు ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘ఎక్కడో భారత్ నుంచి వచ్చి... ఒంటరిగా ప్రయత్నించి... ఇవాళ ఈ స్థాయిలో నిలబడ్డానంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగూ... అంకితభావంతో చేసే ప్రతి పనీ... నిజాయితీగా పడే కష్టం... మనల్ని విజయానికి చేరువ చేస్తాయి. అందుకు ఇవాళ నాకు దక్కిన ‘మెంబర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ (ఎంబీఈ) అవార్డు ప్రత్యక్ష సాక్ష్యం.
వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించే పౌరులకు యూకేలో ఈ అవార్డు ఇస్తారు. ఇక్కడ నేను రెవెన్యూ అండ్ కస్టమ్స్ (హెచ్‌ఎంఆర్సీ) విభాగంలో సీనియర్ సివిల్ సర్వెంట్‌ని. కర్తవ్య నిర్వహణలో నా సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నేను తీసుకువచ్చిన కొన్ని నూతన పద్ధతులవల్ల దేశ ఖజానాకు గతంలో ఎన్నడూ లేని విధంగా మా విభాగం నుంచి రెండు బిలియన్ పౌండ్స్‌కు పైగా ఆదాయం సమకూరింది.
ఆ మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు తదితర అవసరాలకు వినియోగిస్తారు. రికార్డు స్థాయిలో ఇంత ఆదాయం రావడానికి ప్రధాన కారణం... గతంలో ఉన్న లోతుపాతులను సవరించి నేను ఒక విధానం రూపొందించాను. ఇది నేను పని చేసే ‘వీఏటీ’ (వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్) శాఖకే కాకుండా... ఇక్కడి అన్ని రకాల పన్నుల వసూలుకూ ఉపయోగకరంగా మారింది. పన్నుల్లో ఉన్న అంతరాలను తగ్గించి, జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది.
అరుదైన గౌరవం...
ఈ అవార్డు ఎంపిక కోసం స్వయంప్రతిపత్తి కలిగిన హానర్స్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను వడపోసి, జాబితాను ప్రధానికి ప్రతిపాదిస్తుంది. ఆ ప్రతిపాదనలను ప్రధాని... కింగ్ చార్లెస్ ముందు ఉంచుతారు. ఆయన ఆమోదంతో నన్ను అవార్డుకు ఎంపిక చేశారు. త్వరలో బకింగ్‌హామ్ ప్యాలె్‌సలో కింగ్ చేతుల మీదుగా ఎంబీఈ అవార్డు అందుకోబోతున్నాను. భారత్‌లో పద్మ అవార్డుల్లా ఇక్కడ ‘నైట్‌హుడ్, ఓబీఈ, ఎంబీఈ’ ప్రధానమైనవి. ‘నైట్‌హుడ్’ వస్తే వాళ్ల పేరు ముందు ‘సర్’ అని పెట్టుకోగలుగుతారు. నాకు ‘ఎంబీఈ’ వచ్చింది కాబట్టి నా పేరు తరువాత ‘ఎంబీఈ’ అని అఫీషియల్‌గా రాసుకోవచ్చు. యూకేలో వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. నాకు ఈ అవార్డు ప్రకటించాక... దేశంలోని రాజకీయ ప్రముఖులు, సన్నిహితుల నుంచి వందల సంఖ్యలో అభినందనల సందేశాలు వస్తున్నాయి. సాధారణంగా నా వయసు వారికి ఈ అవార్డు రావడం చాలా చాలా అరుదు.
నేను నా వృత్తికే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను. పేదలు చదివే స్థానిక స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి సివిల్ సర్వీసెస్ అంటే ఏమిటి? మేమేం పని చేస్తాము? ఆ పరీక్షల్లో ఎలా రాణించాలి? తదితర విషయాలపై పిల్లలకు అవగాహన కల్పిస్తుంటాను. వాళ్లకు నన్నొక ఆదర్శంగా చూపి, తద్వారా సివిల్స్ వైపు ప్రోత్సహించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా. అలాగే కొంతమంది కాలేజీ పిల్లలకు ‘జాబ్ షాడో’, అంటే మా కార్యాలయానికి వచ్చి నేను మా పని చూసే అవకాశం కల్పిస్తున్నాం. వీటితోపాటు మా జూనియర్స్‌కు కూడా శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకున్నాను.
నమ్మలేకపోతున్నాను...
ఈ అవార్డు రావడాన్ని అత్యంత గౌరవంగా భావిస్తున్నా. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఎందుకంటే ఇప్పటివరకు నేను చూసినవారిలో పెద్ద పెద్ద క్రీడాకారులు, ప్రముఖులు అవార్డు అందుకున్నవారిలో ఉన్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ లాంటివారు దీని కోసం కలలు కంటున్నారు. అంతటి ప్రతిష్టాత్మక పురస్కారం నాకు లభించిందంతే చాలా సంతోషంగా ఉంది. వేరే దేశం నుంచి వచ్చి, ఇక్కడ చదువుకొని, ఉద్యోగం చేస్తున్న నాకు దక్కడం నిజంగా అద్భుతంగా అనిపిస్తోంది. మా విభాగంలో ‘ఎంబీఈ అవార్డు’ అందుకోబోతున్న మొదటి వ్యక్తిని నేనే. నా పనిని నేను ఆస్వాదిస్తాను. అదే నా విజయ రహస్యం. అసలు అవార్డు కమిటీకి నా పేరు ఎవరు ప్రతిపాదించారో కూడా తెలియదు. గెజిట్‌లో ప్రచురితమయ్యాకే నేనూ చూశాను.
అంచెలంచెలుగా...
నేను సీనియర్ ట్యాక్స్ ప్రొఫెషన్ మేనేజర్‌ని. అలాగే ‘వీఏటీ’లో మా యార్క్‌షైర్ రీజియన్‌కు సీనియర్ ట్యాక్స్ స్పెషలి్‌స్టను కూడా. మా దేశంలోని బడా కంపెనీలు... అంటే మైక్రోసాఫ్ట్, జీఈ క్యాపిటల్ లాంటి రెండొందల బిలియన్ల టర్నోవర్ దాటిన బిజినె్‌సకు సంబంధించి ట్యాక్స్ కలెక్షన్ నా విధి. నేను డీల్ చేసిన ప్రతి కేసులోనూ ఏదో ఒక తప్పు పట్టుకోగలిగాను. అలాంటివి పునరావృతం కాకుండా ఒక విధానం తీసుకువచ్చాను. యూకేలో నేను చేస్తున్న ఈ ఉద్యోగం భారత్‌లో సివిల్ సర్వీ్‌సతో సమానం. అక్కడ యూపీపీఎ్‌ససీలానే... ఇక్కడా పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధించి, 2014లో ఈ పోస్టు సంపాదించాను. అయితే ఎంపికయ్యాక నాలుగేళ్ల శిక్షణ ఉంటుంది. తరువాత మళ్లీ పరీక్ష పెడతారు. అందులో ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగం పోతుంది. అన్ని మెట్లూ ఎక్కి... ఇలా స్థిరపడ్డాను. నాటి నుంచి వివిధ హోదాల్లో పని చేస్తూ అంచలంచలుగా ఎదిగాను.
ఒకే ఒక్క లక్ష్యంతో...
నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. టెన్త్ వరకు ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’లో చదివాను. చెన్నై ‘ఎస్‌ఆర్‌ఎం’లో ఇంజనీరింగ్ (ఈసీ) చేశాను. స్కాట్‌లాండ్ రాజధాని ఎడిన్‌బరాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విత్ హ్యూమన్ రీసోర్సెస్ మాస్టర్స్ (2008) చదివాను. అవ్వగానే కొన్నేళ్లు లీడ్స్‌లోని ఓ కంపెనీ హెచ్‌ఆర్ విభాగంలో పని చేశాను. అప్పుడు కూడా పద్ధెనిమిది వేల మంది సిబ్బంది బాధ్యతలు చూసుకొనేదాన్ని. అయితే చిన్నప్పటి నుంచి నా ఆకాంక్ష ఏంటంటే... సివిల్స్ సాధించాలని. భారత్‌లో ఉన్నా కచ్చితంగా దాని కోసమే ప్రయత్నించేదాన్ని. యూకేలో ఉన్నాను కాబట్టి... ఇక్కడ పట్టుబట్టి సాధించాను. అప్పటి నుంచి హెచ్‌ఎంఆర్సీలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నాను.
స్వయంకృషితో సాధించాలని...
ఇంజనీరింగ్ చదివేటప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో చాలా కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. కానీ మాస్టర్స్ చేయాలన్నది నా ధ్యేయం. మా అమ్మ నీరజ, నాన్న అశోక్‌రావు కూడా ఓకే అన్నారు. ఏ అమెరికానో వెళ్లకుండా యూకే ఎందుకు వచ్చానంటే... ఇక్కడ మా కుటుంబ స్నేహితులు, బంధువులు ఎవరూ లేరు. యూఎస్, ఆస్ర్టేలియా తదితర దేశాల్లో చాలామంది ఉన్నారు. ఎవరి సాయం లేకుండా స్వయంకృషితో ఎదిగి, ఉన్నత స్థానంలో నిలవాలనేది నా సంకల్పం. మా అమ్మానాన్నలకు నేను ఒకేఒక్క కూతుర్ని అయినా... నా అభీష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. ముఖ్యంగా మా నాన్న ఎంతో ప్రోత్సహించారు. సివిల్స్ లక్ష్యం కనుక... 2014లో యూకే పౌరసత్వం రాగానే పరీక్ష రాశాను. ఎంపికయ్యాను.
నాలాగా మరికొందరిని...
వచ్చిన కొత్తల్లో నాతో చాలామంది చెప్పిందేమంటే... జాతి వివక్ష ఉంటుందని. పరాయి దేశస్తులు ఉన్నత స్థానాల్లో కనిపించడం చాలా అరుదనీ అన్నారు. అలాంటిది నేను సివిల్స్ సర్వెంట్‌ను అయ్యాక... వారంతా నన్ను తమ రోల్ మోడల్‌లా భావిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ అవార్డు వచ్చినందుకు నాకంటే వాళ్లే ఎక్కువ సంతోషపడుతున్నారు. వాళ్లు తమ లక్ష్యాలు సాధించడానికి ‘లీడర్‌షిప్ ప్రోగ్రామ్’ ద్వారా నేను కూడా సహకరిస్తుంటాను. సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారికి మెళకువలు నేర్పి, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాను.
నేనేంటో నాకు తెలుసు...
నేను నిర్వహించే ఖాతాలన్నీ దేశంలోని టాప్ కంపెనీలవి. వాళ్లకు డబ్బు కావచ్చు, న్యాయకోవిదుల బృందం కావచ్చు... చాలా బలంగా ఉంటాయి. వారికి వ్యతిరేకంగా మనం ఏదైనా వాదించి, నెగ్గుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సంపన్నులు కనుక ఏదైనా పొందగలమనే ఒక అహంకారం ఉంటుంది వారికి. మనకు సంబంధిత విషయాల మీద పూర్తిస్థాయి అవగాహన, నైపుణ్యం లేకపోతే అడుగు ముందుకు వేయలేం. అలాంటి సవాళ్లు నేను అనేకం ఎదుర్కొన్నాను. చాలా కేసుల్లో నెగ్గాను. ఆత్మవిశ్వాసంతో అన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాను. ఇవన్నీ వృత్తిలో భాగం. నేనేంటో నాకు తెలుసు. కనుకనే ఎదుటి వ్యక్తి ఎంతటివారైనా బెదిరేది లేదు. అదేవిధంగా మేమంటే వాళ్లూ భయపడతారు. ఎందుకంటే ఏ చిన్న తప్పు పట్టుకున్నా అది ఆ కంపెనీ మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది కదా.
వివక్ష చూశాను...
మావారు కూడా లీడ్స్ యూనివర్సిటీలో చదువుకున్నారు. మా మామగారు సింగరేణిలో పని చేసేవారు. మేం ప్రస్తుతం లీడ్స్‌లో ఉంటున్నాం. మా అమ్మానాన్నలా మావారు కృష్ణకిషోర్ కూడా నాకు ఎంతో మద్దతునిస్తారు. ప్రోత్సహిస్తారు. ఆయనా మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఇక్కడ కూడా మహిళల పట్ల వివక్ష కనిపిస్తుంది. నా విషయమే తీసుకొంటే... హఠాత్తుగా ఒక మహిళను ఇలా ఉన్నత స్థానంలో చూసే సరికి కొందరు తట్టుకోలేకపోయారు. మొదట్లో నేను ఒక కంపెనీకి వెళ్లినప్పుడు ఇంగ్లీ్‌షవాళ్లు... ‘ఏంటీ..! ఇంత చిన్న పిల్లల్ని కూడా ఇప్పుడు బయటకు పంపుతున్నారా’ అని అన్నారు. ఇలాంటివెన్నో దాటి ఇవాళ నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే ఎంతో గర్వంగా ఉంది. నేను పని చేస్తున్న విభాగానికే కాదు... మొత్తం సివిల్ సర్వీ్‌సకు కూడా ఇక్కడ ఒక హెడ్ ఉంటారు. ఆ స్థాయికి చేరాలన్నది నా ఆశయం.’’
హనుమా
Updated Date - Jun 24 , 2024 | 02:09 AM