Apricot Benefits: ఆరోగ్యదాయిని ఆప్రికాట్
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:18 AM
ఆప్రికాట్ తినడానికి రుచికరంగా ఉంటుంది. దీనితో తయారు చేసే తీపి పదార్థాలను పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. రెండు ఆప్రికాట్ పండ్లను రాత్రి నీళ్లలో నానబెట్టి రోజూ ఉదయాన్నే తినడంవల్ల అనారోగ్యం దరిచేరదు.
ఆప్రికాట్ తినడానికి రుచికరంగా ఉంటుంది. దీనితో తయారు చేసే తీపి పదార్థాలను పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. రెండు ఆప్రికాట్ పండ్లను రాత్రి నీళ్లలో నానబెట్టి రోజూ ఉదయాన్నే తినడంవల్ల అనారోగ్యం దరిచేరదు.
మలబద్దకానికి: ఆప్రికాట్‌లో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. రోజూ ఈ పండు తినడంవల్ల మలబద్దకం దూరమవుతుంది. దీనిలోని కెరోటినా యిడ్స్ పెద్ద పేగు, చిన్న పేగుల్లో క్యాన్సర్ రాకుండా చేస్తాయి. జీర్ణాశయంలో సమస్యలను నివారించి జీర్ణక్రియకు సహకరిస్తాయి.
కంటిచూపుకి: ఈ పండులో ఉండే ఎ విటమిన్ కంటి సమస్యలను నివారిస్తుంది. రోజూ ఉదయాన్నే ఈ పండు తినడంవల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి రెటీనాకు రక్షణ లభిస్తుంది. కళ్ల నుంచి నీరు కారడం, కళ్లలో పొరలు పెరగడం వంటి సమస్యలు తలెత్తవు.
గుండెకు: ఆప్రికాట్‌లోని పీచు పదార్థం రక్తంలో చేరిన కొలెస్ట్రాల్‌ను కరిగించి శరీరమంతా రక్తప్రసరణ జరిగేలా చూస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు రావు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచి మధుమేహం రాకుండా కాపాడతాయి.
ఎముకలకు: తరచూ ఆప్రికాట్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, పాస్పరస్ లాంటి ఖనిజ లవణాలు అంది ఎముకలు దృఢంగా మారతాయి. కండరాలు పట్టేయడం, కీళ్లనొప్పులు వంటి సమస్యలను నివారిస్తాయి.
వాపులకు: ఆప్రికాట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతాయి. వెన్ను నొప్పి, మెడనొప్పి, కడుపులో మంట, అరికాలి మంటలు, తిమ్మిర్లు, మోకాళ్ల సమస్యలను నివారిస్తాయి.
చర్మానికి: ఆప్రికాట్‌ను తరచూ తింటూ ఉంటే చర్మం తేమతో నిండి కాంతివంతంగా మారుతుంది. దీనిలోని సి, ఎ, కె విటమిన్లు; ఫైటో న్యూట్రియెంట్స్ చర్మానికి పోషణను అందిస్తాయి. మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తాయి.
Updated Date - Dec 21 , 2024 | 03:39 AM