ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Acne Remove Tips: మొటిమలకు ఇలా చెక్ పెట్టండి..!

ABN, Publish Date - Aug 18 , 2024 | 01:22 PM

మొటిమల సమస్యలు రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఆహారంలో తగిన పోషకాలు లేకపోవడం, ఏవైనా కొన్ని ఆహార పదార్థాలు సరిపడకపోవడం, హార్మోను సమస్యల వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది. సమస్య మూలాన్ని తెలుసుకోవడం ద్వారా...

prevent pimples

నాకు మొటిమల సమస్య చాలా ఎక్కువగా ఉంది. తగినన్ని నీళ్లు తాగుతాను. పండ్లు, కూరగాయలు కూడా ఎక్కువగానే తీసుకొంటాను. ముఖానికి క్రీములు, పౌడర్లు లాంటివి రాయడం కూడా మానేసాను. అయినా సమస్య తగ్గడం లేదు. ఆహారంలో ఇంకేమైనా మార్పులు చేసుకోవాలా?

- నందిని, భీమడోలు

మొటిమల సమస్యలు రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఆహారంలో తగిన పోషకాలు లేకపోవడం, ఏవైనా కొన్ని ఆహార పదార్థాలు సరిపడకపోవడం, హార్మోను సమస్యల వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది. సమస్య మూలాన్ని తెలుసుకోవడం ద్వారా పరిష్కారం వెదకవచ్చు. ఆహారంలో తీపి పదార్థాలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌ మానేయాలి. పండ్లు కూడా జ్యూస్‌ చేయకుండా పీచుతో పాటుగా తింటేనే మంచిది. నీరు తగినంత తాగడం, రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం, ఆందోళన తగ్గించుకోవడం ముఖ్యం. బయటికి వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరచుకోవడం, మాటిమాటికి చేతులు మొటిమలపై పెట్టకుండా ఉండడం వల్ల కూడా మొటిమల మచ్చలు ఏర్పడకుండా చూసుకోవచ్చు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంటి చిట్కాలు పాటించడం కంటే చర్మ వైద్య నిపుణులను సంప్రదించి సలహా పొందడం మంచిది.


మధుమేహం ఉన్నవారు కూడా తినగలిగే ప్రత్యేకమైన మిఠాయిలు చాలా రోజుల నుండి మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో వాడే పదార్థాలు మంచివేనా? తింటే ఎటువంటి ఇబ్బందులూ రావా? ఎంత మోతాదులో తీసుకోవచ్చు?

- జనార్దన్‌ రెడ్డి, వరంగల్‌

మధుమేహం ఉన్నవారు కూడా తినేవిధంగా చక్కెర, బెల్లం, తేనెతో కాకుండా కొన్ని రకాల ప్రత్యామ్నాయ తీపికారకాలతో ఈ మధ్య స్వీట్లు, కేకులు మొదలైనవి మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో తీపినిచ్చే పదార్థాలు రక్తంలో గ్లూకోజు పెంచేవి కాకపోవడం వల్ల మధుమేహం ఉన్నవారు పరిమిత మోతాదులో తీసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ కేవలం తీపి పదార్థాలైన చక్కెర, బెల్లం మాత్రమే రక్తంలో గ్లూకోజు పెంచుతాయి అనుకుంటే పొరపాటే. స్వీట్లు, కేకులు, బిస్కెట్లు మొదలైన పదార్థాల తయారీలో వాడే మైదా పిండి, గోధుమ పిండి, చిరుధాన్యాల పిండి, రాగి పిండి, జొన్న పిండి, బియ్యప్పిండి మొదలైనవన్నీ కూడా రక్తంలో గ్లూకోజును కొంత పెంచుతాయి. కాబట్టి తీపికోసం ప్రత్యామ్నాయాలు వాడినా, మైదా, బియ్యప్పిండి బదులు కొద్దిగా ఆరోగ్యకరమైన పిండి వాడినా రక్తంలో గ్లూకోజు పరిమితంగా అయినా పెరగడం తథ్యం. వీటితో పాటు ఈ పదార్థాలన్నిటిలోనూ కొవ్వులు అధికంగా ఉంటాయి. అందువల్ల అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. తయారీకి వాడిన పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైనవైనా తీపి పదార్థాలను, చిరుతిళ్ళను మితంగానే తీసుకోవాలి.


నాకు 52 ఏళ్ళు. మోకాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి. ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు?

- శైలజ, వనపర్తి

మోకాళ్ళు, మోచేతులు, మణికట్టు ఇలా కీళ్లు ఉన్న చోట్ల ఎముకల రాపిడి ఉంటుంది. అక్కడ కీళ్లు అరగకుండా ఉండేందుకు సినోవియల్‌ ఫ్లూయిడ్‌ అనే గుజ్జు లాంటి పదార్థం చుట్టూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సినోవియల్‌ ఫ్లూయిడ్‌ తగ్గుతుంది. అందుకే ఎముకలు రాపిడితో కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం పెరుగుతుంది. వాపు తగ్గేందుకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండే అన్ని రకాల పండ్లు, కాయగూరలు రోజూ తినాలి. కొన్ని రకాల ఆహారం సినోవియల్‌ ఫ్లూయిడ్‌ తగ్గకుండా ఆపేందుకు ఉపయోగపడుతుంది. చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్‌ గింజలు, నువ్వులు, బాదం లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, పసుపులో ఉండే కర్క్యుమిన్‌ అనే పదార్థం, అన్ని రకాల ఆకుకూరలు, ఇవన్నీ కీళ్ల నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఫిజియోథెరపీ ద్వారా కండరాలను బలపరిస్తే కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - Aug 18 , 2024 | 01:22 PM

Advertising
Advertising
<