ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : వారే అసలైన యోగులు...

ABN, Publish Date - Jun 21 , 2024 | 12:46 AM

మనిషి తాను ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు వెతుకుతూ ఉంటాడు. సరైన దిశా నిర్దేశం లేక ఒత్తిడికి గురవుతూ ఉంటాడు.

సహజయోగ

వారే అసలైన యోగులు...

మనిషి తాను ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు వెతుకుతూ ఉంటాడు. సరైన దిశా నిర్దేశం లేక ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. జీవితం అంటే మనిషి నిరంతరం తనతో తాను చేసే యుద్ధమే. మనిషి ఆనందంగా జీవితాన్ని కొనసాగించడానికీ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికీ... ముఖ్యంగా ఆధ్యాత్మికతవైపు పయనించడానికీ, సమాజంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి కృషి చేసిన వ్యక్తి శ్రీమాతాజీ నిర్మలాదేవి. మనుషులు తమలో ఉన్న దైవిక శక్తిని గుర్తించి, కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందే ప్రక్రియకు ఆమె శ్రీకారం చుట్టారు. ఆమె అందించిన యోగమే సహజయోగం. ‘‘అందరూ సహజ యోగంలోకి రండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. జీవితాన్ని సాఫల్యం చేసుకోండి. జన్మను ధన్యం చేసుకోండి. మోక్ష ప్రాప్తిని పొందండి’’ అంటూ ఆమె ప్రపంచ మానవాళికి సందేశాన్ని అందించారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం నూట నలభైకి పైగా దేశాల్లో కొనసాగుతోంది.


సహజయోగ ధ్యాన ఆవశ్యకత మనిషి జీవితంలో చాలా ఉంది. ఎందుకంటే మనతో పాటు జన్మించి, మనలోనే నిద్రాణమై ఉన్న శక్తిని, సృష్టి యావత్తూ వ్యాపించిన శక్తిని, భగవంతుడు ప్రసాదించిన శక్తిని... మళ్ళీ భగవంతుడితోనే కలపడం ఒక అద్భుత ప్రక్రియ. సహజయోగ ధ్యానంలో మనిషి మొదటగా తనలోని అంతర్గత శక్తి అయిన కుండలినీ శక్తి గురించి తెలుసుకుంటాడు. నిద్రాణ స్థితిలో ఉన్న ఆ కుండలినీ శక్తిని... మేల్కొలపడం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు. దాన్ని పొందిన సాధకుడు... భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల గురించి తన ఆలోచనలు తగ్గించుకొని... మధ్యేమార్గంలోకి వస్తాడు. ప్రస్తుత క్షణాన్ని ఆనందించే స్థితికి వస్తాడు. ఆ ఆనందకర స్థితి ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఆలోచనా విధానం మారుతుంది. సత్యంవైపు అడుగులు పడతాయి. తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆ ప్రయాణంలో మొదట తనలోని తమో, రజో గుణాలను వదలి... సత్వ గుణాన్ని అలవరచుకుంటాడు. సుషుమ్న మార్గంలో తన ప్రయాణాన్ని కుండలినీ శక్తి సాగించే సమయంలో... మనిషిలోని అవలక్షణాలను రుగ్మతలనూ తొలగిస్తుంది, అతని సూక్ష్మ శరీరంలో చైతన్యాన్ని నింపుతూ సహస్రారాన్ని చేరుతుంది. మనిషి ఆత్మ ప్రకాశాన్ని పొందుతాడు. భగవంతుడికి ప్రతిరూపమైన ఆత్మ తనలోనే కొలువై ఉందనే సత్యాన్ని గ్రహిస్తాడు. ఆత్మ, పరమాత్మ వేరు కాదనీ, రెండూ ఒక్కటేనని గుర్తిస్తాడు.


అయితే అంతా భగవంతుడే చేస్తున్నాడనే విషయాన్ని ఆత్మసాక్షాత్కారం ద్వారా తెలుకున్నప్పటికీ... మళ్ళీ మనిషి మాయలో పడుతూనే ఉంటాడు. అన్నీ తానే చేస్తున్నానని అనుకుంటాడు. అతనిలో తమో, రజో గుణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తి... ప్రతిరోజూ ధ్యానం ద్వారా... భూత, భవిష్యత్‌ ఆలోచనలను వదిలిపెట్టి, వర్తమానంలోకి రావడం కోసం సాధన చేయాలి. మాయ మనిషి వెన్నంటే ఉంటుంది. అందుకనే... ప్రతిక్షణం ‘నేను ఆత్మను, ఆత్మ పరమాత్మ వేరు కాదు’ అని గుర్తు చేసుకుంటూ ఉండాలి చిత్తాన్ని ఎప్పడూ సహస్రారంపై ఉండేలా చూసుకోవాలి. ఈ సాధన ద్వారా మనిషి వివేకాన్ని, శుద్ధ విద్యను, సంతృప్తిని, ధైర్యాన్ని, క్షమాగుణాన్ని పొంది... సత్వ గుణంలో స్థిరపడతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిని ‘యోగి’ అంటారు. ఆత్మను భగవంతుడిపై లగ్నం చేసి, మాయకు అతీతంగా... ఎవరైతే భగవంతునితో అనుసంధానమై జీవిస్తూ ఉంటారో... వారే అసలైన యోగులు. సహజయోగ సాధన ద్వారా మానసిక, శారీరక, భావనాత్మక, ఆధ్యాత్మిక అభివృద్ధిని మనిషి పొందగలడు. ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు ఆత్మసాక్షాత్కారం. ఆ ప్రక్రియను సులభతరం చేసి మానవాళికి అందించిన మహనీయురాలు శ్రీమాతాజీ నిర్మలాదేవి.

Updated Date - Jun 21 , 2024 | 12:46 AM

Advertising
Advertising