Tips : ఇంటి గార్డెన్ కోసం ఇలా...
ABN, Publish Date - Oct 28 , 2024 | 05:09 AM
ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. నిజానికి ఇంటిని పచ్చని పొదరిల్లుగా మార్చుకోవాలంటే కొద్దిగా ఆసక్తి, కొంచెం ప్రణాళిక ఉంటే సరిపోతుంది.
ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. నిజానికి ఇంటిని పచ్చని పొదరిల్లుగా మార్చుకోవాలంటే కొద్దిగా ఆసక్తి, కొంచెం ప్రణాళిక ఉంటే సరిపోతుంది. గార్డెనింగ్ ఏర్పాటు విషయంలో నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవి..
ముందుగా స్థలం ఎంపిక చేసుకోవాలి. ఐదారు గంటల పాటు సూర్యరశ్మి నేరుగా పడే స్థలానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇండోర్‌లో అయితే గాలి బలంగా వీచే ప్రదేశాలను వీలైనంత వరకు ఎంచుకోకూడదు. స్థలం ఎంపిక చేసుకున్న తరువాత మొక్కల ఎంపిక చేపట్టాలి. పూల మొక్కలు కావాలా? హెర్బ్స్ పెంచుకుంటారా? కూరగాయల మొక్కలకు ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. తరువాత పనిముట్లను సమకూర్చుకోవాలి.
నల్లరేగడి మట్టి మొక్కల పెంపకానికి అనువైనది. ఎర్రనేలలు తేమను నిలుపుకోవు. కాబట్టి ఈ నేల రకాలు అంత అనువైనవి కావు. అయితే ఈ నేలలో సారవంతమైన మట్టిని తెచ్చిపోయడం ద్వారా మొక్కలకు అనువైనదిగా మార్చుకోవచ్చు. వర్మీ కంపోస్ట్, ఎరువులు కలుపుకోవడం ద్వారా నేలలో మొక్కలకు కావలసినంత పోషకాలు లభించేలా చేయవచ్చు.
మొక్కలు ఎంపిక చేసుకునే ముందు మొక్కలు పెరిగే ఎత్తును దృష్టిలో ఉంచుకోవాలి. వాతావరణ పరిస్థితులనుకూడా దృష్టిలో పెట్టుకోవాలి. పూలమొక్కలు, పొదల్లా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కల్లో మీ స్థలం, అభిరుచిని బట్టి ఎంచుకోవాలి. పూల మొక్కలు గార్డెన్‌ను ఆకర్షణీయంగా మారుస్తాయి. పూల మొక్కలు పెంచుకోవడానికి కుండీలు ఎంపిక చేసుకోవాలి. టొమాటో, పాలకూర, ముల్లంగి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వంటి ఆకుకూరలు, దుంపలను వెడల్పాటి టబ్బుల్లో పెంచుకోవచ్చు. స్థలం ఎక్కువగా ఉంటే బీర, కాకర, చిక్కుడు వంటి తీగలు పారే మొక్కలను పెంచుకోవచ్చు.
మొక్కలు నాటిన మొదటి వారంలో రోజూ నీరు పట్టాలి. రెండవ వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పడితే సరిపోతుంది. మొక్కలు బాగా పెరిగాక వారానికొకసారి నీరు పట్టొచ్చు. అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పట్టాల్సి ఉంటుంది.
కుండీలో మొక్కను నాటే ముందు దాని అడుగు భాగాన చిన్న రంధ్రం ఉండేలా చూసుకోవాలి. రంధ్రం లేకపోతే చేయాలి. కుండీలో నీరు నిల్వ ఉండడం వల్ల మొక్క చనిపోయే ప్రమాదముంటుంది. కుండీలో మట్టిని అదమకుండా బోలుగా ఉండేలా చూసుకోవాలి. మొక్కను నాటేటప్పుడు వేర్లు పూర్తిగా మట్టిలో కూరుకునేలా పెట్టాలి.
Updated Date - Oct 28 , 2024 | 05:09 AM