Women's Rings: మహిళలు మెచ్చిన సరికొత్త ఉంగరాలు
ABN, Publish Date - Dec 23 , 2024 | 02:58 AM
మహిళల చేతులకు అందాన్ని ఆకర్షణను అందించడంలో ఉంగరాలదే ప్రథమ స్థానం. ప్లాటినం, బంగారం, వెండి లోహాలతో సందర్భానుసారం ఎన్నో రకాల ఉంగరాలు రూపుదిద్దుకుంటున్నాయి.
మహిళల చేతులకు అందాన్ని ఆకర్షణను అందించడంలో ఉంగరాలదే ప్రథమ స్థానం. ప్లాటినం, బంగారం, వెండి లోహాలతో సందర్భానుసారం ఎన్నో రకాల ఉంగరాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటికి వజ్రాలు, రత్నాలు జతచేరి అద్భుతమైన మోడల్స్ ఆవిష్కృతమవుతున్నాయి. మహిళల మనసు దోచుకుని ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఉంగరాలు ఇవే......
సిగ్నెట్
ఉంగరానికి ఏదైనా జంతువు లేదా పక్షి బొమ్మను జతచేస్తారు. నెమలి, బాతు, హంస, చిలకలు, జింకల బొమ్మలతో; రాశి గుర్తులతో కూడిన సిగ్నెట్ ఉంగరాలకు మంచి ఆదరణ ఉంది. వీటిని బంగారం లేదా వెండితో తయారు చేస్తారు. ఇవి పెళ్లి కానుకగా ఇవ్వడానికి బాగుంటాయి.
ఆర్ట్ డెకో
ఇవి వందేళ్ల క్రితం ప్రాచుర్యంలో ఉన్న వింటేజ్ ఉంగరాలు. మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఉంగరానికి త్రిభుజం లేదా గోళం ఆకారంలో ఉన్న పెద్ద సైజు పచ్చను కానీ కెంపును కానీ అమరుస్తారు. దాని చుట్టూ చిన్న గుండ్లు, గొట్టాలతో ఓ ప్రత్యేకమైన ఆకృతిని పేరుస్తారు. ఈ ఉంగరాలను బంగారం, ప్లాటినం లోహాలతో తయారు చేస్తారు. ఇవి చూడడానికి చాలా రిచ్‌గా కనిపిస్తాయి. మహిళల వేళ్లకు లగ్జరీ లుక్‌ని ఇస్తాయి.
లీఫ్ వైన్
ఉంగరం మొత్తాన్ని అందమైన పూలు, ఆకులు, తీగలతో కూడిన ప్రత్యేకమైన డిజైన్‌తో తయారు చేస్తారు. మధ్యలో సీజడ్‌లు, అమెరికన్ డైమండ్స్, ఇతర రంగు రాళ్లు పొదిగి అందంగా రూపొందిస్తారు. ఈ ఉంగరాలను బంగారం, వెండి, ఇత్తడి వంటి లోహాలతో తయారు చేస్తారు. యువతులు ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు.
ఫ్లోరల్
ఉంగరానికి ఇష్టమైన పువ్వు ఆకారాన్ని జతచేస్తారు. పూర్తిగా బంగారంతో తయారుచేసే ఈ ఉంగరాలకు అన్ని వర్గాల మహిళల నుంచి అత్యధిక డిమాండ్ ఉంది. బరువుగా కాకుండా తేలికగా ఉండడంతో ఉద్యోగినులు, యువతులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
సాలిటైర్
ఉంగరానికి పెద్ద సైజు వజ్రాన్ని జతచేస్తారు. వీటిని ప్లాటినంతో తయారు చేస్తారు. చూడడానికి చాలా గ్రాండ్‌గా రాయల్ లుక్‌తో ఉంటాయి. ఈ ఉంగరాలను ఎక్కువగా నిశ్చితార్థం వేడుక కోసం కొనుగోలు చేస్తున్నారు.
ఓపెన్
ఈ ఉంగరాలు మధ్యలో తెరచుకుని ఉంటాయి. ఒక కొనకు ఏదైనా మంచి డిజైన్ లేదా పువ్వు ఆకారాన్ని, రెండో కొనకు ముత్యం, పగడం, కెంపు, పచ్చల్లో ఒకదాన్ని జతచేస్తారు. ఉంగరం పై భాగమంతా చిన్న సైజు సీజెడ్ రాళ్లు లేదా అమెరికన్ డైమండ్స్ అమరుస్తారు. ఇవి చూడడానికి చాలా క్లాసీగా ఉంటాయి. మోడరన్ దుస్తుల మీద బాగా నప్పుతాయి. వీటిని బంగారం, వెండి లోహాలతో తయారు చేస్తారు.
స్టాకింగ్
ఈ ఉంగరాలను బంగారంతో తయారు చేస్తారు. మధ్యలో వివిధ సైజుల్లో ఉన్న జాతి రత్నాలు పొదిగిన ప్రత్యేకమైన ఆకృతిని జతచేస్తారు. ఇవి కూడా వింటేజ్ లుక్‌ని ఇస్తాయి. మోడరన్ దుస్తుల మీద రాయల్‌గా కనిపిస్తాయి.
కాక్‌టెయిల్
ఫ ఉంగరానికి మధ్యలో అష్టదళ పద్మం లాంటి పెద్ద డిజైన్‌ని జత చేస్తారు. దానిమీద విలువైన రాళ్లను పొదుగుతారు. చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది ఈ ఉంగరం. ఒక వేలికి పెట్టుకుంటే మూడు వేళ్లను ఆక్రమించి నిండుగా కనిపిస్తుంది. చేయి మొత్తం గ్రాండ్‌గా మెరిసిపోతుంది. వివాహాది వేడుకల్లో వీటిని ఎక్కువగా ధరిస్తున్నారు మహిళలు.
చైన్
ఈ ఉంగరాలను గొలుసు డిజైన్లలో తయారు చేస్తారు. ఫంకీ లుక్‌ని ఇష్టపడే యువతులు వీటిని ఎక్కువగా కొంటున్నారు. చూడడానికి సాధారణంగా ఉంటూ యువతుల వేళ్లు నాజూకుగా కనిపించేలా చేస్తాయి. బంగారం, వెండి, ఇత్తడి, రాగి తదితర లోహాలతో వీటిని తయారు చేస్తున్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు రోజువారీ ధరించడానికి అనువుగా ఉంటాయి.
Updated Date - Dec 23 , 2024 | 02:58 AM