Share News

Vitamin C : సి విటమిన్‌ లోపిస్తే...

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:18 AM

విటమిన్‌ ‘సి’ మన ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. రోగనిరోధక శక్తిని పెంచడంలో దీని పాత్ర కీలకం.

Vitamin C : సి విటమిన్‌ లోపిస్తే...

విటమిన్‌ ‘సి’ మన ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. రోగనిరోధక శక్తిని పెంచడంలో దీని పాత్ర కీలకం. గుండె, చర్మం, ఎముకలు, కండరాలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన శరీరంలో విటమిన్‌ ‘సి’ లోపిస్తే వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.

రక్తహీనత : మనం తీసుకునే ఆహారపదార్థాల నుంచి ముఖ్యంగా శాకాహారం నుంచి ఐరన్‌ను గ్రహించడంలో శరీరానికి సి విటమిన్‌ సహాయం తప్పనిసరి. విటమిన్‌ సి తగిన పరిమాణంలో లేని పక్షంలో శరీరానికి ఐరన్‌ అందక రక్తం ఉత్పత్తి కాదు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. శాకాహారుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది.

అంటువ్యాధులు : సి విటమిన్‌ లోపించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా పలు రకాల అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, న్యుమోనియా వంటివి తరచూ వేధిస్తుంటాయి.

ఎముకలు విరగడం : ఎముకలు బలంగా ఉండేందుకు కావాల్సిన కాల్షియాన్ని శరీరం సంగ్రహించేందుకు సి విటమిన్‌ తోడ్పడుతుంది. దీని లోపం వల్ల శరీరం కాల్షియాన్ని శోషించుకోలేదు. ఫలితంగా ఎముకలు బలహీనమై ఆస్టియోపోరోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. చిన్నపాటి ప్రమాద సంఘటనలకే ఎముకలు విరిగిపోతుంటాయి. గోళ్లు పెళుసుగా మారతాయి.


కండరాలు బలహీనం : సి విటమిన్‌ లోపిస్తే శరీరంలో ‘కొల్లాజెన్‌’ అనే ప్రోటీన్‌ ఉత్పత్తి కాదు. దీంతో కండరాలు, ఎముకల మధ్య అనుసంధానం దెబ్బతింటుంది. రక్తనాళాల గోడలు బలహీనమై కండరాల్లో వాపుని నొప్పిని కలిగిస్తాయి. గాయాలు తొందరగా నయం కావు.

దృష్టి దోషాలు : శరీరానికి సి విటమిన్‌ అందకపోతే తొందరగా వార్దక్య లక్షణాలు ఎదురవుతాయి. కంటిచూపును అందించే రెటీనాలో ప్రధాన భాగమైన మాక్యులాలో అసాధారణ స్రావాలు విడుదలవుతాయి. దీంతో మాక్యులా పొరలు ఉబ్బి కంటి చూపు మందగిస్తుంది. రంగులను గుర్తించడం కష్టమవుతుంది.

అలసట: సి విటమిన్‌ లోపం కారణంగా శరీరంలో శక్తి ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో శరీరానికి కావాల్సిన శక్తి లభించక ఎప్పుడూ నీరసంగా, బలహీనంగా అనిసిస్తుంది. ఎంత బలమైన ఆహారం తీసుకున్నప్పటికీ అలసటగా, మత్తుగా అనిపిస్తుంది. ఏకాగ్రత కుదరక మానసిక సమస్యలు ఏర్పడతాయి.

నోటి సమస్యలు: విటమిన్‌ సి లోపం వల్ల దంతాలు, చిగుళ్లు బలహీనమవుతాయి. డెంటిన్‌ అనే పదార్థం ఏర్పడక పోవడంతో దంతాల్లోని రక్తనాళాలు పెళుసుగా మారతాయి. పళ్లు తోముతున్నపుడు కలిగే చిన్నపాటి ఒత్తిడికే రక్తనాళాలు చిట్లి చిగుళ్ల నుంచి రక్తం స్రవిస్తుంది. చిగుళ్లలో వాపు, నొప్పి కూడా బాధిస్తుంటాయి.

Updated Date - Dec 02 , 2024 | 04:19 AM