ముఖం మీద ముడతలు రాకుండా...
ABN, Publish Date - Nov 21 , 2024 | 03:29 AM
డాక్టర్! నా వయసు 35 ఏళ్లు. చర్మం మీద ముడతలు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించే మార్గాలున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి.
సలహా
డాక్టర్! నా వయసు 35 ఏళ్లు. చర్మం మీద ముడతలు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించే మార్గాలున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి.
- ఓ సోదరి, హైదరాబాద్.
పెరిగే వయసుతోపాటు చర్మం మీద ముడతలు ఏర్పడడం సహజం. అయితే కొన్ని కారణాల వల్ల తక్కువ వయసులోనే ముఖం మీద ముడతలు మొదలవుతాయి. ముఖంలో ఎలాంటి హావభావాలతో సంబంధం లేకుండా స్థిరంగా ఉండిపోయే ముడతలు కొన్ని, నవ్వినప్పుడు ఏర్పడేవి మరికొన్ని. వీటిలో మొదటి రకం ముడతలు వయసుకి మించి పెద్దవాళ్లుగా కనిపించేలా చేస్తాయి. ఈ ముడతలను వాయిదా వేయగలిగే వీలుంది. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాతే వృద్ధాప్య ఛాయలు మొదలవుతాయినీ, అప్పుడే ముఖం మీద ముడతలు ఏర్పడతాయనీ అనుకుంటూ ఉంటాం! కానీ నిజానికి ముఖం మీద ముడతలు 20 ఏళ్ల వయసు నుంచే మొదలవుతాయి. 30 - 35 ఏళ్ల వయసులో అవి సన్నని గీతల్లా స్పష్టంగా కనిపించడం మొదలుపెడతాయి. ఇలా చిన్న వయసు నుంచే ముఖం మీద ముడతలు కనిపించడం మొదలవడానికి ఎన్నో కారణాలున్నాయి. అవేంటంటే....
ఎండ దాడి: నేరుగా తాకే ఎండ వల్ల చర్మం అడుగున ఉండే కొల్లాజెన్ దెబ్బతిని, తరిగిపోయి ముడతలు ఏర్పడతాయి. అంతేకాదు. సూర్యరశ్మి ధాటి నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం చర్మం క్రమేపీ మందంగా మారుతుంది. అలా మందం పెరిగేకొద్దీ చర్మం ముడతలుగా మారుతుంది. దీన్నే సోలార్ ఎలాస్టోసిస్ అంటారు.
గంథం పౌడరు వద్దు: గంథంతో తయారైన ఫేస్ పౌడర్ల వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఎండకు నల్లబడే అవకాశాలు ఇలాంటి పౌడర్లతో ఎక్కువ. ఎక్కువగా ఎండకు బహిర్గతమైతే ముడతలు మొదలవుతాయి. కాబట్టి గంధంతో తయారయ్యే పౌడర్లకు దూరంగా ఉండాలి.
సబ్బు దెబ్బ: సబ్బు చర్మం మీద మురికి వదిలించాలిగానీ సహజ నూనెలను తొలగించకూడదు. ఇలా జరగకుండా ఉండాలంటే పిహెచ్ బ్యాలెన్స్ సమంగా ఉండే సబ్బుల్ని ఎంచుకోవాలి. ఇందుకోసం చర్మపు పిహెచ్‌కు దగ్గరగా ఉండే 5.5 పిహెచ్‌పి ఉన్న సబ్బులు వాడాలి. మార్కెట్లో దొరికే సబ్బుల క్షారత్వాన్ని లిట్మస్ కాగితం సహాయంతో తెలుసుకోవచ్చు. ఫలితాన్నిబట్టి తగిన వాటిని ఎంచుకోవాలి.
నీళ్లు ముఖ్యం: చర్మం తేమగా ఉండాలంటే శరీరాన్ని తేమగా ఉంచాలి. ఇందుకోసం రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి.
తీపి శత్రువు: చక్కెర, శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ను పెంచుతుంది. ఫలితంగా చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ తగ్గుతుంది. కాబట్టి తీపి పదార్థాలను తినడం తగ్గించాలి.
చలి కాలం చర్మం భద్రం...
చలి కాలం చర్మం పొడిబారిపోవడం సహజం. మరీ ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవాళ్లు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చలి కారణంగా చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే చర్మాన్ని మాయిశ్చరైజర్లతో తేమగా ఉంచాలి. రోజుకి కనీసం రెండుసార్లు నాణ్యమైన మాయిశ్చరైజరు పూసుకుంటూ ఉండాలి. పొడి చర్మం గల వాళ్లు 4సార్లు లేదా అవసరాన్నిబట్టి అంతకంటే ఎక్కువ సార్లు వాడాలి. బజార్లో దొరికే మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లకు బదులుగా వైద్యులు సూచించే మాయిశ్చరైజర్లు వాడడం మరింత సురక్షితం. అలాగే స్నానానికి కూడా వైద్యులు సూచించే సబ్బులే వాడాలి.
- డాక్టర్ స్వప్న ప్రియ, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్,
కాస్మొస్యూర్ క్లినిక్, హైదరాబాద్
Updated Date - Nov 21 , 2024 | 03:32 AM