NRI: హాంగ్‌కాంగ్‌లో శాస్త్రీయ నృత్య ప్రదర్శన.. ప్రశంసలు అందుకుంటున్న గాయత్రి..
ABN, Publish Date - Jan 10 , 2024 | 11:27 AM
భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, కళాకారులను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య సంస్థ ప్రోత్సహిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా
భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, కళాకారులను ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య సంస్థ ప్రోత్సహిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా హాంగ్ కాంగ్ లో భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. భారతదేశంలోని విభిన్న కళారూపాలను ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలను ఈ వేదికపై నిర్వహించారు. ఈ ప్రయత్నాలు భారతీయ సంప్రదాయాలను పరిరక్షించడంలో మాత్రమే కాకుండా హాంగ్ కాంగ్ లోని ప్రవాస భారతీయుల్లో సమైక్యత భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల వారధి ఫౌండేషన్ (హైదరాబాద్), శ్రుతిలయ కేంద్ర నటరాజలయ (హైదరాబాద్) సహకారంతో హాంగ్ కాంగ్ లో “మార్గం” అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో రాణిస్తున్న యువ కళాకారిణి నారాయణి గాయత్రిని సోలో రిసైటల్ ఏర్పాటు చేశారు.
హాంగ్ కాంగ్ లో నివాసముంటున్న రాజీవ్ ఈయుణ్ణి, అపర్ణ కంద దంపతుల కుమార్తె గాయత్రి ఈయుణ్ణి. గురు కలైమామణి డా.రాజేశ్వరి సాయినాథ్ శిష్యరికంలో ఇటీవలే ఆగస్టు 2023లో హైదరాబాద్ లో తన ఆరంగేట్రం చేసి అందరి మన్ననలు పొందారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని హాంగ్‌కాంగ్‌లోని లాంటౌ ద్వీపంలో తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్‌లో ఈ నెల 6న ఆమె నాట్య ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాంగ్ కాంగ్, మకావులోని భారత కాన్సుల్ జనరల్ హాజరయ్యారు. గాయత్రిని అభినందించారు. ప్రశంసా పత్రాన్ని అందించి ప్రశంసించారు.
దీప ప్రజ్వలన అనంతరం.. గాయత్రి కర్ణాటక సంగీతంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె శ్రావ్యమైన స్వరం ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. గాయత్రి తల్లి అపర్ణ ప్రతి నాట్య అంశాన్ని లయబద్ధంగా వివరిస్తూ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పుష్పాంజలి, అల్లారిపు, దేవీ స్తుతి, ముద్దుగారే యశోద, థిల్లానా, మంగళం వంటి అభినయ అంశాలను అద్భుతంగా ప్రదర్శిస్తూ.. చక్కని హావ భావాలతో అందరిని ఆకట్టుకున్నారు గాయత్రి.
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి స్పందిస్తూ.. మనోహరంగా సాగిన “మార్గం” లో గాయత్రి ఈయుణ్ణి ప్రదర్శన ద్వారా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడానికి తమ లక్ష్యం నెరవేరిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో.. ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్ ఘులాం సిరాజ్, కథక్ గురువులు నీశ ఝవేరి, శ్వేత రాజ్ పుత్, భరతనాట్యం గురువు సంధ్య గోపాల్, మోహినియాట్టం గురువు దివ్య అరుణ్, మృదంగం కళాకారుడు అరవింద్ జేగాన్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 10 , 2024 | 11:30 AM