Bathukamma: హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు
ABN, Publish Date - Oct 09 , 2024 | 11:18 AM
హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నాంటాయి. ఓకే చోటకు మహిళలంతా చేరి బతుకమ్మ ఆడారు. తర్వాత అందరూ కలిసి విందు భోజనం ఆరగించారు. ప్రతీ ఏటా బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు తెలుగు లోగిళ్లలో ఘనంగా జరుగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సాయంత్రం సమయంలో ఆడ పడుచులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారు. ఇక్కడే కాదు విదేశాల్లో కూడా బతుకమ్మ సంబరాలు అంబారాన్ని అంటాయి. హాంగ్ కాంగ్‌లో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
వైభవంగా బతుకమ్మ, దసరా
బతుకమ్మతోపాటు దసరా పండుగలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. పండుగకు పదిహేను రోజుల నుంచి కోలాహలం ఉంటుంది. స్నేహితుల సందడి, బంధువుల రాకపోకలతో పండగ వాతావరణం నెలకొంటుంది. బతుకమ్మ పండుగలో తెలంగాణ ఆడపడుచులతోపాటు మిగతా వారు కలిసి ఆడతారు. దసరా నవరాత్రుల్లో లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలను నిర్వహిస్తారు.
ఆడిపాడిన ఆడపడుచులు
హాంగ్ కాంగ్ సముద్ర తీరాన లాన్తావ్ ఐలాండ్ తుంగ్ చుంగ్ ప్రొమెనెడ్ వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పెద్దలతోపాటు పిల్లలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. సంప్రదాయ వస్త్రాల్లో రావడంతో ఆ ప్రాంతం అంతా బతుకమ్మ శోభ నెలకొంది. ఆట- పాటల తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండగ ఘనంగా జరిగిందని ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఆనందం తెలిపారు.
Updated Date - Oct 09 , 2024 | 11:18 AM