NRI: 10న డల్లాస్ కమ్మ సేవా సమితి ప్రారంభం
ABN, Publish Date - Nov 07 , 2024 | 08:00 AM
. టెక్సాస్ నగరంలోని ఫార్మర్స్‌విల్లే నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి డల్లాస్ ప్రాంతంలోని వారు హాజరుకావాలని కమ్మ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన..
ఈనెల 10వ తేదీన డల్లాస్ కమ్మ సేవా సమితిని ప్రారంభించనున్నట్లు సంఘం సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. అదే రోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక వన సమారాధన నిర్వహించనున్నట్లు చెప్పారు. డల్లాస్ ప్రాంతంలోని కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టెక్సాస్ నగరంలోని ఫార్మర్స్‌విల్లే నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి డల్లాస్ ప్రాంతంలోని వారు హాజరుకావాలని కమ్మ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మ సామాజిక వర్గం ప్రజలు ఉంటున్నారని, వారందరూ ఒకచోటకు చేరడం ద్వారా కష్ట, సుఖాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. డల్లాస్ కమ్మ సేవా సమితిని అదే రోజు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో అమెరికాలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రవాస భారతీయులు ముందు వరుసలో ఉంటున్నారని, ఎవరికి ఎప్పుడు ఆపద వచ్చినా వెంటనే స్పందించే గుణం ఉన్న సామాజిక వర్గంగా పేరు ఉందని, తమ కార్యక్రమాలను మరింత విస్తరించడంలో భాగంగా డల్లాస్ కమ్మ సేవా సమితిని ప్రారంభించాలని నిర్ణయించామని నిర్వహకులు తెలిపారు. కార్తీక మాసంలో అందరూ ఒకే చోటకు చేరి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు ప్రతి సంవత్సరం కార్తీక వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా డల్లాస్ ప్రాంతంలోని కమ్మ సామాజికవర్గం వన సమారాధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఐక్యతను పెంపొందించడానికి కార్తీక వన భోజనాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. కేవలం కమ్మ సామాజికవర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాలను సోదర భావంతో చూడటంతో పాటు అన్ని వర్గాల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సహాయ, సహకారాలు అందించేందుకు తాము ముందుంటున్నామని నిర్వహకులు పేర్కొన్నారు.
కార్తీక వన సమారాధన ప్రత్యేకత..
కార్తీక మాసంలో బంధు మిత్రులు, స్నేహితులు ఒకచోట కలిసి లక్ష్మీ దేవి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టుకు పూజలు చేసి, అక్కడే అంతా కలిసి ఆటలు, పాటలతో ఉల్లాసంగా గడపడంతో పాటు భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల కాలంలో సామాజిక వర్గాల వారీ కార్తీక వన సమారాధన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. తమ సామాజిక వర్గం ప్రజలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అదే సమయంలో ఒకరికి మరొకరు అండగా ఉన్నారనే సందేశాన్ని ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 08 , 2024 | 03:27 AM