Share News

Study abroad: భారతీయుల్లో కెనడాపై అనాసక్తి.. ప్రస్తుతం మనోళ్ల చూపంతా అటే!

ABN , Publish Date - Feb 15 , 2024 | 09:00 PM

కెనడాపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతోందా? అంటే అవుననే అంటోంది తాజా సర్వే.

Study abroad: భారతీయుల్లో కెనడాపై అనాసక్తి.. ప్రస్తుతం మనోళ్ల చూపంతా అటే!

ఎన్నారై డెస్క్: కెనడాపై (Canada) భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిందా? అంటే అవుననే అంటోంది తాజా సర్వే. విదేశాల్లో పైచదువులకు ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎడ్‌టెక్ సంస్థ అప్‌గ్రాడ్ తాజాగా సర్వే నిర్వహించింది. టైర్-1, టైర్-2, టైర్-3 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

కెనడాతో దౌత్య వివాదం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగావకాశాలపై అనిశ్చితి, తగ్గుతున్న స్టడీ పర్మిట్‌ల జారీ వెరసి భారతీయుల్లో కెనడాపై ఆస్తి తగ్గేలా చేస్తున్నాయట. సర్వేలో పాల్గొన్న వారిలో 9.3 శాతం మందే కెనడాపై ఆసక్తి కనబరిచినట్టు తేలింది (Germany overtakes Canada as premier study abroad destination).


అంచనాలను తలకిందులు చేసేలా భారతీయుల్లో ఈయూ దేశాలపై ఆసక్తి పెరిగింది. దాదాపు 48.8 శాతం మంది ఐరోపాలో చదువుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఆ తరువాత స్థానంలో యూఎస్ (27.7 శాతం), యూకే (9.5 శాతం) ఉన్నాయి. కెనడా కంటే కూడా భారతీయులు జర్మనీ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. సర్వేలో మొత్తం 25 వేల మంది గ్రాడ్యుయేట్ల అభిప్రాయాలను సేకరించారు.

భారతీయులు ఆసక్తిగా ఉన్న ఈయూ దేశాల్లో జర్మనీ (38.8శాతం) తొలిస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఐర్లాండ్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఐరోపాలో చదువుల ఖర్చు తమకు అందుబాటులో ఉండటంతో పాటూ నాణ్యమైన విద్య లభిస్తుందన్న నమ్మకమే ఈ ఫలితాలకు కారణమని అప్‌గ్రాడ్ తేల్చింది. ఇక విదేశీ డిగ్రీల్లో మేనేజ్‌మెంట్ కోర్సులకే అత్యధిక డిమాండ్ వ్యక్తమైంది. ఆ తరువాతి స్థానాల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులు నిలిచాయి.

Updated Date - Feb 15 , 2024 | 09:16 PM