NRI: ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
ABN, Publish Date - Mar 31 , 2024 | 03:18 PM
ఆపద సమయాల్లో ఆపన్న హస్తం అందించే ఎన్నారైలపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేయడం, బెదిరింపులకు గురి చేయడం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ జయరాం కోమటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరికూటి అశోక్ బాబు వ్యాఖ్యలను ఖండించిన వైనం
ఎన్నారై డెస్క్: ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. పొగడరా నీజాతి.. అన్న గురజాడ వారి స్ఫూర్తిని అణువణువునా నింపుకొన్న ప్రవాసాంధ్రులు (NRI).. విభజిత ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) అభివృద్ధికి తమ వంతు కర్తవ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నిధులు ఇస్తున్నారు. పాఠశాలలను దత్తత తీసుకుంటున్నారు. పల్లెల్లో వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తున్నారు. అంతేకాదు.. పన్నులు కూడా కడుతున్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. విద్యను అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి సమాంతరంగా అనేక కార్యక్రమాలు చేపట్టి రోగులను ఆదుకున్నారు. ఇలా ఆపన్న హస్తం అందించే ఎన్నారైలపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేయడం, బెదిరింపులకు గురి చేయడం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ జయరాం కోమటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP Foundation Day: కువైట్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. మిన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు
ఎన్నారైలను బెదిరిస్తూ, ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన బాపట్ల జిల్లా వేమూరు ఎస్సీ నియోజకవర్గం అభ్యర్థి వరికూటి అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను జయరాం కోమటి ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తున్న ఎన్నారైలను తీవ్రంగా అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. రాష్ట్రానికి ఎన్నారైల నుంచి అనేక మేళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యోగ కల్పన, ప్రజలకు ఆరోగ్య భద్రత, మురికివాడల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల దత్తత, విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో ఎన్నారైలు కృషి చేస్తున్న విషయాన్ని వివరించారు. అన్నింటికీమించి, రాష్ట్రానికి ఆదాయం పెంచేలా పన్నులు చెల్లిస్తున్నారని, అదేవిధంగా పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు.
‘అసలు ఏం జరిగింది? ప్రవాస భారతీయులు గత ఎన్నికల సమయంలో ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చి, గ్రామాల్లో గొడవలు చేస్తే మాత్రం, వారు ఏ దేశాల నుంచి వచ్చారో తిరిగి అక్కడకు వెళ్లడానికి వీల్లేకుండా చేస్తాం’ అని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు హెచ్చరించారు. నియోజకవర్గం పరిధిలోని అమృతలూరు మండలం కూచిపూడిలో వరికూటి అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక వైపు ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లో ఉండగా, బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి ప్రవాస భారతీయులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని జయరాం కోమటి తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న అశోక్ బాబుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, వేమూరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పోటీ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 31 , 2024 | 03:25 PM