NRI: సౌదీ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీ మహిళల మృతి
ABN, Publish Date - Apr 14 , 2024 | 02:53 PM
పండుగ పూట సౌదీలోని దమ్మాంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తోడుకొడళ్ళు మరణించగా మరికొందరు గాయపడ్డారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పండుగ పూట సౌదీలోని దమ్మాంలో ఒక తెలుగు ప్రవాసీ (NRI) కుటుంబంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తోడుకొడళ్ళు మరణించగా మరికొందరు గాయపడ్డారు.
ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న హైదరాబాద్ నగరానికి చెందిన ఫర్హాత్ అంజుం హుస్సేనీ, గృహిణి అయిన రషీదా ఫారూఖీ అనే ఇద్దరు మహిళలు తాము ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో అక్కడికక్కడే మరణించగా వారి భర్తలకు గాయలై చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు.
NRI: ఏపీలో ఎన్నికల ప్రచారానికి కదలివస్తున్న ప్రవాసులు
రంజాన్ పండుగ కోసం దమ్మాం నుండి మక్కాకు వస్తుండగా ఈ నెల 8న సోమవారం ఈ దుర్ఘటన జరిగినా పండుగ సెలవుల కారణాన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మృతదేహాలు అల్ ఆఫీఫ్ మార్చురీలో భద్రపరిచారు. అధికారిక లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత వీరికి అక్కడే అంత్యక్రియలను నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. అల్ ఆఫీఫ్ అనేది రియాధ్ – మక్కా హైవేపై ఉన్న ఎడారి పట్టణం.
రషీద్ ఫారూఖీ, షాహబొద్దిన్ ఫారూఖీ అనే ఇద్దరు సోదరులు దమ్మాం నగరంలో పని చేస్తుండగా సాధారణంగా రెండు కుటుంబాలు కలిసి బయటకు వెళుతుంటారు. వీళ్ళ స్వస్థలం నెల్లూరు జిల్లా కేంద్రమైనా గత కొంత కాలంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రంజాన్ పండుగ సందర్భంగా గల్ఫ్ దేశాలలో లభించిన వారం రోజల సెలవులలో లక్షలాది మంది ప్రవాసీయులు తమ బంధుమిత్రులు లేదా సహచరులతో కలిసి ఇతర ప్రాంతాలకు పర్యటనకు వెళుతుంటారు. ఈ సందర్భంగా అప్పుడప్పుడూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 14 , 2024 | 02:54 PM