గోవాకు వెళుతున్నారా? వీటిని సందర్శించడం అస్సలు మరువొద్దు!
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:17 PM
గోవా అంటేనే ప్రకృతి అందాలకు, సుసంపన్న సంప్రదాయాలకు నెలవు. అందుకే ఏటా భారతీయులతో పాటు విదేశీయులు కూడా గోవాకు క్యూ కడుతుంటారు. అయితే, ఇక్కడ చాలా మందికి తెలియని దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఇవి తప్పక చూడాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
అడవిలోప దాగున్న మహాదేవ గుడి గోవాలోకెల్లా అత్యంత పురాతనమైనది. కదంబ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం గోవా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా శోభిల్లుతోంది. గోవాకు వెళ్లిన వారు కచ్చితంగా సందర్శించాల్సిన దేవాలయం ఇది
పాత గోవాలో ఉన్న సెయింట్ అగస్టీన్ టవర్ ఓ చారిత్రక కట్టడం. 1602లో దీన్ని నిర్మించారు. ఆనాటి వలస పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఒకప్పుడు భారీ భవనంలో భాగమైన ప్రస్తుతం టవర్ మాత్రమే మిగిలుంది.
సత్తారీలోని శ్రీ బ్రహ్మదేవ్ గుడి దేశంలోని కొద్ది సంఖ్యలో ఉన్న బ్రహదేవుడి ఆలయాల్లో ముఖ్యమైనది. గోవా ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రతీకగా నిలిచే ఈ గుడిలోని ప్రశాంత వాతావరణం మనసుకు సాంత్వన కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మాండోవీ నది అందాలను తిలకించేందుకు రీయిస్ మాగోస్ కోట అత్యంత అనుకూలమైనది. గోవా సంస్కృతికి కేంద్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లు, కార్యక్రమాలకు హాజరైతే గోవా సంస్కృతి, చరిత్ర గురించి ఎంతో తెలుసుకోవచ్చు
ఉత్తర గోవాలోని లాటరైట్ రాళ్లల్లో దాగున్న లామ్‌గావ్ గుహలు కూడా గోవా ఆధ్యాత్మిక చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గోవా ప్రత్యేకతలను మరింతగా తెలుసుకోగోరే వారికి ఇది అద్భుతమైన టూరిస్టు స్పాట్.
ఈ సీజన్‌లో గోవాకు వెళ్లే వారు అద్భుతమైన, మర్చిపోలేని అనుభవాలు మూటగట్టుకోవచ్చని అనుభవజ్ఞులైన పర్యాటకులు చెబుతుంటారు.
Updated Date - Dec 30 , 2024 | 01:17 PM