AP Election 2024: రా.. కదలిరా.. ఓటేద్దాం..!
ABN, Publish Date - May 12 , 2024 | 03:40 PM
తెల్లవారితే రాష్ట్రంలో ఓట్ల పండగ. ఇప్పటికే దేశంలో జరిగిన మూడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో అంతంతమాత్రంగా ఓటింగ్ శాతం నమోదైంది. దీంతో నాలుగో విడత పోలింగ్‌ను సీరియ్‌సగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఎలాగైన ఓటింగ్‌ను పెంచాలని సంకల్పించింది.
ఓటు హక్కు అందరి బాధ్యత
ఒక్క ఓటే కదా అనే నిర్లిప్తత వద్దు
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటెయాల్సిందే..
సెలవు వచ్చిందని సంబరపడొద్దు
ప్రధానంగా యువత అనాసక్తిపై చర్చ
కుటుంబీకుల ఒత్తిడితోనే ఓటు
వారి కోసమే మాధ్యమాల్లో ప్రచారం
హైదరాబాద్ సిటీ/అల్వాల్, మే 12(ఆంధ్రజ్యోతి): తెల్లవారితే రాష్ట్రంలో ఓట్ల పండగ. ఇప్పటికే దేశంలో జరిగిన మూడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో అంతంతమాత్రంగా ఓటింగ్ శాతం నమోదైంది. దీంతో నాలుగో విడత పోలింగ్‌ను సీరియ్‌సగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఎలాగైన ఓటింగ్‌ను పెంచాలని సంకల్పించింది. ఈ ఉద్దేశంతో ఏ అవకాశాన్ని వదలకుండా.. టీవీలు, పేపర్లతో పాటు సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా మొదటిసారి ఓటే వేసే యువత లక్ష్యంగా వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.
ఈ నేపథ్యంలో ‘సెలవును ఎంజాయ్ చేయడం కాదు.. ఓటు వేసేందుకు కదలిరా’ అంటోంది ఎన్నికల కమిషన్. ఇంత చేస్తున్నా.. యువత మాత్రం ఈ ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి మాత్రం చూపడం లేనట్లు తెలుస్తోంది. ఎవరొచ్చినా చేసేదేముంటుంది అంటూ నిర్లిప్తత కనబరుస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి ఓటు కోసం నమోదు చేసుకున్న యువతరం సంఖ్య చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం కచ్చితంగా పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఫస్ట్ టైమ్ ఓటర్లలోనే ఉత్సాహం !
హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా ఓటరు మాత్రం పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేయడం తక్కువే!. నిజానికి ఫస్ట్‌టైమ్ ఓటరు పోలింగ్ బూత్‌కు వచ్చినంత ఉత్సాహంగా రెండోసారి రావడం లేదంటున్నారు కొంతమంది నాయకులు. అలాగే పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ‘ప్రజల మీద ప్రేమ లేదు. దేశం పట్ల చిత్తశుద్దీ లేదు. అన్నీ ఒక తానులో ముక్కలే. అందుకే ఎన్నికలంటేనే చికాకు వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది భావన కూడా అదే! ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు కూడా గెలుపుకోసం అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం తమకు చికాకు కలిగిస్తుందన్నాడు. కాస్త అనుభవజ్ఞులైన ఓటర్లు ఇలా అంటుంటే, మొదటి సారి ఓటువేయబోతున్న వారు మాత్రం తాము ఓటు వేయడానికి ఉత్సాహంగానే ఉన్నా తమ ఓటు ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియకపోవడం ఇబ్బందిగా ఉందంటున్నారు.
తల్లిదండ్రులే ఇన్‌ఫ్లూయెన్సర్లు
యువత ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడానికి మన అధికారులు కూడా కారణమే అని అన్నారు నగరంలోని ఓ కాలనీ సంఘ సెక్రటరీ రామకృష్ణ. ఆయన మాట్లాడుతూ ‘ఈ రోజు పేపర్‌లో చూశాను. దాదాపు 85ుకు పైగా ఓటరు స్లిప్పులు అందించామని ఎన్నికల సిబ్బంది చెప్పారు. తాను ఎవరిని అడిగినా తమకు స్లిప్పులు రాలేదనే అంటున్నారు. మరి ఎవరికి ఇచ్చారు?’ అని ప్రశ్నించారు. అలాగే మొదటి సారి ఓటు వేయబోతున్న వారు ఎవరికి ఓటు వేస్తారు, ఎలాంటి వారిని ఎంచుకోవాలనుకుంటున్నారంటే, అమ్మనాన్నలు చెప్పిన వారు, స్నేహితులు సూచించిన వారే అంటున్నారు. భవిత మీది, బాధ్యత మీది అంటున్నారు కదా అని అంటే, ఈ రోజు మనం ఎంచుకున్న వారు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని నాడు భవిత ఎక్కడుంటుంది అని పలువురు విద్యార్థులు ప్రశ్నిస్తుండటం గమనార్హం.
పోలింగ్ రోజున ఏర్పాట్లపై ఆరా
సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ 18 వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్ధులు దాదాపుగా గత 23 రోజులుగా అలుపెరగకుండా ప్రచారం నిర్వహించారు. బహిరంగా ప్రచారానికి తెరపడడంతో అభ్యర్థులు ఆదివారం ముఖ్య నేతలతో సమాలోచనలు చేశారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించి ఓట్లు వేయించుకోవడంపై పోల్ మేనేజ్‌మెంట్ బాధ్యులతో చర్చించారు. ఏజెంట్ల నియామకంపై మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌ల ముఖ్య నేతలకు ఇప్పటికే సూచనలిచ్చారు.
ఏజెంట్ల ఎంపికపై ప్రత్యేక కసరత్తు
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సెగ్మెంట్‌ల వారీగా ముఖ్యులతో ఫోన్‌లో చర్చించారు. కీలకమైన పోలింగ్‌లో కాంగ్రె్‌సకు ఓటు వేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్య నాయకులకు సూచనలిచ్చారు. పోలింగ్ ఏజెంట్ల నియామకం పక్కాగా ఉండాలని, పోల్ మేనేజ్‌మెంట్ సక్రమంగా నిర్వహించాలని కోరారు. కోర్ కమిటీతో సమావేశం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి సెగ్మెంట్‌ల వారీగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమాలోచనలు చేశారు. పోలింగ్ ఏజెంట్ల నియామకం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చారు. విజయం సాధించేందుకు ఈ ఒక్క రోజు సర్వశక్తులూ ఒడ్డి కృషి చేయాలని డివిజన్‌లోని ముఖ్య నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆదివారం మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు. బీజేపీ ఓటర్లందరితో ముందుగా ఓట్లు వేయించాలని సూచనలిచ్చారు. దాంతో పాటు రేపు చేయాల్సిన ఏర్పాట్లపై ముఖ్య నాయకులతో చర్చించారు.
Updated Date - May 12 , 2024 | 04:01 PM