Tamilisai -Annamalai rift: పనిచేసిన అమిత్ షా వార్నింగ్.. దారికొచ్చిన తమిళిసై-అన్నామలై
ABN, Publish Date - Jun 14 , 2024 | 06:35 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవం వేదికపై తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ కీలక నేత తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ చక్కగా పనిచేసినట్టుగా అనిపిస్తోంది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి (Chandrababu) ప్రమాణస్వీకారోత్సవం వేదికపై తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ (BJP) కీలక నేత తమిళిసై సౌందరరాజన్‌కు (Tamilisai Soundararajan) కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) ఇచ్చిన వార్నింగ్ చక్కగా పనిచేసినట్టుగా అనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళిసై-తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) మధ్య విభేధాలు చోటుచేసుకున్నాయంటూ ఊహాగానాలు వెలువడగా.. అవి సమసిపోయిన సంకేతంగా శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నామలై శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లి కలిశారు. భేటీ అనంతరం అన్నామలై ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అన్నా ఇంట్రెస్టింగ్ ట్వీట్
“బీజేపీ సీనియర్ నేత, గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ని ఈ రోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ ఎదుగుదలకు ఎల్లప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇద్దరూ సమావేశం కావడం, అనంతరం అన్నామలై స్పందనను బట్టి చూస్తుంటే వీరిద్దరి మధ్య నెలకొన్న విభేధాలు సమసిపోయినట్టేనని తమిళినాడు రాజకీయ వర్గాలు (Tamilnadu Politics) విశ్లేషిస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం, అందునా స్వయంగా అమిత్ షానే రంగంలోకి దిగడంతో ఇద్దరూ దారికొచ్చారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఇద్దరి మధ్య వివాదం ఏమిటి?
ఇటీవలే ముగిసిన లోక్‌సభ ఎన్నికలు-2024కు సంబంధించిన తమిళనాడులో బీజేపీ దారుణంగా దెబ్బతింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్కడ పార్టీ కాస్త పుంజుకుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ ఓటమికి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కారణమని సీనియర్ నాయకురాలైన తమిళిసై బహిరంగంగా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో బీజేపీ మెరుగుగా రాణించేదని అన్నారు. అక్కడితో ఆగకుండా బీజేపీ-అన్నాడీఎంకే మధ్య పొత్తు విడిపోవడానికి అన్నామలై కారణమని ఆరోపించారు.
బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు విడిపోవడానికి అన్నామలే కారణమంటూ అన్నాడీఎంకే పార్టీ నేత వేలుమణి చేసిన వ్యాఖ్యలకు తమిళిసై మద్దతు పలికారు. ఈ రెండు పార్టీలు పొత్తు కొనసాగించి ఉంటే డీఎంకే ఇన్ని సీట్లు గెలిచి ఉండేది కాదన్నారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. చిలికి చిలిక గాలివానలా వీరిద్దరి వ్యవహారం బీజేపీ పెద్ద దృష్టికి కూడా వెళ్లింది. దీంతో రాష్ట్రంలో పార్టీకి మరింత చేటు చేయకముందే అమిత్ షా నేరుగా తమిళిసైని హెచ్చరించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవంలో ఆమె కనిపించగానే ఈ మేరకు వార్నింగ్ ఇచ్చారు. అమిత్ షా వార్నింగ్ దెబ్బకు రెండు రోజుల్లోనే తమిళిసై-అన్నామలై కలిసిపోయారు.
ఇవి కూడా చదవండి
YSRCP: జంపింగ్‌లు షురూ.. టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే రెడీ!?
Vasamsetti Subhash: ఎవరీ యంగ్ మినిస్టర్ సుభాష్.. సీనియర్లను కాదని చంద్రబాబు ఎందుకు పదవిచ్చారు..!?
For more Political News and Telugu News
Updated Date - Jun 14 , 2024 | 07:00 PM