‘తీన్’మార్.. లోక్‌సభ సమరంలో త్రిముఖ పోరు
ABN, Publish Date - Mar 27 , 2024 | 03:50 PM
లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాయి. ఇక ప్రచారాస్త్రాలపై పార్టీ పెద్దలు దృష్టి సారించారు. అవకాశం దక్కని నేతల అలకలు, ఇతర పార్టీల నేతల ఆకర్షణల నేపథ్యంలో అసమ్మతి వర్గానికి ఏదో ఆశ చూపుతూ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది.
లోక్‌సభ సమరంలో త్రిముఖ పోరు
కాంగ్రెస్‌కు వంద రోజుల పాలన రెఫరెండం
ఢిల్లీ నేతల్లో జోష్ పెంచేందుకు బీజేపీ యత్నం
ఓటమి మరచి సత్తా చాటాలని బీఆర్‌ఎస్
బీజేపీ, బీఆర్‌ఎ్‌సలలో అభ్యర్థుల ఎంపిక పూర్తి
కాంగ్రె్‌సలో ఇంకా 8 స్థానాలు పెండింగ్
సీఎం రేవంత్‌కు సవాల్‌గా మారిన ఎన్నికలు
హైదరాబాద్ సిటీ, మార్చి 27: లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాయి. ఇక ప్రచారాస్త్రాలపై పార్టీ పెద్దలు దృష్టి సారించారు. అవకాశం దక్కని నేతల అలకలు, ఇతర పార్టీల నేతల ఆకర్షణల నేపథ్యంలో అసమ్మతి వర్గానికి ఏదో ఆశ చూపుతూ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. అయినా జంప్ జిలానీలు కొందరు ఏవో సాకులు చెబుతూ పార్టీలు మారుతూనే ఉన్నారు. ఇక ముందుగానే ప్రచారం ప్రారంభించిన బీజేపీకి చెందిన ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు పర్యటనలు, రోడ్‌షోలు చేస్తూ ఓటర్లను ఆకర్షించడం, హామీల వర్షం కురిపించడం ప్రారంభమైపోయింది. బీజేపీ తరపున ప్రధాని మోడీ, కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్‌లు ప్రచారాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు.
కాంగ్రెస్ 100 రోజుల రెఫరెండం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వంద రోజులకే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ పార్టీకి ఇవి ఎంతో కీలకంగా మారాయి. తమ వంద రోజుల పాలనపై లోక్‌సభ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పడం ఆసక్తికరంగా మారింది. అత్యధిక స్థానాలు గెలుచుకొని అధిష్టానం వద్ద తన ప్రతిష్టను నిలబెట్టుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీల నుంచి ఘర్ వాపసీ నేతలకు సర్దుబాటు, ప్రచారాంశాలపై రేవంత్‌రెడ్డి ఫోకస్ చేశారు. ఇతర పార్టీల నుంచి దూకిన నేతలకు సర్దుబాటు చేసే క్రమంలో సొంత కుంపటిలో రాజుకుంటున్న మంటలను చల్లార్చడంపై కూడా జాగ్రత్తపడుతున్నారు.
ప్రచారంలో అలసత్వం వద్దనే ఆదేశాల నేపథ్యంలో అభ్యర్థులు తమతమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు కొనసాగుతునే ఉన్నాయి. మరోవైపు పార్టీ కార్యకలాపాలు సైతం వేగం పుంజుకున్నాయి. గ్రేటర్ పరిధిలోని నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు నాయకత్వం పదును పెడుతోంది. బీఆర్‌ఎస్ నేతలు ఒక్కొక్కరే కాంగ్రె్‌సలో చేరుతుండటంతో పార్టీ బలం పెరుగుతోందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈ మూడు-నాలుగు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు. నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేేస క్షేత్రస్థాయి శ్రేణులలో చురుకుదనం పెంచేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ స్వయంగా నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఆయనతోపాటు మంత్రులు కూడా పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు.
సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ఆరాటం
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ గ్రేటర్ పరిధిలోని నాలుగు స్థానాలతోపాటు చుట్టుపక్కల నియోజకవర్గాలను సైతం గెలుచుకునేందుకు ఆ పార్టీ కేంద్ర నాయకులు ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి ఆమిత్‌షా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. బలమైన నేతలకు టికెట్లు ఇవ్వడంతో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో కనీసంగా ఎనిమిది స్థానాలలో గెలుపు కోసం బీజేపీ ప్రచారానికి సన్నద్థమవుతోంది. కొన్నిచోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కేటాయించి ప్రచారానికి పదును పెట్టింది. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌షాలు ఇటీవల మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఆ పార్టీ నేతలలో ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల వరకు ప్రధాన మంత్రి, అమిత్ షా సభలను ఆయా ప్రాంతాల్లో నిర్వహించడానికి పార్టీ రాష్ట్ర నేతలు, నియోజకవర్గస్థాయి నేతలు, అభ్యర్థులు పథకాలు రచిస్తున్నారు.
పూర్వ వైభవం కోసం బీఆర్‌ఎస్
గ్రేటర్‌లోని నాలుగు స్థానాలతోపాటు రాష్ట్రంలోని మిగతా 16 స్థానాలకు బీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ లక్ష్యంగా బరిలోకి దిగిన ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. అయితే ఆ షాక్ నుంచి తేరుకుని పూర్వవైభవాన్ని చాటుకునేందుకు బీఆర్‌ఎస్ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లకంటే ముందు తన అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రచార బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అధిష్ఠానం అప్పగించింది. అయినా కేసీఆర్ రోడ్‌షో, బహిరంగ సభలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారనున్నారు. కాగా, పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వెళ్తున్న జంప్ జిలానీలు బీఆర్‌ఎస్ నేతలకు కునుకు లేకుండా చేస్తున్నారు.
Updated Date - Mar 27 , 2024 | 06:50 PM