సురక్షితమేనా?
ABN, Publish Date - May 29 , 2024 | 03:52 PM
ఓ నాలుగు గదులు ఉంటే చాలు ఆస్పత్రి వెలుస్తుంది.
ఆస్పత్రుల్లో సేఫ్టీపై ఆందోళన
ఇరుకు గదుల్లో దవాఖానాలు
ప్రమాదం జరిగితే అంతే సంగతులు
గతంలో రెండుచోట్ల అగ్నిప్రమాదాలు
‘ఢిల్లీ’ ఘటన నేపథ్యంలో పెరిగిన అనుమానాలు
అయినా పట్టించుకోని అధికారులు
హైదరాబాద్ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఓ నాలుగు గదులు ఉంటే చాలు ఆస్పత్రి వెలుస్తుంది. సెల్లార్ ఖాళీగా ఉందా అక్కడే వార్డులు, పడకల ఏర్పాటు. చుట్టూ సెట్ బ్యాక్ స్థలం అసలే ఉండదు. షార్ట్ సర్క్యూట్, అగ్నిప్రమాదాలు ఏర్పడితే రక్షణ చర్యలు చేపట్టేందుకు అవకాశమే కనిపించదు. చాలా ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ, కనీస వసతులు ఉండవు అయినా అధికారులు అనుమతులు మాత్రం ఇచ్చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే హడావుడి చేస్తారు. ఆ తర్వాత ఆ ఊసే ఉండదు. హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో గతంలో అగ్నిప్రమాదాలు జరిగాయి. పలువురు రోగులు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఢిల్లీలో ఇటీవల ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఏడుగురు నవజాత శిశువులు దుర్మరణం చెందారు. ఈ ఘటన దృష్ట్యా నగరంలోని ఆస్పత్రుల్లోని సేఫ్టీపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇక్కడ కూడా అలాంటివే
2019 అక్టోబర్‌లో ఎల్బీనగర్‌లోని షైన్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదు మంది పరిస్థితి విషమంగా మారింది. అక్కడ చికిత్స పొందినది ఎక్కువ మంది నవజాత శిశువులే.
2010 మార్చిలో సోమాజిగూడలోని పార్క్ కార్పొరేట్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దట్టమైన పొగ వ్యాపించడంతో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారగా ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో భయంతో ఇద్దరు డాక్టర్లు ఆస్పత్రి పై అంతస్తు నుంచి దూకి కాళ్లు, చేతులు విరగొట్టుకున్నారు. ఈ ప్రమాదంతో 18 మంది వైద్యులు, 42 మంది రోగులు తీవ్ర గాయాలపాలయ్యారు.
చాలా ఆస్పత్రుల్లోనూ..
కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు కనీస భద్రత లేకుండా పోయింది. అగ్నిప్రమాదాల సమయంలో మంటలను ఆర్పే సదుపాయలు ఉండడం లేదు. ప్రతి ఆస్పత్రిలో అగ్నిప్రమాదాల నివారణ చర్యలు తీసుకుని ఉండాలి. కానీ వారు ఏ నిబంధనలే పాటించడం లేదు. అనుమతులు తీసుకునేటప్పుడు అన్నీ ఉన్నాయని నమ్మబలుకుతారు. అనుమతి తీసుకున్న పడకల కంటే రెట్టింపు సంఖ్యలో అక్కడ రోగులు ఉంటారు. అయిదేళ్ల క్రితం ఎల్బీనగర్‌లోని ఓ ఆస్పత్రిలో కేవలం ఇరవై పడకల వరకు మాత్రమే అనుమతి తీసుకున్నారు. రెట్టింపు సంఖ్యలో పడకలు ఏర్పాటు చేశారు. ఎన్‌ఐసీయులోనూ రెట్టింపు పడకలను ఏర్పాటు చేశారు. నగరంలోని అనేక ఆస్పత్రుల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఎల్బీనగర్‌లోని ఆస్పత్రిలో ప్రమాదం జరిగినప్పుడు అధికారులు నగరంలోని దాదాపు 600 ఆస్పత్రులకు లేఖలు రాశారు. నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం అధికారులు అన్ని ఆస్పత్రుల్లో ఫైర్‌సెఫ్టీని గమనిస్తున్నామని పేర్కొన్నారు. కానీ, తర్వాత పర్యవేక్షణ జరగలేదు. తనిఖీలు జరగలేదు.
బయటకు రాలేని పరిస్థితి
సెల్లార్ నుంచి మూడు, నాలుగు అంతస్తుల వరకు భవనాలు ఉంటాయి. పైఅంతస్తుల్లో ఉన్న వారు బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది. లోపలకు, బయటకు రావడానికి ఒకే మార్గం ఉండడంతో ప్రమాదాలు జరిగినప్పుడు భయంతో ఉరుకులు పరుగులతో పాటు తొక్కిసలాట కూడా జరుగుతుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్పత్రిని సీజ్ చేయడం లేదా రద్దు చేయడం చేస్తున్నారు. దీంతో అదే యాజమాన్యం మరో పేరుతో, కొత్త ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో రెండు ఆస్పత్రుల్లో ప్రమాదాలు జరిగ్గా అధికారులు వారి అనుమతిని రద్దు చేశారు. తిరిగి మరో పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అంతే
గతంలో నిలోఫర్, ఫీవర్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో షార్ట్‌సర్క్యూట్ వల్ల గతంలో పలుసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. నిలోఫర్ ఆస్పత్రిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల నిప్పురవ్వలు పడి ఇంక్యుబెటర్‌లో చికిత్సలు పొందుతున్న ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఉస్మానియా ఆస్పత్రిలోని పాతభవనంలో వినియోగంలో లేని లిఫ్ట్‌లో అగ్నిప్రమాదం ఏర్పడడంతో రోగులు బయటకు పరుగులు తీశారు. ఫీవర్ ఆస్పత్రిలో బోలక్‌పూర్ బాధితులు చికిత్స పొందుతున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు ఎగిసిపడడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
75 శాతం పాటించడం లేదు
హైదరాబాద్‌లోని 75 శాతం ఆస్పత్రులకు ఫైర్ సేఫ్టీ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదు. గతంలో ఈ విషయమై జీహెచ్‌ఎంసీ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు ఎన్నో చర్యలు తీసుకున్నా ఆస్పత్రి నిర్వహణ, యాజమాన్య వైఖరిలో ఫలితం లేకుండా పోతుంది. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు పలు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో సుమారు వెయ్యి ఆస్పత్రుల వారు సేఫ్టీ నిబంధనలను పాటించామని అధికారికంగా తెలియజేశారు. ఆస్పత్రులు అందజేసిన వివరాలను పరిశీలించి అంతా సక్రమంగా ఉంటే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాలని, నిబంధనలను పాటించని భవనాలను సీల్ చేయాలని భావించారు. కానీ ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందని ఓ అధికారి తెలిపారు.
నిత్య తనిఖీలు చేస్తున్నాం
ఐదంతస్తుల వరకు ఉన్న భవనాల్లో నిర్వహించే ఆస్పత్రుల్లో రెగ్యులర్‌గా తనిఖీ చేస్తున్నాం. ఫైర్ సేఫ్టీ పరికరాలతోపాటు.. అవసరం మేర ఓవర్ హెడ్, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులుండాలి. మెట్లతోపాటు, రోగులను స్ర్టెచర్‌పై తీసుకెళ్లేందుకు ర్యాంపులుండాలి. అనుకోని దుర్ఘటన జరిగితే లోపలున్న వారు సులువుగా బయటకు వెళ్లేందుకు అత్యవసర మార్గాలు అవసరం. ఇవన్నీ తనిఖీ చేసి.. నిబంధనల ప్రకారం లేకుంటే నోటిసులిస్తున్నాం. నిర్ణీత గడువులోపు ఏర్పాట్లు చేసుకోకుంటే చర్యలు తీసుకుంటాం.
- ఎన్ ప్రకా్‌షరెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్, జీహెచ్‌ఎంసీ
30 మందితో ప్రత్యేక బృందాలు
ఆస్పత్రుల్లో ఫైర్ సెఫ్టీపె తనిఖీ చేయడానికి 30 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నగరంలోని అన్ని ఆస్పత్రులను తనిఖీ చేసి ఫైర్ సెఫ్టీ ఏ మేరకు ఉంది, అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలను పరిశీలిస్తున్నారు. 15 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న ఆస్పత్రి భవనాలకు ఫైర్ సెప్టీ సర్టిఫికేట్ అవసరం. అగ్నిమాపక అధికారులు భవనాన్ని తనిఖీ చేసి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే తాము ఆస్పత్రి వైద్య సేవలకు అనుమతులు ఇస్తాం. 15 మీటర్ల కంటే తక్కువ ఉంటే సర్టిఫికెట్ అవసరం లేదు. కానీ, అక్కడ ఫైర్ సెఫ్టీకి సంబంధించిన పరికారాలను తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటిని అధికారులు పరిశీలిస్తారు. ఇప్పటికే 89 ఆస్పత్రులను తనిఖీ చేశారు. అన్ని ఆస్పత్రులను పరిశీలిస్తారు.
- డాక్టర్ వెంకటీ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, హైదరాబాద్
నగరంలోని ఆస్పత్రులు సురక్షితమే
నగరంలో ఉన్న ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా వేసవి కాలానికి ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్పత్రులతో పాటు బహుళ అంతస్థుల భవనాల్లో తీసుకుంటున్న అగ్నిమాపక చర్యల గురించి తనిఖీలు చేపట్టాం. 86 భవనాల యాజమాన్యాలకు నోటీసులిచ్చాం. అయితే ఆస్పత్రులు మాత్రం తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాయి. అయితే సాధారణంగా క్లినిక్‌లు, చిన్న నర్సింగ్‌హోంలు, ఇతరత్రా అధికారుల దృష్టికి రాని చిన్న ఆస్పత్రులను కూడా గుర్తించి అగ్నిమాపక చర్యలపై దృష్టి సారించే ప్రయత్నంలో ఉన్నాం.
- నాగిరెడ్డి, అగ్నిమాపక శాఖ డీజీ
Updated Date - May 29 , 2024 | 03:52 PM