కదనభేరిలో ‘ఆమె’
ABN, Publish Date - Apr 23 , 2024 | 03:22 PM
గ్రేటర్ పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాలుండగా.. అందులో రెండు సీట్లలో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు పోటీ చేస్తున్నారు.
అవకాశం సద్వినియోగానికి కసరత్తు
సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారంలో బిజీ
బలమైన ప్రత్యర్థులను ఢీకొడుతూ ముందుకు
పార్టీ అధిష్ఠానం, నాయకులతో నిత్యం మంత్రాంగం
ప్రచారంలో దూసుకెళ్తున్న మాధవీలత, సునీతారెడ్డి
మరోవైపు పావులు కదుపుతున్న పార్టీల అగ్రనేతలు
గ్రేటర్‌లో ఆసక్తిగా సార్వత్రక ఎన్నికలు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాలుండగా.. అందులో రెండు సీట్లలో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు పోటీ చేస్తున్నారు. జనరల్ స్థానాల్లో ఎవరూ ఊహించని విధంగా ఆయా పార్టీల అధిష్ఠానాల ఆశీస్సులతో వారు టికెట్లు పొందారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా అవకాశం లభించిన వీరికి అదృష్టం కలిసొస్తుందా.. అనేది ఆసక్తికరంగా మారింది. తమకు పోటీగా బలమైన ప్రత్యర్థులు బరిలోకి నిలుస్తున్న తరుణంలో వారిని ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధిస్తారా? లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తారా? ప్రత్యర్థులపై పదునైన బాణాలు సందిస్తారా.. లేకుంటే సాదాసీదాగా నడుచుకుంటారా? అనే అంశాలపై నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల అగ్రనేతలు సైతం త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఓ వైపు ఎండల ధాటిని తట్టుకుని కార్యక్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రచారం జోరందుకోనుంది.
‘హైదరాబాద్’ బీజేపీ బాణంగా మాధవీలత!
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నగరంలోని విరించి ఆస్పత్రుల చైర్ పర్సన్ కొంపెల్ల మాధవీలత పోటీ చేస్తున్నారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడే ఆమె కొంతకాలంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితులైన మాధవీలత కొన్నిరోజుల క్రితం బీజేపీలో చేరారు. పాతబస్తీలో నిత్యం ఆధ్యాత్మిక కార్యకమ్రాలు నిర్వహిస్తుండడంతోపాటు స్థానిక హిందూ, ముస్లింలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్‌సిటీలో ఎదురులేని నేతగా కొనసాగుతున్న అససుద్దీన్ ఒవైసీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఎలాగైనా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై కాషాయ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో ఇక్కడ బలమైన అభ్యర్థిగా బీజేపీ అగ్రనాయకులు మాధవీలతను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. అయితే తాజా ఎన్నికల్లో ఆర్థిక, అంగ బలం కలిగిన మాధవీలతను బరిలోకి దింపిన అధిష్ఠానం హైదరాబాద్ సీటును కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న మాధవీలతకు ఎన్నికల్లో అదృష్టం వరిస్తుందా..? లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.
మల్కాజిగిరిని నిలుపుకునేందుకే సునీతకు టికెట్..!
మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి సునీత బరిలోకి దిగుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో పోటీచేస్తున్న ఆమె ఈ ఎన్నికల్లో తన సత్తాచాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగి ఉండడంతోపాటు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఆమె మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే వివిధ కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన మల్కాజిగిరి స్థానాన్ని ఈసారి కూడా తమ ఖాతాలో వేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడి పనిచేశారో... తాజా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అలాగే పనిచేయాలని పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు సూచిస్తున్నారు. అయితే గతంలో మల్కాజిగిరి సెగ్మెంట్‌లో సునీతా మహేందర్‌రెడ్డికి విజయం వరిస్తుందా.. తన రాజకీయ అనుభవం ఈ ఎన్నికల్లో ఎంతమేరకు పనిచేస్తుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా గ్రేటర్‌లోని నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలను బరిలోకి దించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Updated Date - Apr 23 , 2024 | 03:22 PM