Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..?
ABN, Publish Date - Aug 06 , 2024 | 01:33 PM
‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..!
‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..! నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసి నేటికి ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ఆయన తాలుకూ కొన్ని గురుతులు ఇప్పుడు చూద్దాం వచ్చేయండి..!
జననం..
గుమ్మడి విఠల్.. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాబ్యాసం చేసిన గద్దర్.. ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్‌లో చదివాడు. ఆంధ్రమహాసభ ఉద్యమస్ఫూర్తితో 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉబికి వచ్చినట్టే, 1969 ఉద్యమం మిగిల్చిన నిరాశానిస్పృహల నుంచి విప్లవోద్యమ లావా ఎగిసిపడిందన్న అవగాహన ఉన్నవాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశాడు. కేవలం పాటలు రాసి, పాడి కోట్లాది జనం గుండె చప్పుడు కాలేదాయన. ఆచరణ ప్రక్రియకు వెనుకాడక అజ్ఞాతంలోకి వెళ్లి సంవత్సరాల పాటు ఉద్యమ యుద్ధరంగంలో సైనికుడై ముందు నడిచినవాడు గద్దర్. అందుకే తిరిగి మైదానంలోకి అడుగిడినా ప్రజాసైనికుని పాత్ర నిర్వహిస్తూ వచ్చాడు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రిక్షా రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్.. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
గద్దర్‌కే సాధ్యం!
సృజనశక్తితో భౌతికశక్తిని మమేకం చేసి, ఆ రాపిడి నుంచి పాటల నిప్పురవ్వలను, ఆ రవ్వల నుంచి అగ్నిజ్వాలలను సృష్టించినవాడు. అందుకే లక్షలాది ప్రజలలో వ్యవస్థ పట్ల అసహనం కలిగించగలగటం ఒక్క గద్దర్‌కే సాధ్యమైంది. అంతేకాదు నిజాయితీతో, నిబద్ధతతో తన అడుగుజాడలలో నడిచే అనుయాయులను కూడా గద్దర్ తయారుచేశాడు. ఎన్ని ఒత్తిడులున్నా, అనారోగ్యం బాధించినా, దేహంలోని తూటాను రెండవ గుండెగా ధరించి ముందకు సాగాడే కాని వెనుకంజ వేయలేదు. కర్షక, కార్మిక లోకం శోకం, ఆదివాసీ గిరిజనుల దుఃఖం తన పాటల గాలి కెరటాలతో తుడిచినవాడు గద్దర్. ఎంత అట్టడుగు నుండి ఉద్యమం మొదలుపెడితే అన్ని అడ్డంకులు ఎదురవుతాయి. గద్దర్ ఉద్యమ జీవితంలో ఎదురైన సవాళ్లు కూడా ఇవే. ఇదంతా ఆయన జీవితానుభవ సంపద అయింది.
సామాన్యుడు సైతం!
విప్లవోద్యమానికి, అస్తిత్వ ఉద్యమానికి అభేదం చెప్పి పాటపాదాలతో తన పాదాలను ఆటపాదాలుగా మానవీకరించినవాడు గద్దర్. అందుకే ప్రేక్షకుడు యాంత్రికంగా గద్దర్‌ను రంగస్థలం మీద వీక్షించలేడు. తన సర్వేంద్రియాలను ఏకం చేసి నవరసాలను అనుభూతి చెంది, తనను ఆత్మీయంగా గద్దర్‌కు అంకితం చేసుకుంటాడు. గద్దర్ చేతిలో ఒక ఎర్ర రుమాలు ఉంటుంది. అది పేరుకు బట్టపేగు. అయినా ఆయన సృజన ప్రక్రియలో అది ఒక పాత్రధారి అయింది. మహాత్మాగాంధీ తర్వాత ఒక ప్రత్యేకమైన ఆహార్యంతో జనసామాన్యుల ప్రతీకగా ప్రసిద్ధికెక్కాడు. కారల్ మార్క్స్ గతితార్కిక భౌతికవాదం చదవకుండానే ఉన్న వర్గాలు లేని వర్గాలను ఎట్లా దోచుకుంటున్నాయో గద్దర్ పాటల ద్వారా చదువురాని సామాన్యుడు తెలుసుకున్నాడు.
నిమిషాల్లోనే పాట..!
పాట కట్టడం మౌఖిక సంప్రదాయం. సాంప్రదాయికంగా ఇది సృజనశక్తికి సంబంధించిన అంశమే. గద్దర్‌లో ఈ శక్తి ఎంతో అనితరసాధ్యంగా, అద్భుతంగా ఉండేది. ఆయన ఏ సందర్భంలోనైనా నిమిషాలలో పాటకట్టేవాడు. పాటకట్టడం, దాన్ని స్వరపరచడం, పాడటం అన్న ప్రక్రియలు అవ్యవధిగా సాగేవి. సమకాలికులలో ఈ శక్తిగలవారు మరెవరూ లేరు. దీంతో ‘పాట’ను నిర్వచించే పనిని పరిశోధకులు కొత్తగా మొదలుపెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే గద్దర్ బౌద్ధికశక్తి కూడా అసాధారణమైనది. ‘ప్రజల నుండి ప్రజలకు’ అన్న సూత్రాన్ని అనుసరించి ఆయన ముందుకు సాగాడు. అందుకే ఆయన స్వాయత్తం చేసుకున్న జానపద కళారూపాలు సార్థకమయ్యాయి.
మరణం..!
1980 దశకం నాటి దళిత స్త్రీవాద ఉద్యమాలు సంచలనశీమైనవి. స్వయంగా దళితవర్గానికి చెందినవాడు కావడం వల్ల వర్గపోరాటంతో పాటు వర్ణపోరాటం కూడా అవసరమనుకున్నాడు. దళితవాదాన్ని స్వీకరించి అసంఖ్యాకంగా పాటలు పాడాడు. డా. బి.ఆర్. అంబేడ్కర్ ఉత్సవాలలో పాల్గొన్నాడు. ఆ రకంగా సమన్వయవాదం వైపు అడుగులు వేశాడు. ఫలితంగా సమకాలీన రాజకీయాలలో కూడా తనదైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. పెత్తందారీల పాలిట బందూకుగా.. అణగారిన వర్గాలకు బాసటగా నిలిచిన గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ (74) కన్నుమూశారు. ఛాతీ నొప్పితో జూలై 20న హైదరాబాద్ అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం కుదుటపడింది.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారని భావిస్తుండగా.. అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ లోకం వీడారు. ఏదిఏమైనా అర్ధ శతాబ్ది సాహిత్య సాంస్కృతిక రాజకీయ చరిత్రలో మార్పు కోసం కృషి చేసిన చరిత్రపురుషునిగా గద్దర్ సుస్థిరంగా నిలిచివుంటారు.
Updated Date - Aug 06 , 2024 | 01:38 PM