పట్టించుకోండి
ABN, Publish Date - Jun 14 , 2024 | 03:39 PM
నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.
శిథిలావస్థలో ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి
రోజురోజుకూ తగ్గుతున్న పడకల సంఖ్య
ఒకప్పుడు 670.. ప్రస్తుతం 300కు పరిమితం
కరవైన మరమ్మతులు.. ఆందోళనలో రోగులు
బోర్డు ఉన్నా అభివృద్ధి పట్టదాయే
హైదరాబాద్ సిటీ, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కానీ పాత ఆస్పత్రుల అభివృద్ధిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. నగరంలో రిఫర్ హాస్పిటల్‌గా ఉన్న ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ఆస్పత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో ఇక్కడ పడకల సంఖ్య రోజురోజుకు కుచించుకుపోతోంది. గతంలో 670 పడకలు ఉండగా.. ప్రస్తుతం 300కే పరిమితమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓపీ సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఈ ఆస్పత్రి ప్రాధాన్యత, అవసరాన్ని గుర్తించి గతంలో జనరల్ ఆస్పత్రిగా మార్చారు. దీంతో బోర్డు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆ దిశగా అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు.
ఇతర జబ్బులకు ఇబ్బందే
చెస్ట్ ఆస్పత్రిలో పడకలు కుచించుకుపోవడంతో రోగులకు చికిత్స అందించడం కష్టతరంగా మారింది. ఇక్కడ కేవలం క్షయ రోగులకు మాత్రమే కాదు. కార్డియోథోరాసిక్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సేవలు సైతం అందిస్తున్నారు. ఆస్తమా నుంచి కేన్సర్, ఆర్థోపెడిక్ నుంచి కార్డియోథోరాసిక్ జబ్బుల వరకు చికిత్స అందించారు. కాలుష్యంతో వచ్చే జబ్బులు, పొగాకుతో వచ్చే రుగ్మతలు, పిల్లల్లో వచ్చే బ్రాంకైంటిస్ వ్యాధులకు ఇక్కడ వైద్యం అందించే వారు. గతంలో కొవిడ్ మాదిరిగానే వణికించిన స్వైన్‌ఫ్లూ మొదటిసారి ఇక్కడే చికిత్సలు అందించి వైద్యులు మన్నలు పొందారు. ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించేందుకు ఇది ప్రత్యేకంగా వైద్యశాలగా ఉండడం చాలా అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు.
పెద్ద సంఖ్యలో పడకలు రద్దు
పాత ఆస్పత్రి భవనంలో ఆర్థోపెడిక్, సర్జరీ, పురుషులు, మహిళ విభాగాల్లో సేవలతో పాటు ల్యాబ్ సర్వీసులు ప్రధాన భవనంలో పూర్తిగా రద్దయ్యాయి. ఎంఎం-6, సీఎ్‌సడీ, ఎంఓటీ-బీ, మెడికల్ స్టోర్, ఆర్థోపెడిక్, కార్డియో థోరాసిక్ యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. మేల్ సర్జికల్ వార్డు బీటలు వారాయి. హిస్టోపాథాలజి గదిలో నాచుపట్టి అధ్వానంగా మారింది. ఫిజియోథెరిపీ విభాగం వద్ద గదులు కూలిపోయి శిథిలంగా మారాయి. అప్పట్లో ఒకొక్క యూనిట్‌కు 40 చొప్పున పడకలు ఉండేవి. శిథిలింగా మారిన పాత భవనంలో వైద్య సేవలు నిలిపివేయడంతో ఏకంగా 370 పడకలను రద్దు చేశారు.
అందుబాటులో ఉన్న వాటితోనే
ప్రస్తుతం కేవలం 300 మందికి మాత్రమే వైద్యం అందించే స్థాయిలో పడకలున్నాయి. ఈ ఆస్పత్రి ఆవరణలోనే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పునాది రాయి వేశారు. అయితే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి చెస్ట్ ఆస్పత్రి పరిఽధిలో ఉండదు. ఇది పూర్తి స్వయం ప్రత్తిపత్తి (అటానమ్‌స)గా వ్యవహరించేలా నిర్మిస్తుండడంతో చెస్ట్ ఆస్పత్రికి దీనికి సంబంధం ఉండదు. ఈ నేపథ్యంలో చెస్ట్ ఆస్పత్రిలో ఊపిరిత్తులకు సంబంధించిన పూర్తి స్థాయి వైద్య సేవలు మున్ముందు అందించడం కష్టంగా మారనుంది. చెస్ట్ ఆస్పత్రిగా పేరుగాంచిన ఆస్పత్రి ఇప్పుడు ఆ పేరు ఉనికిని కొల్పోయే ప్రమాదముంది.
కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు
చెస్ట్ ఆస్పత్రిలో పల్మానాలజీ, కార్డోయో థోరాసిక్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, కేన్సర్ వంటి విభాగాలతో ప్రత్యేక ఛాతీ, ఊపరితిత్తుల ఆస్పత్రి నిర్మాణం అవసరమని వైద్యులు గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. కొత్త ఆస్పత్రిని నిర్మిస్తే ఇక్కడ శ్వాసకోశ సంబంధిత జబ్బులకు శిక్షణ ఇవ్వొచ్చనని, ఆపరేషన్ థియేటర్లు నిర్మిస్తే అన్ని జబ్బులకు చికిత్సలు అందించవచ్చునని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Jun 14 , 2024 | 03:39 PM