టార్గెట్ -2054
ABN, Publish Date - Jun 23 , 2024 | 03:36 PM
గ్రేటర్ హైదరాబాద్‌ను రాబోయే 30ఏళ్లకు అవసరమైన విధంగా సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు ఆథారిటీ(ఉమ్టా) ప్రణాళికలు రూపొందిస్తోంది.
గ్రేటర్‌లో ప్రజా రవాణాపై ప్రణాళికలు
రాబోయే 30 ఏళ్ల రద్దీ ఆధారంగా ప్లాన్
భవిష్యత్తు నగర అభివృద్ధికి అనుగుణంగా..
సమగ్ర మొబిలిటీ ప్లాన్‌లో అధ్యయనం
హెచ్‌ఎండీఏలోని ఉమ్టా ఆధ్వర్యంలో నిర్వహణ
సర్వే ప్రారంభించిన కన్సల్టెన్సీ లీ అసోసియేట్
ఇప్పటికే 10 వేలకు పైగా శాంపిళ్ల సేకరణ
హైదరాబాద్ సిటీ, జూన్23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌ను రాబోయే 30ఏళ్లకు అవసరమైన విధంగా సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు ఆథారిటీ(ఉమ్టా) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఉమ్టా ఆధ్వర్యంలో సమగ్ర మొబిలిటీ ప్లాన్‌లో భాగంగా మహా నగర భవిష్యత్తుకు అనుగుణంగా అభివృద్ధిపై అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు, భవిష్యత్తులో తలెత్తే రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ ఇలా అన్నీ రకాల అంశాలపై సమగ్ర మొబిలిటీ ప్లాన్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తున్న అన్నీ ప్రాంతాలపై పూర్తి స్థాయిలో సర్వే చేసేందుకు ‘లీ అసోసియేట్’ను కన్సల్టెన్సీగా నియమించారు. వివిధ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించడానికి సర్వే సైతం ఇప్పటికే ప్రారంభించారు.
ఔటర్ రింగ్ రోడ్డు హద్దుగా..
గ్రేటర్ భవిష్యత్తు అవసరాల అనుగుణంగా దాదాపు 15ఏళ్ల క్రితం ఓ కన్సల్టెన్సీ ద్వారా సమగ్ర అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించి హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్-2031 రూపకల్పన చేశారు. అయితే తాజాగా 2054 నాటి అవసరాల అనుగుణంగా నగరం ఔటర్ రింగ్ రోడ్డును హద్దుగా చేసుకొని విస్తరిస్తున్న నేపథ్యంలో సమగ్ర మొబిలిటీ ప్లాన్‌ను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు ఆదేశాలిచ్చింది. అందులో భాగంగా హెచ్‌ఎండీఏలోని ఉమ్టా విభాగం ఆధ్వర్యంలో ఈ ప్లాన్ రూపకల్పన కోసం ‘లీ అసోసియేట్’ను కన్సల్టెన్సీగా నియమించి సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు విస్తరిస్తున్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్‌పై అధ్యయనం చేయనున్నారు. ప్రస్తుతమున్న వాహనాలు, భవిష్యత్తులో రాబోయే వాహనాలను అంచనా వేసి ఏర్పాట్లు చేయనున్నారు. గతంలో ప్రణాళికల ఆధారంగా అప్పటికిప్పటికీ పెరిగిన వాహనాల వివరాల ఆధారంగా ట్రాఫిక్‌పై సమగ్ర రిపోర్టును సిద్ధం చేస్తున్నారు.
కొత్త జంక్షన్ల పాయింట్ల గుర్తింపు
గ్రేటర్ పరిధిలో స్ర్టాటజికల్ రోడ్ డెవల్‌పమెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఇప్పటి వరకు ప్లైఓవర్లు, అండర్‌పా్‌సలను చేపట్టారు. అయితే ప్రస్తుతం రూపకల్పన చేయనున్న సమగ్ర మొబిలిటీ ప్లాన్ కూడా రాబోయే రోజుల్లో ఏ ప్రాంతాల్లో జంక్షన్లను అభివృద్ధి చేయాలని పాయింట్లను నిర్ణయించనునుంది. ఆయా చోట్ల ప్రస్తుతమున్న వాహనాల రద్దీ.. ఆ జంక్షన్ సామర్థ్యం.. మున్ముందు పెరిగే వాహనాల రద్దీని నగరంతో పాటు శివారు ప్రాంతాలన్నింటిలోనూ నిర్ధారించనున్నారు. ప్లైఓవర్ల నిర్మాణం.. అండర్‌పా్‌సల ఏర్పాటు తదితర వాటి ద్వారా సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా మార్చేందుకు అవకాశాలను సైతం ప్రణాళికలో సూచనలు చేయనున్నారు.
నగరవాసుల నుంచే అభిప్రాయాల సేకరణ
సమగ్ర మొబిలిటీ ప్లాన్‌లో భాగంగా గ్రేటర్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు పదివేలకుపైగా శాంపిల్స్ సేకరించేందుకు చర్యలు చేపట్టారు. నగర నివాసితుల నుంచే అభిప్రాయాలను సేకరించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగ నిర్వహణ కోసం ఏ వాహనాలను వినియోగిస్తున్నారు. సొంత వాహనాలా? లేకుంటే బస్సు, మెట్రోరైలు, ఎంఎంటీఎస్, ప్రైవేటు వాహనాలా? అనే అంశాలను ఆరా తీయనున్నారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లకు దాదాపు 500మీటర్ల నుంచి కిలోమీటర్ పరిధిలోని నివాసితులు సులువుగా చేరేందుకు గల అవకాశాలను పరిశీలించనున్నారు. వాకింగ్ చేస్తూ స్టేషన్లకు చేరేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించనున్నారు. సైక్లింగ్ ట్రాక్‌లకు ఉన్న అవకాశాలను సైతం గుర్తించనున్నారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండేలా
బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ ఇలా ప్రజా రవాణాను వినియోగించుకునేవారికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా తగిన సూచనలు చేయనున్నారు. మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టేందుకు తగిన ప్రణాళికను అందజేయనున్నారు. ఈ సర్వే ద్వారే గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు మెట్రో విస్తరించడానికి తగిన సూచనలు, సలహాలు కూడా రానున్నాయి. అయితే ఈ సమగ్ర మొబిలిటీ ప్రణాళికలను రూపొందించడానికి ఇప్పటికే లీ అసోసియేట్ సర్వే చేపట్టగా, 2024 నుంచి 2054 వరకు 30 ఏళ్లకు అవసరమయ్యే అంచనాలు వేయనున్నారు. ఈ సర్వేను పూర్తిస్థాయిలో నిర్వహించి ఏడాదిలో సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు.
Updated Date - Jun 23 , 2024 | 03:36 PM