Vasamsetti Subhash: ఎవరీ యంగ్ మినిస్టర్ సుభాష్.. సీనియర్లను కాదని చంద్రబాబు ఎందుకు పదవిచ్చారు..!?
ABN, Publish Date - Jun 13 , 2024 | 02:17 PM
ఒక కార్యకర్త మంత్రి అయ్యారు.. అదృష్టం కలిసి వస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి సుభాష్ సంఘటనే ఒక ఉదాహరణ. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subash) మూడు నెలల కిందట మండపేటలో తెలుగుదేశం (Telugu Desam) పార్టీలో చేరారు...
ఒక కార్యకర్త మంత్రి అయ్యారు.. అదృష్టం కలిసి వస్తే ఎవరూ అడ్డుకోలేరనే దానికి సుభాష్ సంఘటనే ఒక ఉదాహరణ. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subhash) మూడు నెలల కిందట మండపేటలో తెలుగుదేశం (Telugu Desam) పార్టీలో చేరారు. రామచంద్రపురం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది. సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో సుభాష్‌ను పదవి వరించింది. సుభాష్ వైసీపీలో ఒక సాధారణ కార్యకర్త వైసీపీ విధానాలు నచ్చకపోవడం.. నాటి మంత్రి పినిపే విశ్వరూప్‌తో పొసగకపోవడంతో పార్టీ దూరమయ్యారు. అనంతరం సుభాష్ తన రాజకీయ జీవితాన్ని కీలకంగా మలుపు తిప్పుకోగలిగారు. మండపేట ప్రచారానికి వచ్చిన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సుభాష్ వెంటనే రామచంద్రపురం నుంచి బరిలో దిగారు. నియోజకవర్గం కొత్తదైనా రాజకీయ దిగ్గజాలు ఉన్న నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనూహ్యంగా చంద్రబాబు మంత్రివర్గంలో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
అంతా ఒక్కటే!!
కోనసీమ జిల్లాలో ఇద్దరు కీలక ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ సామాజికవర్గాల సమతూకంలో భాగంగా వారికి మంత్రి పదవులు రాలేదని తెలుస్తోంది. కూటమి గెలుపులో జనసేన కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన కోటాలో రెండు మంత్రి పదవులు పవన్‌కల్యాణ్, కందుల దుర్గేష్‌లకు వెళ్లాయి. దీంతో వారి సామాజికవర్గం నుంచి టీడీపీలో ఉన్న ఇతరులకు అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలోని బలమైన సామాజిక వర్గంనుంచి పోటీ చేసి గెలిచిన సుభాష్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చెల్లుబో యిన వేణు వైసీపీ హయాంలోను, గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం కాంగ్రెస్ హయాంలోను, ఎమ్మెల్సీగా ఉంటూ వైసీపీ హయాంలోను మంత్రి పదవి పొందారు. వీరంతా ఒకటే సామాజికవర్గం కావడం గమనార్హం. ఇలా వరుసగా రామచంద్రపురం నుంచి ఎన్నికైన పిల్లి సుభాష్‌చంద్రబోస్, చెల్లుబోయిన వేణు, ఇప్పు డు కూటమినుంచి గెలిచిన వాసంశెట్టి సుభాష్‌కు మంత్రి పదవి దక్కిందని పలువురు భావిస్తున్నారు.
Updated Date - Jun 13 , 2024 | 02:23 PM