Viral Video: విమానం ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయిన వ్యక్తి.. ఆ తర్వాత జరిగిందిదే
ABN , Publish Date - Nov 07 , 2024 | 10:30 AM
విమానం ప్రయాణిస్తున్న సమయంలో డోర్స్ ఓపెన్ చేయడం ప్రమాదకరమనే విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తి మాత్రం విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
విమానం గమ్యస్థానం దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించి తోటి ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో కొందరు ప్యాసింజర్లు తక్షణమే స్పందించి అతడిని అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిందిత వ్యక్తిని చితకబాదారు. దాదాపు స్పృహ కోల్పోయేలా కొట్టారు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్ నుంచి పనామా వెళ్తున్న కోపా ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగింది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుందని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది.
విమానం షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తుండగా.. ల్యాండింగ్‌కు 30 నిమిషాల ముందు నిందిత వ్యక్తి విమానం వెనుక భాగానికి వెళ్లాడు. తన ఫుడ్ ట్రేలో వచ్చిన ప్లాస్టిక్ కత్తిని చూపించి ఫ్లైట్ సిబ్బందిలో ఒకర్ని బందీగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ఈ విధంగా వ్యవహరించాడు.
అయితే తోటి ప్రయాణీకులు నిందితుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అతడిని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని ప్రయాణీకులు అడ్డగించడం ఈ వీడియోలో కనిపించింది. మరో వీడియో క్లిప్‌లో అతడి ముఖంపై రక్తం, చేతికి సంకెళ్ల వేసి తీసుకెళ్తున్నట్టు కనిపించింది.
కాగా ఈ ఘటన జరిగిన సమయంలో న్యూయార్క్ పోస్ట్ ఫోటో జర్నలిస్ట్ క్రిస్టియానో కార్వాల్హో విమానంలోనే ఉన్నారు. ల్యాండింగ్‌కు 30 నిమిషాల ముందు తలుపు తెరవడానికి నిందిత వ్యక్తి ప్రయత్నించాడని క్రిస్టియానో చెప్పారు. ‘‘ఫ్లైట్ సహాయక సిబ్బందిలో ఒకరు కేకలు వేయడం ప్రారంభించారు. ఆ వ్యక్తిని బంధీగా మార్చుకోవడానికి నిందితుడు ప్రయత్నించాడు. కానీ అతడు చాలా బలంగా ఉండడంతో అది సాధ్యపడలేదు. హెచ్చరిస్తుండగానే నిందితుడు విమానంలో వెనుక భాగానికి వెళ్లాడు. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు’’ అని వివరించారు. ఇక తోటి ప్రయాణీకుల్లో కొందరు అతడిని దాదాపు స్పృహ కోల్పోయేవరకు కొట్టారని జర్నలిస్ట్ క్రిస్టియానో పేర్కొన్నారు.
కాగా విమానం పనామాలో ల్యాండ్ అయిన తర్వాత జాతీయ భద్రతా సిబ్బంది ఫ్లైట్‌లోకి ప్రవేశించి నిందితుడిని తీసుకెళ్లారని, అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారని కోపా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. నిందిత వ్యక్తి విమానం డోర్ తెరవకుండా అడ్డుకున్న సిబ్బంది, ప్రయాణీకులను ఎయిర్‌లైన్స్ ప్రశంసించింది. నిందిత వ్యక్తి విషయంలో విమానం ల్యాండ్ అయ్యే వరకు అవసరమైన భద్రతా ప్రోటోకాల్‌లను పాటించారని, ఇందుకోసం ప్రయాణీకుల సాయం తీసుకున్నారని కోపా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఓటమిపై స్పందించిన కమలా హారిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు
గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్-ఎంఎస్ ధోనీ.. ఫొటోలు, వీడియోలు వైరల్
మీ భార్య డెలివరీకి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తే.. గవాస్కర్‌కి ఆసీస్ మాజీ క్రికెటర్ కౌంటర్
వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే
For more Viral News and Telugu News