Viral: ఇల్లు అద్దెకిస్తామంటూ మహిళ యాడ్..ఆమె పెట్టిన కండీషన్ చూసి..
ABN, Publish Date - Aug 02 , 2024 | 03:30 PM
బెంగళూరులో ఓ మహిళ తమ ఇల్లు అద్దెకిస్తామని పోస్టు పెట్టింది. అయితే, ఆమె పేర్కొన్న రెంట్, డిపాజిట్ ఎంతో తెలిసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇంటి అద్దె చెల్లించేందుకు ఆస్తులు అమ్ముకోవాలంటూ కొందరు కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నగరాల్లో జీవనం నానాటికీ కష్టంగా మారుతోంది. రేట్ల పెరుగుదల, ట్రాఫిక్ ఇబ్బందులు వెరసి సామాన్యులు నగరాల పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఇక మెట్రో నగరాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారత దేశ సిలికాన్ వ్యాలీగా పేరు పడ్డ బెంగళూరులో పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న ఓ మహిళ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. సకల సౌకర్యాలతో అందంగా ఉన్న ఇల్లు అద్దెకిచ్చేందుకు ఆమె పెట్టిన కండీషన్లు జనాలను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.
Viral: యూఎస్ఏలో భారతీయ బైక్.. దీన్ని చూసి అమెరికన్లు వెర్రెత్తిపోవాల్సిందే!
లీషా అగర్వాల్ అనే మహిళ ఈ పోస్టు పెట్టింది. కోరమంగళలో తమకో 2బీహెచ్‌కే ఫ్లాట్ ఉందని, దాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నామని చెప్పింది. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని చెప్పింది. నెల అద్దె రూ.43 వేలని, డిపాటిజ్ 2.5 లక్షలని తన పోస్టులో పేర్కొంది. ఇంటితో పాటు ఫర్నీచర్ ఇతరత్రాలను యథాతథంగా అద్దెకు తీసుకోవాలని కండిషన్ పెట్టింది. ఫర్నీచర్‌కు ఇతర వస్తువులకు అదనంగా చెల్లించాలని పేర్కొంది. ఇల్లు నచ్చిన వాళ్లు తనకు నేరుగా మెసేజ్ చేయాలని సూచించింది. ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు పెళ్లి, పెంపుడు కుక్కలు లాంటి కండీషన్లు ఏమీ పెట్టబోమని కూడా హామీ ఇచ్చింది. విప్రోకు దగ్గర్లో ఉన్న తమ ఇల్లు అద్భుతంగా ఉంటుందని, ఓ గదిలోని బాల్కనీ మరింత గొప్పగా ఉంటుందని వివరించింది (Bengaluru Woman’s Post Seeking Tenant For 2BHK Shocks Internet).
ఇక పోస్టు చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఆశ్చర్యంగా ఉందని, నమ్మశక్యంగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఇల్లు మంచిదే కానీ మరీ రెండున్నర లక్షల డిపాజిట్.. అదీ కోరమంగళలోనా? అని ఓ వ్యక్తి షాకైపోయాడు. ఈ మొత్తం చెల్లించేందుకు కిడ్నీలు అమ్మకానికి పెట్టాలని అన్నారు. మహిళ పోస్టుపై మరికొందరు సెటైర్లు పేల్చారు. రెండున్నర లక్షలేనా? మరీ తక్కువ ధరగా ఉంది. కనీసం పది లక్షలు తీసుకోవాలని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఈ రెంటుతో నేను ఏకంగా లగ్జరీ హోటల్‌లోనే మకాం వేస్తానని మరో వ్యక్తి చెప్పుకుపోయాడు.
మహిళ డిమాండ్స్‌కు ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని కొందరు అన్నారు. ఆమె పేర్కొన్న ధరకు ముంబైలో సింగిల్ బెడ్‌రూం ఇల్లు కూడా రాదని కొందరు వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఇలాంటి ఇళ్ల అద్దెలు సాధారణమే అని కొందరు ముక్తాయించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Updated Date - Aug 02 , 2024 | 03:38 PM