Viral Video: సింహాన్ని భయపెట్టేందుకు ట్రై చేసిన చీతా.. చివరకు..
ABN, Publish Date - Sep 05 , 2024 | 11:01 AM
తన ఆహారాన్ని సింహం ఎత్తుకుపోకుండా చీతా చేసిన ప్రయత్నం జనాలను ఆకట్టుకుటోంది. చీతా తన ప్రయత్నంలో విఫలమైనా జనాల ప్రశంసలు పొందుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సింహం, చీతా, పెద్దపులి.. ఇవన్నీ వేటలో నిష్ణాతులైన జంతువులే కానీ వీటికి ప్రతిసారీ విజయం వరించదు. దీంతో, ఈ జీవులు కుదురితే ఇతర క్రూర జంతువుల వేటాడిన వాటిని దోచుకెళ్లిపోతుంటాయి. జంతు ప్రపంచంలో ఇది సహజం. తాజాగా ఆఫ్రికాలో అలాంటి మరో దృశ్యం ఆవిష్కృతమైంది. ఇందులో చీతా తన నోటికాడ కూడును ఎలా పోగొట్టుకున్నదీ చూసి జనాలు నిట్టూరుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: ఇతడు పైలట్టేనా? లారీ క్లీనరా? విమానం కిటికీలోంచి బయటకొచ్చి..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వేట కుక్కకు అదృష్టం కలిసిరావడంతో ఓ జింకను ఒంటరిగానే వేటాడ గలిగింది. సాధారణంగా వేట కుక్కలు గుంపులుగా వేటాడతాయి. కానీ ఈ కుక్కకు మాత్రం లక్ కలిసొచ్చింది. అయితే, కుక్క వేటను దూరం నుంచో ఓ చీతా గమనించసాగింది. జింక దాని నోటికి చిక్కగానే చీతా దూసుకొచ్చి దాని కళేబరాన్ని కుక్క నుంచి లాగేసుకుంది. చీతాతో ఒంటరిగా పోరాడే సాహసం చేయలేక అడవి కుక్క అక్కడి నుంచి నిరాశతోనే నిష్క్రమించింది. అసలే శ్రమే లేకుండా మంచి ఆహారం దొరికినందుకు చీతా సంబరం అంబరాన్ని అంటిందనడంలో ఎటువంటి సందేహం లేదు (Cheetah stands its ground against lion over stolen hunt).
అయితే, చీతా అదృష్టం క్షణాల్లో తిరగబడింది. అటువైపుగా నడుచుకుంటూ వస్తున్న ఓ సింహ కంట చీతాను, దాని వద్ద ఉన్న జింక కళేబరాన్ని గుర్తించింది. దీంతో, మరో ఆలోచన లేకుండా చీతా వైపు వచ్చింది. దాని అడుగుల చప్పుడు వినగానే చీతాకు గుండెలో భయం మొదలైంది. అయితే, సునాయాసంగా చిక్కిన ఆహారాన్ని అది వదల దలుచుకోలేదు. ఏకంగా సింహాన్నే బెదిరించేందుకు సిద్ధమైంది. కాసేపు గాండ్రించింది. సింహాన్ని చూస్తూ దాడి చేయబోతున్నట్టు బిల్డప్ ఇచ్చింది.
అడవికి రాజైన సింహం ఈ బెదిరింపులను అస్సలు పట్టించుకోలేదు. నేరుగా చీతావైపు దూసుకొచ్చింది. తన ఆహారాన్ని కాపాడుకునేందుకు చీతా అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అయినా సింహాన్ని కట్టడి చేయలేకపోయింది. దీంతో, ఆహారం కంటే ప్రాణాలు కాపాడుకోవడమే బెటరని భావించిన చీతా జింక కళేబరాన్ని అక్కడే వదిలేసి జంపైపోయింది. అయితే, సింహాన్ని ఎదుర్కొనేందుకు అది చేసిన ప్రయత్నం మాత్రం జనాల ప్రశంసలు పొందుతోంది.
Updated Date - Sep 05 , 2024 | 11:04 AM