Fraud: పోలీసులు గుర్తు పట్టకుండా ప్లాస్టిక్ సర్జరీ.. చివరకు
ABN, Publish Date - Oct 28 , 2024 | 06:04 PM
విమానాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఓ యువతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని తిరగడానికి ఆమె వేసిన ప్లాన్ చూసిన అధికారులు కంగుతిన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఓ యువతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని తిరగడానికి ఆమె వేసిన ప్లాన్ చూసిన అధికారులు కంగుతిన్నారు. థాయిలాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైనాకు చెందిన సదరు మహిళ(30) గత దశాబ్ద కాలంగా మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతోంది. 2016 - 2019 మధ్య కాలంలో ఆమె ఆరుగురు యువకులకు విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించింది. అలా వారి నుంచి 1.52 మిలియన్ యువాన్‌లు(రూ.1.77 కోట్లు) తీసుకుంది. చివరకు వారందరినీ మోసం చేసి థాయిలాండ్ పారిపోయింది. మోసపోయిన వారిలో ఆమె బంధువు కూడా ఉండటం గమనార్హం. ఆమెపై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు ఉందని, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చైనా పోలీసులు థాయ్‌లాండ్ ప్రభుత్వానికి సమాచారం అందించారు.
పట్టించిన వారికి ప్రోత్సాహకం..
ఆమెను పట్టించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తామని థాయ్ ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. దీంతో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆమె ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అలా పోలీసుల కళ్లుగప్పి దాదాపు 2 ఏళ్లపాటు తప్పించుకుని తిరిగింది. ఇటీవల ఆమె చైనాలోని తన స్వస్థలానికి వెళ్లాలని సిద్ధమైంది. ఇందుకోసం ఎయిర్ పోర్ట్‌కు వెళ్లి ఆమె తన పాస్ పోర్ట్‌ను అధికారుకు చూపించింది. అయితే ముఖం సరిపోలక పోవడంతో ఆమె ఎవరనేదానిపై విమానాశ్రయ సిబ్బంది దర్యాప్తు చేశారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్న మహిళగా తేల్చారు. తప్పించుకుని పారిపోవాలని చూసిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని దర్యాప్తులో తేటతెల్లమైంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. లావో రోంగ్ జీ అనే చైనీయుడు కూడా నేరారోపణలు ఎదుర్కొంటూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అనేకసార్లు ముఖానికి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. అలా 20 ఏళ్లపాటు ఎవరికి దొరక్కుండా ఉన్న అతను 2019లో పోలీసులకు చిక్కాడు.
Updated Date - Oct 28 , 2024 | 06:04 PM