Amazon: ఐఫోన్ 15 ఆర్డర్ చేస్తే.. పార్శిల్‌లో ఏం ఉందో తెలుసా? అమెజాన్ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Feb 24 , 2024 | 04:42 PM
తాజాగా అమెజాన్ ద్వారా ఐఫోన్ 15 ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ వ్యక్తి తనకు జరిగిన మోసం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అమెజాన్ సంస్థ వెంటనే స్పందించింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. నచ్చిన వస్తువులను నేరుగా ఇంటికే రప్పించుకుంటున్నారు. సదరు సంస్థలు కూడా నమ్మకమైన సేవలు అందిస్తుండడంతో ఈ-కామర్స్ బిజినెస్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అయితే అప్పుడప్పుడు మాత్రం వినియోదారులుకు షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఐఫోన్ 15 (iPhone 15) ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది.
సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్‌గా పాపులర్ అయిన ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం అమెజాన్ (Amazon) ద్వారా ఐఫోన్ 15 ఆర్డర్ చేశాడు. డెలివరీ అందిన తర్వాత పార్శిల్ ఓపెన్ చేసి ఫోన్ చూసుకున్నాడు. అయితే ఆ ఫోన్ నకిలీది (Fake iPhone) అని తెలుసుకుని షాకయ్యడు. వెంటనే ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నాడు. ``అమెజాన్ నాకు నకిలీ ఐఫోన్‌ను పంపించింది. ఇందులో కేబుల్ కూడా లేదు. మీరు కూడా గతంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారా`` అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసి అమెజాన్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది.
తాము కూడా గతంలో ఇలాగే మోసపోయామని చాలా మంది కామెంట్లు చేశారు. ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చిందని ఒకరు, ఫోన్ కోసం ఆర్డర్ చేస్తే సబ్బులు వచ్చాయని మరొకరు కామెంట్లు చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అమెజాన్ స్పందించింది. తప్పు జరిగినందుకు క్షమాపణలు చెప్పింది. 12 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అన్నట్టుగానే గబ్బర్ నుంచి ఫోన్‌ను తీసుకుని, మొత్తం డబ్బులను రిఫండ్ చేసే ప్రాసెస్‌ను ప్రారంభించింది.