Divorce Temple: ఈ గుడిలో మొక్కితే విడాకులు ఖాయమట..!
ABN, Publish Date - Aug 12 , 2024 | 01:58 PM
Divorce Temple in Japan: ఎక్కడైనా సరే విడాకులు తీసుకోవాలంటే భార్యాభర్తలిద్దరూ కోర్టు మెట్లు ఎక్కాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. అప్పటికీ న్యాయ మూర్తి విడాకులు మంజూరు చేస్తారన్న గ్యారంటీ లేదు. అయితే జపాన్‌లోని ఒక ఆలయంలోకి వెళితే మాత్రం విడాకులు పక్కా..
Divorce Temple in Japan: ఎక్కడైనా సరే విడాకులు తీసుకోవాలంటే భార్యాభర్తలిద్దరూ కోర్టు మెట్లు ఎక్కాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి. అప్పటికీ న్యాయ మూర్తి విడాకులు మంజూరు చేస్తారన్న గ్యారంటీ లేదు. అయితే జపాన్‌లోని ఒక ఆలయంలోకి వెళితే మాత్రం విడాకులు పక్కాగా వస్తాయనే నమ్మకం ఉంది. అందుకే ఆ ఆలయానికి 'డైవోర్స్ టెంపుల్'గా పేరు స్థిరపడింది. ఆ విచిత్రమైన టెంపుల్ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆలయాలు అనేకం ఉన్నా.. వాటిలో కొన్నింటికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫలానా గుడికి వెళితే వీసా వస్తుందని, ఫలానా ఆలయాన్ని సందర్శిస్తే సంతానం కలుగుతుందని, ఫలానా దేవతను కొలిస్తే వివాహం జరుగుతుందని, ఫలానా దేవుడిని మొక్కితే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయనే నమ్మకం, విశ్వాసం ప్రజల్లో బలంగా ఏర్పడతాయి. అయితే పెళ్లి బంధం నుంచి దూరం కావాలని కోరుకునే వారి కోరికలు కూడా నెరవేర్చే దేవుడున్నాడంటే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. నిజానికి పెళ్లి చేసుకోవడం చాలా సింపుల్. ఇద్దరు ఇష్టపడితే మూడుముళ్లు పడతాయి. కానీ విడాకులు తీసుకోవాలంటే మాత్రం ఈ రోజుల్లో అంత సులభం కాదు. అనేక నిబంధనలు అడ్డువస్తాయి.
ఎందుకు విడాకులు కోరుకుంటున్నారో కారణాలు చెప్పాలి. ఇద్దరికీ సమ్మతం కావాలి. అప్పుడు మాత్రమే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఇదంతా కోర్టులు అందుబాటులో ఉన్న ఇప్పటి పరిస్థితి. మరి 600 ఏళ్ల క్రితం విడాకుల పరిస్థితులు ఎలా ఉన్నాయి. విడాకులు కోరుకునే మహిళలు ఏం చేసేవారు. గృహహింసను తట్టుకోలేక మహిళలు ఎక్కడికి వెళ్లేవారు. అంటే ఇదిగో జపాన్‌లోని కామకూర అనే పట్టణంలోని ఈ ఆలయం మహిళలకు అండగా నిలిచింది. భర్తలు పెట్టే హింసను తట్టుకోలేని మహిళలు, విడాకులు కోరుకుంటూ ఈ ఆలయంలోకి వచ్చేవారట. వారికి ఆలయ అధికారులు ఆశ్రయం కల్పించి విడాకులు మంజూరు అయ్యేలా చేసేవారు. ఈ ఆలయంలోకి ఒక్కసారి వచ్చారంటే కచ్చితంగా వారికి విడాకులు లభిస్తాయని ఇప్పటికీ విశ్వసిస్తారు.
ఇదీ ఆలయ చరిత్ర..
కొన్ని వందల ఏళ్ల క్రితం జపాన్‌లో మహిళలకు విడాకులు కోరే హక్కు లేదు. పురుషులకు మాత్రమే ఆ హక్కు ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది భర్తలు పెట్టే హింసను భరించలేక భార్యలు ఆశ్రయం కోరుతూ ఈ ఆలయంలోకి వచ్చేవారు. అలాంటి వారిని అక్కున చేర్చుకుని వారికి నీడను ఇచ్చేది ఈ బౌద్ధాలయం. ఈ ఆలయాన్ని 1285లో హోరిచ్చి అనే మహిళ నిర్మించారు. దీనికి 'టోకిజి' అని పేరు. నిజానికి అప్పట్లో మహిళలకు ఆశ్రయం ఇవ్వడం కోసం కట్టింది కాదు. కానీ కాలక్రమంలో మహిళలు రావడం, ఆశ్రయం కోరడంతో వారిని అక్కున చేర్చుకుంది. ఆ ఆలయంలోనే మూడేళ్లపాటు ఉన్న వారికి హోరిచ్చి విడాకులు మంజూరయ్యేలా చేసేది. తరువాత దాన్ని రెండేళ్లకు కుదించారు. అలా 2 వేల మంది మహిళలకు ఈ ఆలయం విడాకులు ఇప్పించింది.
పురుషులకు ప్రవేశం లేదు.. కానీ..
1902 వరకు ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. తరువాత కాలంలో చైర్మన్‌గా పురుషున్ని నియమించడంతో ఆ నిబంధన తొలగిపోయింది. కాలక్రమంలో విడాకులను కోరుతూ ఆలయాన్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరగడం, విమర్శలు రావడంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలని ఆలయ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా, టోకిజి ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. క్రమక్రమంగా ఇక్కడ మొక్కుకుంటే విడాకులు తప్పకుండా వస్తాయని విశ్వాసం ప్రజల్లో బాగా పెరిగిపోయింది.
అందుకే ఇప్పటికీ డైవోర్స్ కోరుకునేవారు ఇక్కడికి వస్తూనే ఉంటారు. విడాకుల ఆలయంగా పేరొందినప్పటికీ.. ఆలయ పరిసరాలు పచ్చటి తోటలతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంటాయి. ప్రస్తుతం విడాకులకు సంబంధించిన అంశాలలో ఆలయ అధికారులు జోక్యం చేసుకోవడం లేదు. అయితే జపాన్ చరిత్రలో మహిళా సాధికారతకు, మహిళా స్వేచ్ఛకు ఈ ఆలయం ఒక గుర్తుగా నిలిచిపోయింది.
For More Trending News and Telugu News..
Updated Date - Aug 12 , 2024 | 01:58 PM