Viral: ఇదేం వింతరా బాబూ.. ఈ దేశంలో ఏడాదికి 13 నెలలట!
ABN, Publish Date - Aug 29 , 2024 | 12:00 PM
ఇథియోపియా దేశం 13 నెలలున్న కాలెండర్ ఫాలో అవుతోందంటూ ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పురాతన కాలెండర్ వినియోగిస్తుండటంతో అక్కడ ఏడాదికి ఒక నెల ఎక్కువని వీడియోలో తెలిపారు. దీంతో, ఈ ఉదంతం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల్లో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. కానీ సమయం ఎక్కడైనా ఒకటే.. ఏడాదికి 12 నెలలే. అయితే, ప్రపంచంలో ఒకే ఒక్క దేశంలో మాత్రం ఏడాదికి ఏకంగా 13 నెలలు. ఆశ్చర్యం కలిగించే ఈ వింత కాలెండర్ ఆఫ్రికా దేశం ఇథియోపియాలో అమల్లో ఉందట. అంతేకాకుండా, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇథియోపియా ఏకంగా ఏడేళ్లు వెనకబడి కూడా ఉందట. ఈ మేరకు ఇథియోపియా కాలెండర్ విశేషాల గురించి చెబుతున్న ఓ ఇన్‌స్టా పోస్టు నెట్టింట ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది (Viral).
Viral: రోల్స్ రాయిస్ షోరూంలో భారతీయ బిలియనీర్‌కు అవమానం! ఆ తరువాత..
ఇథియోపియా కాలెండర్ గురించి ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ వీడియో ప్రకారం, అక్కడి కాలెండర్‌లో 13 నెలలు ఉంటే చివరి నెలలో మాత్రం ఐదు రోజులే ఉంటాయి. ఇక లీపు సంవత్సరంలో చివరి నెలకు మరో రోజు జతకూడుతుంది. యావత్ ప్రపంచంలో 2024వ సంవత్సరం ముగిసిపోయే దశకు వస్తుంటే ఇథియోపియాలో ఇంకా మొదలు కూడా కాలేదు. వచ్చే నెల 11న అక్కడ 2024 ప్రవేశించనుంది.
ఇథియోపియా ఓ పురాతన కాలెండర్ వినియోగిస్తున్న కారణంగా ఏడాదికి ఒక నెల అదనంగా జతకూడిందట. దీన్ని రోమన్ చర్చ్ క్రీస్తు శకం 525లో సరిచేసింది. నాటి నుంచీ ఇథియోపియా ఇదే కాలెండర్‌ను ఫాలో అవుతోంది. దీన్ని గీజ్ కాలెండర్ అని పిలుస్తారు. గ్రెగోరియన్ కాలెండర్‌తో పోలిస్తే ఇందులో నెలల పేర్లు భిన్నంగా ఉంటాయి. తొలి నెలను మెస్కెరమ్ అని పిలుస్తారు. ఇది సెప్టెంబర్ 11న మొదలువుతుంది. తరువాతి నెలలను వరుసగా టికిమ్ట్, హిదర్, టాసాస్, టిర్, యాకాటీట్, మగ్గబిట్, గిన్బోట్, సెనే, హమ్లే, నెహాసా, ఫాగుమీ అని పిలుస్తారు (This Country Observes 13 Months in a Year and is 7 Years Behind Rest of the World Claims Viral Post).
కాలం లెక్కల్లోనే కాకుండా ఇథియోపియాకు ఇంకా అనే ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రిటన్ ఆక్రమించుకోని ఒకే ఒక్క ఆఫ్రికా దేశం ఇథియోపియా. అయితే, ఆరేళ్ల పాటు మాత్రం ఈ దేశం ఇటలీ ఏలుబడిలో ఉందట. అంతేకాదు. కాఫీ పుట్టింది ఇక్కడేనని కూడా జనాలు చెబుతుంటారు.
ఇలా ఇథియోపియా కాలెండర్ కథ చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏకంగా 5.4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఛలోక్తులు, హాస్యోక్తులతో కామెంట్ల వర్షం కురిపించారు. భారత్‌లో మొబైల్ రిచార్జీల వ్యాలిడిటీ కూడా 28 రోజులే ఉంటుందని, ఈ లెక్కన ఇక్కడ కూడా 13 నెలల సంవత్సరం అమల్లో ఉన్నట్టేనని ఓ వ్యక్తి సరదాగా కామెంట్ చేశాడు. ఇలా రకరకాల వ్యాఖ్యల మధ్య వీడియో విపరీంగా వైరల్ అవుతోంది. జనాలను బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది.
Updated Date - Aug 29 , 2024 | 12:08 PM