చీకటంటే భయం!
ABN, Publish Date - Sep 29 , 2024 | 07:15 AM
ఆరేళ్ల క్రితం బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘స్త్రీ’కి... కొనసాగింపుగా వచ్చిన ‘స్త్రీ 2’తో మరోసారి ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది శ్రద్ధాకపూర్. ప్రేక్షకులను భయపెట్టడంలో సూపర్ సక్సెస్ అయిన ఈ అందాల రాక్షసి చెబుతున్న తాజా విశేషాలివి...
ఆరేళ్ల క్రితం బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘స్త్రీ’కి... కొనసాగింపుగా వచ్చిన ‘స్త్రీ 2’తో మరోసారి ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది శ్రద్ధాకపూర్. ప్రేక్షకులను భయపెట్టడంలో సూపర్ సక్సెస్ అయిన ఈ అందాల రాక్షసి చెబుతున్న తాజా విశేషాలివి...
అవి నాకు ప్రత్యేకం
నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. అలాగని లేటెస్ట్ ట్రెండ్స్ ఏమీ ఫాలో అవ్వను. నా మనసుకు అప్పటికి ఏది నచ్చితే అదే కొంటా. సాధారణంగా నేను ఆభరణాలు పెద్దగా ధరించను. నా దగ్గర ఉన్న అత్యంత విలువైన బంగారు ఆభరణాలు అంటే.. మా అమ్మమ్మ గాజులు. పండగైనా, ఫంక్షన్ అయినా నా చేతికి ఆ గాజులు ఉండాల్సిందే. అవి నాకు చాలా ప్రత్యేకం.
అందుకే శాకాహారిని...
జంతువులంటే ప్రాణం నాకు. ‘పెటా’కు మద్దతుగా ఉంటాను. మూగజీవులపై మమకారంతోనే తోలు ఉత్పత్తులు వాడటం మానేశాను. అంతేకాదు, పూర్తి శాకాహారిగా కూడా మారిపోయా. నిలువ నీడనిచ్చిన భూమిని కాపాడుకోవడం మన బాధ్యత. ప్రతీ ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి. పర్యావరణానికి కీడు చేయకుండా బతకడం అలవాటు చేసుకోవడం మంచిది.
లేనిపోని నియమాలు అనవసరం
శరీరాకృతిపై ఎక్కువగా దృష్టి పెట్టడం అనవసరం అనేది నా అభిప్రాయం. మంచి నటులై, విషయం ఉందంటే... ఫిట్‌గా ఉండాలి, జీరో సైజ్ పాటించాలనే లేనిపోని నియమాలు అనవసరం. ప్రేక్షకులకు నటన నచ్చితే చాలు... ఎలా ఉన్నా అంగీకరిస్తారు. అభిమానులవుతారు. ఇక అవకాశాలంటారా? ప్రతిభ ఉంటే సినిమాలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.
లైట్ ఉండాల్సిందే
నిజానికి దెయ్యాలు ఉన్నాయో, లేవో తెలీదు గానీ... నాకు మాత్రం చీకటంటే చచ్చేంత భయం. రాత్రయితే కచ్చితంగా నా రూమ్‌లో లైట్ ఆన్‌లో ఉండాల్సిందే. ఉరుములు, మెరుపులన్నా కూడా అంతే భయం. అయితే సాహసోపేతమైన పనులు చేయడమంటే భలే సరదా. ‘ఏక్ విలన్’ సినిమాలోని ఓ సన్నివేశంలో భాగంగా బైక్ నడపాల్సి వచ్చింది. మొదట కాస్త ఉత్సాహం చూపించా. తీరా బైక్ ఎక్కాక చేతులు వణకడం మొదలయ్యాయి. బైక్‌ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేక ఎన్నిసార్లు కింద పడ్డానో లెక్కేలేదు.
పియానో వాయిస్తా
నేను ఎక్కువగా ధ్యానం, యోగా చేస్తుంటా. ఖాళీ సమయం దొరికితే స్నేహితులు, కుటుంబసభ్యులతో గడపడానికి ఇష్టపడతా. మనసు బాగోకపోతే నచ్చిన సంగీతం పెట్టుకొని, ఫుల్‌గా డ్యాన్స్ చేస్తా. వీలు చిక్కితే పియానో వాయిస్తా. లద్దాఖ్, గోవా, న్యూయార్క్ నాకు బాగా ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు.
యూ లవ్ ఐ...
నేను, వరుణ్ ధావన్ చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఇద్దరం కలిసే పెరిగాం. అప్పట్లో అతడిపై ఓ చిన్నపాటి క్రష్ కూడా ఉండేది. నాకు బాగా గుర్తు... అప్పుడు నా వయసు ఎనిమిదేళ్లనుకుంటా. ఓరోజు మేము ఓ కొండపైకి వెళ్లి ఆడుకుంటున్నాం. అప్పుడు నేను వరుణ్‌తో ‘నేను ఒకటి ఉల్టా చెబుతాను. నువ్వు దాన్ని సరిచేయాల’ని చెప్పాను. దానికి వరుణ్ ‘సరే’ అన్నాడు. నేను వెంటనే ‘యూ లవ్ ఐ’ అని చెప్పాను. దానికి అతను ‘నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండద’ని చెప్పి, అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఫన్నీగా అనిపిస్తుంది.
స్టార్ ఎవరైనా...
గతంలో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ నా పాత్రకు ప్రాధాన్యం లేదనే వాటిని తిరస్కరించా. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంటా. ఏవో కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో కనిపించే పాత్రలను నేను అస్సలు అంగీకరించను. నా పాత్రకు ప్రాముఖ్యత లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా నిర్మోహమాటంగా నో చెప్పేస్తా.
Updated Date - Sep 29 , 2024 | 07:15 AM