Viral: ఇదేం ప్రేమ రా బాబూ! తన పర్సు చోరీ చేసిన దొంగతో యువతి లవ్ ట్రాక్
ABN, Publish Date - Nov 09 , 2024 | 04:18 PM
తన పర్సు చోరీ చేసి ఆపై తిరిగిచ్చేసిన ఓ దొంగతో యువతి ప్రేమలో పడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. నడిరోడ్డుమీదే ఆ ఇద్దరూ ప్రేమగా కౌగిలించుకోవడం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఫేక్ అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. తొలిచూపులోనే ప్రేమ.. ఇది కొందరికి మాత్రమే అనుభవంలోకి వచ్చే భావన అని అనుభవజ్ఞులు చెబుతుంటారు. కొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తుంటారు. భార్యాభర్తలు లేక ప్రేమికులు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక జనించేదే అసలైన ప్రేమ అనేది కొందరి నిర్వచనం. ఇదిలా ఉంటే, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ వీడియో జనాలను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇదేం వింత ప్రేమ రా బాబూ అంటూ తెల్లబోయేలా చేస్తోంది. అసలు ఇది నిజమా కాదా అని కూడా కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు (Viral).
Viral: భర్తకు జాబ్ పోయిందని విడాకులిచ్చి.. 4 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువతి భుజాన పర్సు తగిలించుకుని రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా ఓ కుర్రాడు ఆమె పర్సును లాక్కెళ్లే ప్రయత్నం చేస్తాడు. అతడు బ్యాగు లాక్కుని పారిపోతుండగా ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. అతడిని ఆప లేక చివరకు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని కన్నీరుమున్నీరయ్యింది. ఇది చూడగానే దొంగ కూడా కరిగిపోయాడు. మెల్లగా ఆమె వద్దకు వచ్చి పర్సును తిరిగిచ్చేశాడు. పర్సు తీసుకున్నాక యువతి ఊహించని విధంగా యువకుడి కళ్లల్లోకి తెరిపారా చూసింది. ఆ మరుక్షణమే అతడిని దగ్గరకు తీసుకుని చుంబించింది. దీంతో, తొలుత ఆశ్చర్యపోయిన యువకుడు ఆ తరువాత తేరుకుని ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. వీధి పక్కనే ఉన్న గోడకు అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.
Viral: పెళ్లికి 14 రోజులుందనగా బాయ్‌ఫ్రెండ్ సీక్రెట్ గురించి తెలిసి..
ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి విన్నాం కానీ మరీ ఇలాంటి వింత ఘటనలు జరుగుతాయని అస్సలు ఊహించలేదని కొందరు కామెంట్ చేశారు. పర్సు దొంగిలించడానికి వచ్చి చివరకు ఆమె హృదయాన్ని దొంగిలించాడంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేశారు. కొందరు మాత్రం వీడియోపై రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. అసలు ఇదంతా నిజమేనా లేక వ్యూస్ కోసం ఫేక్ వీడియోను జనాల మీదకు వదిలారా అని ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. విపరీతంగా కామెంట్స్, వ్యూస్ వచ్చిపడుతున్నాయి. మరి ఈ అసాధారణ ప్రేమపై మీరూ ఓ లుక్కేయండి.
Updated Date - Nov 09 , 2024 | 04:18 PM