గో... గో... ‘గోట్’ యోగ
ABN, Publish Date - Dec 22 , 2024 | 09:52 AM
వీల్ యోగా, చైర్ యోగా, కపుల్ యోగా... కాలాన్ని బట్టి అనేక స్టయిల్స్‌ను తనలో కలిపేసుకుంటున్న యోగా ఇప్పుడు కాస్త వినోదాన్ని మిళితం చేసుకుంది. అదే ‘గోట్ యోగా’. అంటే సాధారణ యోగాలోకి మేకలు దూరాయన్నమాట. ఈ యోగా వల్ల మానసిక ప్రశాంతతకు, జంతుప్రేమ అదనం అంటున్నారు యోగా నిపుణులు.
వీల్ యోగా, చైర్ యోగా, కపుల్ యోగా... కాలాన్ని బట్టి అనేక స్టయిల్స్‌ను తనలో కలిపేసుకుంటున్న యోగా ఇప్పుడు కాస్త వినోదాన్ని మిళితం చేసుకుంది. అదే ‘గోట్ యోగా’. అంటే సాధారణ యోగాలోకి మేకలు దూరాయన్నమాట. ఈ యోగా వల్ల మానసిక ప్రశాంతతకు, జంతుప్రేమ అదనం అంటున్నారు యోగా నిపుణులు.
ప్రకృతి, జంతువులు, పిల్లలతో గడిపితే తెలియకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసికంగా బలోపేతమవు తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా యోగా పాపులర్ అయ్యింది. అయితే ఈ సాంప్రదాయ, పురాతన యోగా ప్రక్రియలో కాలానికి తగ్గట్టుగా కొన్ని మార్పులుచేర్పులు జరుగుతూ వస్తున్నాయి. అదనపు ఆకర్షణలు తోడవుతున్నాయి. అందులో ‘గోట్ యోగ’ ఒకటి.
ఏమిటీ యోగా?
అమెరికా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ దేశాల్లో ‘గోట్ యోగా’ను ఎక్కువగా ఫాలో అవుతారు. ‘అరగంట యోగా కోసం మ్యాట్‌తో పాటు రండి... మా ఫామ్‌లో ఎంచక్కా మేకలతో రెడీగా ఉంటాం’ అంటారు అక్కడి యోగాగురూలు. తోటల్లో, విశాలమైన గది, పార్కుల్లో ఈ యోగా చేస్తారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో గుంపుగా వస్తారు. యోగా ప్రారంభించిన వెంటనే మేకలను వదులుతారు. మేకలు వీరి మధ్య తిరుగుతూ ఉంటాయి. పదిహేను నిమిషాల పాటు మేకను వీపు మీద నిలబెడతారు. మేకను బ్యాలెన్స్ చేస్తూ యోగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి, ప్రశాంతత చేకూరుతుంది. అందుకే ఈ యోగాకు విదేశాల్లో విపరీతమైన పాపులారిటీ వచ్చింది.
ఆమె ఆలోచనకు కార్యరూపం...
అమెరికాలోని లీనా మోర్స్ ఒక యోగా ట్రైనర్. ప్రతి రోజూ యోగా చేస్తూ,ఇతరులకూ నేర్పించేది. ఒకసారి తన ఫామ్‌హౌస్‌లోయోగా చేస్తుంటే, ఆమె యోగా మ్యాట్ మీదకు ఫామ్ లోని మేకలు వచ్చాయి. పెంపుడు మేకలు కాబట్టి వాటిని చూస్తూ యోగా చేస్తోంది. ఇంతలో ఒక మేకపిల్ల వచ్చి ఆమె వీపు మీద కూర్చుంది. సంతోషంగా ఫీలయ్యింది. ఇదేదో బావుందే అనుకుంది. అలా 2016 సంవత్సరం లోనే ‘గోట్ యోగా’ కాన్సెప్టునకు ఆమె శ్రీకారం చుట్టింది. అసలే యోగా గురు... ఇకనుంచి యోగా పాఠాలు మేకల మధ్యనే చెబుతానంది. అలా... అలా... మౌత్‌టాక్‌తో పాటు సోషల్ మీడియాలో ‘గోట్ యోగా’ పాపులరైంది. అమెరికాతో పాటు నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ర్టేలియా దేశాల్లో కూడా చాలామంది ఆమెను ఫాలో అయ్యారు. అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, శాంటారోసా వంటి నగరాల్లో యోగా కేంద్రాలను ప్రారంభించింది లీనా. సోషల్ మీడియాలో ఈ వీడియోలు పాపులర్ కావడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘గోట్ యోగా’ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన దూరం...
- ఈ యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు, శారీరకంగా కూడా మేలు జరుగు తోందని కొన్ని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది.
- జంతువులతో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన దూరం అవుతుంది.
- ‘డౌన్‌వర్డ్ గోట్’ వ్యవస్థాపకుడు, యోగా గురువు కొరిన్నే హార్పర్ జాన్సన్ పరిశీలన మేరకు ‘మేకలను చూసి చాలా నేర్చుకోవచ్చు. అవి ఒంటరిగా ఉన్నప్పుడు, మందతో కలిసి ఉన్నప్పుడు ఎలా వుంటాయో పరిశీలిస్తే... జీవితంలో ఒడు దొడుకులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో, ఎదుటివారితో ప్రేమగా ఎలా ఉండాలో అర్థమవుతుంది’.
లీనాను పలు దేశాల్లో స్ఫూర్తిగా తీసుకుని ఈ తరహా తరగతులు నిర్వహిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లలో ఈ యోగా పాపులర్ అవుతోంది. మేకల మందతో యోగా చేయడం వల్ల యువతరానికి వినోదంతో పాటు ఆరోగ్యం లభిస్తోంది. ప్రీ రికార్డెడ్, లైవ్ స్ర్టీమింగ్స్ వీడియోలను చూసి కొందరు యోగా క్లాసులు నేర్చుకుంటున్నారు. కొందరు యోగా గురూలు జూమ్, ఫేస్‌బుక్ లైవ్‌లో కూడా పాఠాలు చెబుతున్నారు. ఏదేమైనా ‘గోట్ యోగా’ను ఓ ఫన్ ట్రెండ్‌గా చెప్పొచ్చు.
Updated Date - Dec 22 , 2024 | 09:52 AM