రసాయనాల నుంచి రక్షణ ఎలా?
ABN, Publish Date - Nov 03 , 2024 | 08:52 AM
అధిక దిగుబడుల కోసం పంటలు పండించేప్పుడు రసాయనాలు, పురుగుమందుల వాడకం అధికమైంది. అవి లేని ఆహారం దొరకడం కష్టంగా ఉంటోంది. అటువంటప్పుడు రసాయనాలు, పురుగుమందుల వలన ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అధిక దిగుబడుల కోసం పంటలు పండించేప్పుడు రసాయనాలు, పురుగుమందుల వాడకం అధికమైంది. అవి లేని ఆహారం దొరకడం కష్టంగా ఉంటోంది. అటువంటప్పుడు రసాయనాలు, పురుగుమందుల వలన ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎం. జనార్దన్‌రెడ్డి, వరంగల్
ఆహారంలో ఉండే వివిధ రకాల పురుగుమందులు, రసాయనాల అవశేషాలను తొలగిం చేందుకు, తినే ఆహారంలో వాటి మోతాదులను తగ్గించి ఆరోగ్యానికి హాని జరగని స్థాయికి తీసుకొచ్చేనందుకు పలు మార్గాలున్నాయి. ధాన్యాలు, పప్పుధాన్యాల వంటివి వండే ముందు కొద్దిసేపు నానబెట్టడం, శుభ్రంగా ఒకటికి రెండుసార్లు మంచినీటిలో కడగడం ద్వారా చాలా వరకు ఈ రసాయనాలను నిర్మూలించవచ్చు. వాటిని వండేటప్పుడు ఆ వేడికి కూడా రసా యనాలు, పురుగుమందుల అవశేషాలు తగ్గిపోతాయి.
కూరగాయలు, పండ్ల విషయానికొస్తే కొద్దిసేపు ఉప్పు నీళ్లలో లేదా వెనిగర్ వేసిన నీళ్లలో నానబెట్టడం, పై చెక్కు తీసి వండటం ద్వారా రసాయన అవశేషాల మోతాదును బాగా తగ్గించవచ్చు. ఆకుకూరలను ఉప్పు నీటిలో నానబెట్టడం, తిరిగి మంచినీటిలో రెండు మూడుసార్లు కడగడం కూడా మంచిది. అవకాశాన్ని బట్టి కనీసం కొన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలనైనా ఇంటి వద్ద కుండీల్లో పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చు. సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎంచుకోవడం కూడా మంచిపనే.
నాకు ప్రీ-డయాబెటీస్ ఉందని తెలిసిన తరువాత ఆరునెలల పాటు జాగ్రత్తలతో పాటు వ్యాయామం కూడా మొదలుపెట్టి కొంతవరకు రక్తంలో గ్లూకోజు పరిమాణం తగ్గించుకోగలిగాను. దీనిని ఇంకొంత తగ్గించుకుంటే ప్రీ-డయాబెటిస్ నుండి బయటపడొచ్చు. కానీ ఈ విధంగా ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన బరువు చాలా తగ్గిపోయాను. కొంత బరువు పెరుగుదామని అనుకుంటున్నా. గ్లూకోజు నియంత్రణలో ఉంచుకుంటూనే బరువు ఎలా పెరగొచ్చు?
- షేక్ ఇంతియాజ్, హైదరాబాద్
బరువు పెరిగేందుకు శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆహారంలో ఉండే పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేట్స్), మాంసకృత్తులు (ప్రొటీన్స్), కొవ్వు పదార్ధాలు (ఫ్యాట్స్) ఈ మూడింటి నుంచి మనకు శక్తి లభిస్తుంది. డయాబెటీస్ లేదా ప్రీ-డయాబెటీస్ ఉన్నవారు పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో గ్లూకోజు నియంత్రణ కష్టం కావొచ్చు. పిండిపదార్ధాల్లో కూడా పీచు ఎక్కువగా ఉండే ముడిధాన్యాలు, వాటి ఉత్పత్తులు, పండ్లు పరిమిత మోతాదుల్లో తీసుకుంటే మంచిదే. గ్లూకోజు నియంత్రణలో ఉంచుకొంటూనే బరువు పెరగాలంటే శరీరానికి తగినన్ని మాంసకృత్తులు ఇవ్వడం అవసరం.
మాంసకృత్తుల కొరకు గుడ్లు, చికెన్, చేప, పాలు, పెరుగు, పనీర్, అన్ని రకాల పప్పు ధాన్యాలు తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను అందించే వేరుశెనగ గింజలు, బాదాం, జీడిపప్పు, ఆక్రోట్, పిస్తా, ప్రొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు మొదలైనవి కూడా బరువు పెరిగేందుకు అవసరమైన శక్తిని అందిస్తూనే రక్తంలో గ్లూకోజును నియంత్రిస్తాయి. పప్పుధాన్యాలు, గింజల్లో పీచు పదార్ధాలు కూడా గ్లూకోజు నియంత్రణకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రీ-డయాబెటీస్‌ను తగ్గించేందుకు ఇవి మంచి ఆహారం. తగినంత శక్తినిచ్చే ఆహారం తీసుకోవడంతో పాటు తీసుకున్న ఆహారం సరిగా వంటబట్టి ఉపయోగపడేందుకు వ్యాయామం, శారీరక శ్రమ కూడా ముఖ్యమే.
నా వయసు 60 ఏళ్ళు. నరాల బలహీనత ఉంది. ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
- శ్రీనివాస్‌రెడ్డి, విజయవాడ
దీర్ఘకాలికంగా తలనొప్పి ఉండడం, కండరాలు బలం కోల్పోవడం, కొంతమేరకు స్పర్శ కోల్పోవడం, దృష్టి మార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం, సమన్వయం తగ్గడం, కండరాల పటుత్వం తగ్గడం మొదలైనవన్నీ నరాల బలహీనత లక్షణాలు. మెదడు, నరాల ఆరోగ్యం కోసం ఆహారంలో కొన్ని పోషకాలు తప్పనిసరి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్ గింజలు ప్రతిరోజూ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫీనాల్స్ అనే పదార్థాలుండే ముదురు రంగుల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు నరాల ఆరోగ్యానికి మంచిది.
రోజూ 150-200 గ్రాముల పండ్లు, 200 గ్రాముల కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. పసుపులో కర్క్యుమిన్, గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ కూడా నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, వేపుళ్ళు, నూనెలో వేయించిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్, చక్కెర, స్వీట్లు, తీపి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ నరాల ఆరోగ్యానికి హానికరం. ఆహార జాగ్రత్తలతో పాటు ఎంతో కొంత వ్యాయామం చేయడం వలన కూడా నరాల బలహీనత తగ్గి ఓపిక చేకూరుతుంది. ఒత్తిడి తగ్గించుకొని, మానసిక ఆందోళనలకు దూరంగా ఉండడం, తగినంత నిద్ర పోవడం కూడా ముఖ్యమే.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
Updated Date - Nov 03 , 2024 | 08:52 AM