Viral: అసలైన జాతి రత్నం అంటే ఈయనే.. భారతీయుడికి సెల్యూట్ కొట్టిన బ్రిటిషర్లు!
ABN, Publish Date - Jun 29 , 2024 | 05:38 PM
విదేశీయులకు ఆటోవాలాతో బేరం కుదుర్చిపెట్టిన ఓ పెద్దాయన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలైన జాతి రత్నం అంటే ఈయనే అంటూ జనాలే వేనోళ్ల పొగుడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్రావెల్ వ్లాగింగ్.. ఇప్పుడు నెట్టింట ఇదే ట్రెండ్. ఔత్సాహిక పర్యాటకులు వివిధ దేశాలు సందర్శిస్తూ అక్కడి విశేషాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఆయా ప్రదేశాలను సందర్శించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదురయ్యే సమస్యలు, పరిష్కారాల గురించి విపులంగా వివరిస్తుంటారు. తాజాగా భారత్‌ను సందర్శించిన ఇద్దరు బ్రిటిషర్లు ఇదే పని చేశారు. అయితే, పట్నా నగరాన్ని సందర్శించిన వారు అక్కడ పెద్దాయన చేసిన సాయాన్ని వివరిస్తూ నెట్టింట ఓ వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా (Viral)మారింది.
Viral: కడుపుతో ఉండి కూడా ఇదేంటి తల్లీ.. మహిళ పనికి షాక్‌లో నెటిజన్లు!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు బ్రిటిషర్లు ఓ ఆటో మాట్లాడుకునేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ మాత్రం దిమ్మతిరిగే చార్జీ వసూలు చేయబోయాడు. అయితే, అటుగా వెళుతున్న ఓ పెద్దాయన వారిని గమనించి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆటోవాలను రూ. 100 కే ఒప్పించి బేరం కుదిర్చాడు. బేరానికి మించి చెల్లించొద్దని బ్రిటిషర్లకు కూడా చెప్పాడు. విదేశీయులు మన అతిథులని, వారిని వేధించవద్దని ఆటోవాలాకు కూడా చెప్పి పంపించాడు ( Internet Lauds Elderly Bihar Man Who Negotiated Fare For British Vloggers ).
బ్రిటిషర్లు ఇదంతా వీడియోలో రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో ఘటన వైరల్‌గా మారింది. ఇలాంటి వాళ్లతోనే దేశ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అతిథి దేవో భవ అంటే ఇదేనంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. వీడియో జనాలకు విపరీతంగా నచ్చిందనేందుకు ఊదాహరణగా ఏకంగా 28 లక్షల వ్యూస్ వచ్చాయి. పెద్దాయన భారత గౌరవాన్ని రెట్టింపు చేశాడంటూ కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్‌గా మారింది.
Updated Date - Jun 29 , 2024 | 05:40 PM