Lemon: ఒక్క నిమ్మకాయ ధర రూ.35 వేలు.. షాక్‌లో ప్రజలు
ABN , Publish Date - Mar 10 , 2024 | 06:03 PM
అవునండీ.. మీరు విన్నది నిజమే. ఒక్క నిమ్మకాయ అక్షరాల రూ.35 వేలు పలికింది. వేసవి కాలం కావడంతో నిమ్మకాయల ధరలు పెరుగుతాయని తెలుసు. పదో పాతికో పెరుగుతాయి కానీ.. వేలల్లో పెరగడమేంటి అనుకుంటున్నారా. నిజానికి ఆ ధర నిమ్మకాయది కాదు. నిమ్మకాయ వేలం వేస్తే పలికిన ధర.
చెన్నై: అవునండీ.. మీరు విన్నది నిజమే. ఒక్క నిమ్మకాయ అక్షరాల రూ.35 వేలు పలికింది. వేసవి కాలం కావడంతో నిమ్మకాయల ధరలు పెరుగుతాయని తెలుసు. పదో పాతికో పెరుగుతాయి కానీ.. వేలల్లో పెరగడమేంటి అనుకుంటున్నారా. నిజానికి ఆ ధర నిమ్మకాయది(Lemon) కాదు. నిమ్మకాయ వేలం వేస్తే పలికిన ధర. ఇరోడ్ జిల్లా శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో ఈ వేలం జరిగింది.
మహా శివరాత్రి సందర్భంగా స్వామి వారికి నిమ్మకాయలు, పండ్లతో రెండ్రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు జరిపారు. అనంతరం ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం.. పూజలందుకున్న పదార్థాలను వేలం వేశారు. వేలంలో 15 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇరోడ్‌కి చెందిన ఓ భక్తుడు నిమ్మకాయను వేలంపాటలో రూ.35 వేలకు దక్కించుకున్నాడు.
వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పీఠాధిపతి ముందు ఉంచి పూజ నిర్వహించి నిమ్మకాయను దక్కించుకున్న భక్తుడికి అందజేశారు. ఒక్క నిమ్మకాయ రూ.35 వేలకు తీసుకోవడం ఏంటీ అని ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. దేవుడి పూజలు అందుకున్న పదార్థాలను దక్కించుకున్నవారు ధనవంతులు అవుతారని, ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి భక్తుల నమ్మకం.