Viral News: దురదృష్టం అంటే నీదే బాసూ..రూ. 60 కొట్టేసినందుకు.. 27 ఏళ్ల తర్వాత అరెస్టు
ABN, Publish Date - Nov 12 , 2024 | 07:29 PM
27 ఏళ్ల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. అతడి ఇంటిపై కొంతకాలం నిఘా పెట్టిన పోలీసులు వలపన్ని మరీ అరెస్టు చేశారు. ఇంతకీ ఆ దొంగ చోరీ చేసిన మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది.
మధురై: తెలిసీ తెలియక చేసిన చిల్లర దొంగతనం ఓ వ్యక్తిని దాదాపు మూడు దశాబ్దాల పాటు వెంటాడింది. ఎట్టకేలకు 27 ఏళ్ల తర్వాత అతడిని పోలీసులకు చిక్కేలా చేసింది. వినడానికే వింతగా అనిపిస్తున్న ఈ ఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. శివకాశికి చెందిన 55 ఏళ్ల వ్యక్తిని మధురై జిల్లా పోలీసులు 27 ఏళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. 1997లో తెప్పకులం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ జరిగింది అందులో రూ.60 చోరీకి గురైంది. దీనిపై నమోదైన కేసు అలాగే ఉంది. ఇటీవల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ముగించేందుకు అసిస్టెంట్ కమిషనర్ సూరకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న నిందితులపై ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టర్లు సంతానపాండియన్, పన్నీర్‌సెల్వన్ నేతృత్వంలో బృందం దృష్టి సారించింది. ఈ కేసుల్లో ఒకటి తెప్పకులం పోలీస్ స్టేషన్‌లో జరిగిన దోపిడీ. 27 ఏళ్ల కిందట నిందితుడు పన్నీర్ సెల్వం బాధితుడి నుండి రూ.60 దోచుకుని పరారయ్యాడు.
దర్యాప్తు జరిపిన అధికారులు పన్నీర్ సెల్వం శివకాశికి వెళ్లినట్లు గుర్తించారు. పెళ్లి చేసుకుని తన కుటుంబంతో జీవితం గడుపుతున్న అతడిని జనాభా సర్వేయర్ల ముసుగులో వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. నేరస్తుడు అతనే అని నిర్ధారణ చేసుకున్న వెంటనే అతడిని అరెస్టు చేశారు.
Viral Video: ప్రేమంటే ఇదేరా.. భార్య మేడపై నుంచి పడిపోవడం చూసి.. ఈ భర్త చేసిన పని..
Updated Date - Nov 12 , 2024 | 07:30 PM