Viral News: నువ్వసలు భార్యవేనా.. భర్త నల్లగా ఉన్నాడని..
ABN, Publish Date - Jul 11 , 2024 | 08:35 PM
‘మనసు మంచిదైతే చాలు కలర్ ఏముందిలే’ అనే డైలాగ్ సినిమాల్లో బాగానే అనిపిస్తుంది కానీ.. రియాలిటీలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అందరూ కాదు కానీ..
‘మనసు మంచిదైతే చాలు కలర్ ఏముందిలే’ అనే డైలాగ్ సినిమాల్లో బాగానే అనిపిస్తుంది కానీ.. రియాలిటీలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అందరూ కాదు కానీ.. కొందరు మాత్రం రంగు విషయంలో వివక్షత చూపిస్తారు. ముఖ్యంగా.. నల్లగా ఉన్నవారే ఇలాంటి రేసిజంను ఎదుర్కుంటారు. ఈ రంగు వల్ల కొన్ని కాపురాలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. తన భర్త నల్లగా ఉన్నాడన్న ఉద్దేశంతో.. ఓ మహిళ అతనిని వదిలించుకోవాలని చూస్తోంది. ఓ కుమార్తె పుట్టిన తర్వాత ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది కూడా! ఆ వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన 24 ఏళ్ల వ్యక్తికి 14 నెలల క్రితం ఓ మహిళతో వివాహం అయ్యింది. పెళ్లైన కొత్తలో అంతా బాగానే నడిచింది కానీ, ఆ తర్వాతి నుంచే భార్య అతనిని ఇబ్బందులకు గురిచేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా.. నల్లగా ఉన్నావంటూ హేళన చేస్తూ వచ్చింది. తన భార్యే కదా అని.. అతను ఏనాడూ ఆమె కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. లోలోపలే బాధను దిగమింగుతూ.. పైపెచ్చు నవ్వుతూ ఉండేవాడు. కానీ.. రోజులు గడిచేకొద్ది ఆమె టార్చర్ మరింత ఎక్కువైంది. ‘అసలు నీలాంటి నల్లోడిని ఎలా పెళ్లి చేసుకున్నానంటూ’ సూటిపోటి మాటలతో బాధపెట్టేది. చివరికి ఆమె ఓ చిన్నారికి జన్మనిచ్చిన 10 రోజుల తర్వాత.. ఇంట్లోనే పాపని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఆమెను తిరిగి తీసుకురావడానికి అత్తారింటికి వెళ్లగా.. అక్కడ కూడా రంగు అంశాన్ని లేవనెత్తింది. ‘నువ్వు నల్లగా ఉన్నావు, నీతో కాపురానికి రాను’ అంటూ ముఖం మీదే అరిచేసింది. అంతేకాదు.. భర్తను వదిలించుకోవడం కోసం అతనిపై తప్పుడు కేసు కూడా పెట్టింది. తనని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. ఆ భర్త పోలీసుల వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తన పట్ల భార్య వ్యవహరిస్తున్న తీరుని వారికి వివరించాడు. దాంతో.. కౌన్సిలింగ్ కోసం పోలీసులు వాళ్లిద్దరిని పిలిపించారు. మరి.. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jul 11 , 2024 | 08:35 PM