Shocking: ఆ డబ్బులతో విమానంలో వెళ్లొచ్చు.. బెంగళూరు ఉబర్ క్యాబ్ రేటు చూసి షాకైన ప్రయాణికుడు..
ABN , Publish Date - Mar 02 , 2024 | 03:53 PM
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తాజాగా ఉబర్ క్యాబ్‌ను బుక్ చేయాలనుకున్నాడు. అయితే దాని ధర చూసి కళ్లు తేలేశాడు. ఆ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీద ఆధారపడితే మన గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. దీంతో చాలా మంది ఉబర్ (Uber), ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. ధర కాస్త ఎక్కువైనా క్యాబ్‌ల వైపే మొగ్గు చూపుతుంటారు. బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ వ్యక్తి తాజాగా ఉబర్ క్యాబ్‌ను బుక్ చేయాలనుకున్నాడు. అయితే దాని ధర (Uber Cab Charge) చూసి కళ్లు తేలేశాడు. ఆ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్న రాజేశ్ భట్టాడ్ అనే ఓ వ్యక్తి నగరంలోని తన ఇంటికి వెళ్లడానికి ఉబర్ క్యాబ్ ఎక్కాలనుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తక్కువ దూరానికి కూడా ఉబర్ క్యాబ్ విధిస్తున్న చార్జీలు చూసి షాక్ అయ్యాడు. ఎయిర్‌పోర్టు నుంచి హెచ్ఎస్ఆర్‌కు రూ.1,931 బిల్లు అవుతుందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంత ధర చెల్లించలేక బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఎక్కి అందులో పదో వంతు ఛార్జ్ చెల్లించి ఇంటికి వెళ్లిపోయాడు.
తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఆ ఛార్జ్‌తో బెంగళూరు నుంచి చెన్నై వెళ్లిపోవచ్చు``, ``ఎయిర్‌పోర్ట్ బయటకు వచ్చి బుక్ చేస్తే 30 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ తగ్గిపోతుంది``, ``ఇది చాలా దారుణం``, ``యాప్ ద్వారా బుక్ చేస్తే ఛార్జ్‌లు చాలా దారుణంగా ఉంటున్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.