Viral: ఎయిర్‌పోర్టులో ఎవరూ ఊహించని సౌకర్యం! పెదవి విరుస్తున్న ప్రయాణికులు!
ABN, Publish Date - Jun 09 , 2024 | 04:58 PM
విమానాలు ఆలస్యమైనప్పుడు ప్రయాణికులు చిన్న చిన్న కునుకులు తీసేందుకు బాకు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన రెస్టా పాడ్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌పోర్టులో విమానం కోసం గంటలకు గంటలు ఎదురు చూస్తున్నప్పుడు నడుం వాల్చేందుకు ఏదైనా స్థలం ఉంటే బాగుండని అనిపిస్తుంది. అయితే, ఎయిర్ పోర్టుల్లో అలాంటి సౌకర్యాలేవీ ఉండవు కాబట్టి, అనేక మంది కూర్చీల్లోనే ఆపసోపాలు పడిపోతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా అజర్‌బైజాన్‌లోని బాకూలో ఉన్న ఓ ఎయిర్ పోర్టు.. రెస్ట్ పాడ్ పేరిట ఓ వినూత్న ఏర్పాటుతో ముందుకు వచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా కొందరు మాత్రం ఇది సరైంది కాదని కుండబద్దలు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
Viral: అకస్మాత్తుగా భార్య అదృశ్యం! అడవిలోకి వెళ్లి వెతికితే..
బాకూలోని హైదర్ అలియేవ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రెస్ట్ పాడ్‌ను ఏర్పాటు చేశారు. ఇది సింగిల్ కాట్ మంచం కంటే కాస్త వెడల్పు తక్కువగా, ఓ మనిషి మాత్రమే పట్టేందుకు వీలుగా ఉంటుంది. ఇందులో లగేజీ పెట్టుకునేందుకు కూడా స్థలం ఉంటుంది. పాడ్‌లో పడుకున్నాక దానిపై ఉండే షీల్డ్ మూసేసుకుని చిన్న కునుకు తీసేయొచ్చు. గాలి, వెలుతురు వచ్చేలా షీల్డ్‌కు చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి (Man Shows Newly Launched Rest Pods At Baku Airport).
వీడియోలో ఇదంతా చూసిన పలువురు నెటిజన్లు రెస్ట్ పాడ్ ఐడియా బాగుందని అన్నారు. ఎయిర్‌పోర్టుల్లో ఎక్కువ సేపు ఎదురు చూడాల్సిన వచ్చినప్పుడు ఇందులో చక్కగా ఓ కునుకు తీయొచ్చని అంటున్నారు. కొందరు మాత్రం ఈ ఆలోచనపై పెదవి విరిచారు. ఒకే పాడ్‌ను వెంట వెంటనే పలువురు వినియోగిస్తే సూక్ష్మక్రియులు పేరుకుని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కొందరు మాత్రం ఇదంతా రంధ్రాన్వేషణగా కొట్టిపారేశారు. ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చే వినూత్న ఏర్పాట్లను ప్రోత్సహించాలని చెప్పారు. ఇలా రకరకాల అభిప్రాయాల మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - Jun 09 , 2024 | 05:12 PM