Viral Video: మూడు నెలల క్రితం తప్పిపోయిన యువతి.. తీరా చూస్తే పాములాగా..
ABN, Publish Date - Jul 31 , 2024 | 03:32 PM
అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించడాన్ని మనం చూస్తూనే ఉంటాం. తమను ఏదో శక్తి ఆవహించిందంటూ.. విచిత్రమైన శబ్దాలు తీస్తూ భయాందోళనలకు గురి చేస్తుంటారు. ఇప్పుడు ఓ యువతి సైతం..
అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తించడాన్ని మనం చూస్తూనే ఉంటాం. తమను ఏదో శక్తి ఆవహించిందంటూ.. విచిత్రమైన శబ్దాలు తీస్తూ భయాందోళనలకు గురి చేస్తుంటారు. ఇప్పుడు ఓ యువతి సైతం అలాగే వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల క్రితం తప్పిపోయిన ఆ యువతి.. తీరా పాములాగా కదలికలు చేస్తూ ఓ గుహలో కనిపించింది. అది చూసి ఖంగుతిన్న కుటుంబ సభ్యులు.. చివరికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటన జార్ఖండ్‌లో (Jharkhand) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మూడు నెలల క్రితం అదృశ్యం..
జార్ఖండ్‌లోని గిరిదిహ్‌కు సమీపంలో ఉన్న కరివాడిహ్ ఖరోండి గ్రామానికి చెందిన ఓ యువతి మూడు నెలల క్రితం కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. పోలీసులు సైతం మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అయినా ఏదో ఒక రోజు తమ కుమార్తె దొరుకుతుందన్న ధీమా.. తల్లిదండ్రులు ఆమెను వెతకడం ఆపలేదు. కట్ చేస్తే.. సోమవారం నాడు రాణిదిహ్ గుప్తా ధామ్ గుహలో ఓ యువతి పాములా ప్రవర్తిస్తూ జనాలకు కనిపించింది. ఎలాగైతే పాము నేలపై పాకుతూ తన నాలుక బయటకు తీస్తుందో.. అలాగే ఈ యువతి కూడా ప్రవర్తించడం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. వెంటనే ఆ గుహ వద్దకు చేరుకున్నారు.
సంగీత వాయిద్యాలతో ఇంటికి..
తమ అమ్మాయిని ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. తొలుత కంగారుపడిన వాళ్లు.. ఆపై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ కుమార్తెను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు.. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. చివరికి సంగీత వాయిద్యాలతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తమ కుమార్తె స్థితి బాగానే ఉందని వాళ్లు పేర్కొంటున్నారు. మరోవైపు.. ఈ ఘటన స్థానికి తీవ్ర దుమారం రేపింది. ఆ యువతి గురించి స్థానిక ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయికి ఏవో దుష్టశక్తులు ఆవహించి ఉంటాయని కొందరు అంటుంటే.. మరికొందరేమో అది ఏదో ఒక వ్యాధి అయ్యుండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదేమైనప్పటికీ.. ఆ యువతి వ్యవహారం మాత్రం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాణిదిహ్ గుప్తా ధామ్ గుహ ఏంటి?
స్థానిక ప్రజల సమాచారం ప్రకారం.. రాణిదిహ్ గుప్తా ధామ్ గుహలో పురాతన శివాలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అక్కడి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు. సోమవారం కూడా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు భక్తులు అక్కడికి వెళ్లగా.. ఆ యువతి కనిపించింది. తమ కుమార్తె కోసం తాము మూడు నెలలుగా రేయింబవళ్లు వెతికామని, ఎంత గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చివరికి ఆ గుహలో ఉన్న సంగతి తెలిసి.. ఇంటికి తీసుకెళ్లామన్నారు.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jul 31 , 2024 | 03:32 PM