గోలీ సోడా కాదు... ‘డర్టీ సోడా’
ABN, Publish Date - Dec 22 , 2024 | 06:34 AM
అమెరికన్ గాయని, పాటల రచయిత ఒలివియా రోడ్రిగో ద్వారా ‘డర్టీ సోడా’ బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె డర్టీ సోడాను చేతిలో పట్టుకొని దిగిన ఒక స్టైలిష్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. అందరూ దీని గురించి గూగుల్‌లో వెతకడం మొదలెట్టారు.
‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అని ఊరికే అనలేదు. ఏదైనా సాఫ్ట్ డ్రింక్‌లో కాస్త సిరప్, క్రీమ్, స్వీటెనర్లు కలిపి తాగితే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా... టేస్ట్ మాత్రం అదుర్స్ అంటోంది నేటితరం. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పానీయమే...
ఈ ‘డర్టీ సోడా’. కుర్రకారుకి హాట్ ఫేవరెట్‌గా మారిన క్రేజీ కూల్ సోడా విశేషాలే ఇవి...
అమెరికన్ గాయని, పాటల రచయిత ఒలివియా రోడ్రిగో ద్వారా ‘డర్టీ సోడా’ బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె డర్టీ సోడాను చేతిలో పట్టుకొని దిగిన ఒక స్టైలిష్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. అందరూ దీని గురించి గూగుల్‌లో వెతకడం మొదలెట్టారు. ఇటీవలె ‘ది సీక్రెట్ లైవ్స్ ఆఫ్ మోర్మన్ వైవ్స్’ అనే రియాలిటీ షో ద్వారా దీనికి మరింత ఆదరణ పెరిగింది. దీంతో నెటిజన్లు విభిన్న కాంబినేషన్‌లలో ప్రయోగాలు చేస్తూ సోషల్‌మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
- వాస్తవానికి వీటి ఉనికి 2010 నుంచే ఉంది. అమెరికాలోని ఉటాలో ‘మోర్మన్’ జనాభా ఎక్కువ. ఈ జాతికి చెందినవారు ఎలాంటి ఆల్కహాల్, కాఫీ, టీ గానీ తాగరు. కాబట్టి వాటికి ప్రత్యమ్నాయంగా వాళ్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిందే ఇది. పాప్ గాయని ఒలివియా ద్వారా ఈ ఓల్డ్ డ్రింక్ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది.
- ‘డర్టీ సోడా’ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే... ఒక గ్లాసులో కొన్ని ఐస్ ముక్కలు వేసి, సాఫ్ట్ డ్రింక్‌ని యాడ్ చేయాలి. తర్వాత నచ్చిన ఫ్లేవర్ సిరప్‌ని కొంచెం, క్రీమర్‌ని కొంచెం జోడించి, టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలిపితే అదే ‘డర్టీ సోడా’. రుచిపరంగా కాస్త భిన్నంగా ఉంటుంది కాబట్టి నచ్చడానికి సమయం పడుతుంది.
- క్లాసిక్ సోడాను తయారు చేసుకోవాలంటే.. కోక్ లేదా డైట్ కోక్‌ని ఉపయోగించొచ్చు. అదే ఒరిజినల్ డర్టీ సోడా ఫ్లేవర్ కావాలనుకుంటే మాత్రం.. కోకోనట్ సిరప్, నిమ్మరసం జోడించాలి. స్ట్రాబెర్రీ, పైనాపిల్, రాస్‌బెర్రీ సిరప్‌లను కూడా వాడొచ్చు.
- క్రీమ్, ఫ్లేవర్డ్ సిరప్‌లను యాడ్ చేయడం వల్ల.. సాధారణ సోడా కన్నా ఈ డర్టీ సోడాలో చక్కెర, క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి తరచుగా తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
- నెటిజన్ల నుంచి అమాంతం డిమాండ్ పెరగడంతో ఈ సోడా దుకాణాలు మార్కెట్లో కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. వీటి ధర సుమారు రూ. 250 నుంచి రూ. 450 మధ్య ఉంటుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫిజీ కాక్‌టెయిల్‌గా పరిగణిస్తున్నారు విదేశీయులు.
- చక్కెర మోతాదు ఎక్కువ అవుతుందను కుంటే.. రుచిగల సిరప్‌లు, స్వీటెనర్‌లకు బదులుగా తాజా పండ్ల రసాలు, షుగర్ ఫ్రీ క్రీములను ఉపయోగించొచ్చు.
- లెక్కలేనన్ని విభిన్న ఫ్లేవర్ సిరప్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కోకొనట్, వెనీలా, నారింజ, స్ట్రాబెర్రీ, చెర్రీ, పైనాపిల్, రాస్‌బెర్రీ వంటి వాటిని ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్నారట. కొంచెం భిన్నమైన రుచి కోసం.. బనానా, యాపిల్, పిస్తా వంటి ఫ్లేవర్ సిరప్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు.
- అత్యంత ప్రజాదరణ పొందిన డర్టీ సోడా కంపెనీ ‘స్విగ్’. దీన్ని నికోల్ టాన్నర్ అనే మహిళ 2010లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా బ్రాంచ్‌లు ఉన్నాయి. మరొకటి ‘సోడాలిసియస్’. ఇది 2013లో ప్రారంభమైంది.
- డర్టీసోడాలు కాస్త ఇటాలియన్ సోడాలను పోలి ఉంటాయి. కాకపోతే దీని తయారీలో అధిక క్రీమ్ లేదా క్రీమర్, ఫ్లేవర్డ్ సిరప్‌లు, సోడా ఉపయోగిస్తారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆన్‌లైన్‌లో వీటి గురించి వెతికేవారి సంఖ్య 200 శాతం పెరిగిందట.
కొన్ని పాపులర్ కాంబినేషన్లు...
- కోక్, కోకొనట్ క్రీమర్, లెమన్ జ్యూస్
- ఆరెంజ్ సోడా, వెనీలా క్రీమర్
- రూట్ బీర్, వెనీలా క్రీమర్
- పెప్సీ, చెర్రీ సిరప్, లెమన్ జ్యూస్
- రూట్ బీర్, బటర్‌స్కాచ్ సిరప్, వెనీలా క్రీమర్
Updated Date - Dec 22 , 2024 | 06:34 AM