Viral: ప్లాస్టిక్ వాడొద్దంటూ జొమాటోకు రిక్వెస్ట్! సంస్థ సీఈఓ ఏమన్నారంటే..
ABN, Publish Date - Jun 21 , 2024 | 09:11 PM
ప్లాస్టిక్ కంటెయినర్లు వాడొద్దంటూ ఓ కస్టమర్ చేసిన సూచనపై జొమాటో సీఈఓ స్పందించారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగి పర్యావరణానికి హాని కలిగిస్తోంది. జీవవైవిధ్యానికి ముప్పుగా మారడంతో పాటు మనుషుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కంటెయినర్ల వినియోగాన్ని తగ్గించాలంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీలను అభ్యర్థించాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతున్న ఈ పోస్టుపై ఏకంగా జొమాటో సీఈఓ కూడా స్పందించారు.
Viral: ఇలాంటోళ్లతో ఎప్పటికైనా రిస్కే! బాయ్‌ఫ్రెండ్ పొరపాటుతో తిక్కరేగి..
వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటెయినర్లలో పెట్టడం ఆరోగ్యానికి హానికరమని న్యూట్రిషనిస్టు లూక్ కోటిన్హో ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్లాస్టిక్ కంటెయినర్లలోని ఆహారం కారణంగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారని కూడా చెప్పాడు. ‘‘స్విగ్గీ, జొమాటో రెస్టారెంట్ యాజమాన్యాలకు.. పర్యావరణహిత ప్లాస్టిక్‌యేతర కంటెయినర్లలోనే ఫుడ్ డెలివరీ చేసేలా ఏజెంట్లతో కలిసి చర్యలు తీసుకోండి. ఇప్పటికే పలు రెస్టారెంట్లు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని కూడా డెలివరీ చేయండి. ప్లాస్టిక్ కంటెయినర్లలోని వేడి ఆహారం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి, తగిన మార్పును తీసుకొచ్చే శక్తి మీకే ఉంది’’ అంటూ పోస్టు పెట్టారు. జొమాటో, స్విగ్గీలను కూడా ట్యాగ్ చేశారు (Nutritionist urges Zomato Swiggy to avoid using plastic containers Deepinder Goyal reacts).
ఈ పోస్టుపై జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ వెంటనే స్పందించారు. ఈ సమస్యను ప్రముఖంగా ప్రస్తావించినందుకు లూక్‌కు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణహిత ప్లాస్టిక్‌యేతల కంటెయినర్లలో ఫుడ్ డెలివరీ చేసే రెస్టారెంట్‌లను కస్టమర్లు తమ యాప్‌లో ఈజీగా గుర్తించేందుకు వీలుగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, తన పోస్టుపై స్పందించినందుకు జొమాటో సీఈఓకు లూక్ కూడా ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Jun 21 , 2024 | 09:11 PM