Viral: పులితో ఇలాంటి పరాచకం ఎక్కడా చూసుండరు! ఇతడికి ఏదోక రోజు మూడటం పక్కా!
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:22 PM
ఓ పాకిస్థానీ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ పులితో పరాచకాలు ఆడున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పులి నోట్లో చేయి పెట్టి అతడు కెమెరాకు పోజులిచ్చాడు. దీనిపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యయుగాల్లో పులులు, సింహాలను వేటాడటం ఒక హోదా, పౌరుషానికి ప్రతీక. అయితే, తమ డాబుదర్పాలు ప్రదర్శించేందుకు ఇప్పటికీ కొందరు ఈ క్రూర మృగాలను పెంపుడు జంతువుల్లా ఇంట్లో కట్టేసుకుంటారు. సహజస్వభావానికి విరుద్ధంగా బోనులో బందీలుగా మారినందుకు అవి ఎంతటి ఒత్తిడి ఎదుర్కొంటాయో అర్థం చేసుకోరు. ఇది చాలదన్నట్టు వాటిలో వేటాడే స్వభావాన్ని రెచ్చగొట్టేలా పరాచకాలు ఆడుతుంటారు. ఇక సోషల్ మీడియా జమానాలో ఇలాంటి ధోరణి పెచ్చుమీరి పోయింది. వీడియోల కోసం క్రూర జంతువులను ఇబ్బంది పెట్టడం పెరిగిపోయింది. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జనాలకు విపరీతమైన ఆగ్రహం తెప్పిస్తోంది (Viral).
Viral: సోడా క్యాన్లు అన్నింటికీ ఒకే డిజైన్ ఎందుకుంటుందో తెలుసా?
తాజాగా పాకిస్థానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నూమాన్ హసన్ పులితో పరాచకాలు ఆడుతూ వీడియో రికార్డు చేసి నెట్టింట పోస్టు చేశారు. దాని నోట్లో చేయి పెట్టి మరీ కెమెరాకు పోజులిచ్చాడు. పులి అతడికి దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్నా నూమాన్ మాత్రం పదే పదే దాని నోట్లో చేయి పెట్టి ఇబ్బంది పెట్టాడు. అది తన పెంపుడు పులి అని, దానికి ఎప్పుడూ కోపం రాదంటూ ఇలాంటి సాహసం చేశాడు. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
ఇక జనాలు మాత్రం ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు. మూర్ఖత్వం పరాకాష్టకు చేరడం ఇదే అని తిట్టిపోస్తున్నారు. ఇతడికి ఏదో రోజు మూడుతుందని కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులి తూలుతూ నడుస్తున్నట్టు ఉందని, దానికి మత్తు మందు ఇచ్చి వీడియో రికార్డు చేసినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదేమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఆ జీవాన్ని అంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా అని నిలదీశారు. పులిని తాడుతో కట్టాక దాని ముందు నీ ధైర్యస్థైర్యాలను ప్రదర్శిస్తున్నావా అని కూడా మండిపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది.
Viral: వామ్మో.. కాకుల్లో ఇంతటి పగాప్రతీకారాలా? ఏకంగా 17 ఏళ్ల పాటు..
ఇక పులుల్ని ఇళ్లల్లో పెంచుకునేందుకు పాకిస్థాన్‌లో కొన్ని ప్రాంతాల్లో అనుమతిస్తారు. అయితే, ప్రాంతాలను బట్టి ఇందుకు సంబంధించిన చట్టాల్లో మార్పులు ఉంటాయి. అడవి జంతువులను దిగుమతి చేసుకోవడం చట్ట విరుద్ధం కానీ అడవి జంతువులను పెంచుకునేందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తాయి. అయితే, దేశరాజధాని ప్రాంతంలో మాత్రం దీనిపై నిషేధం ఉంది. పులులు, సింహాలను పెంచుకోవడాన్ని అక్కడి వారు తమ పరపతికి, పవర్‌కు ప్రతీకగా భావిస్తారు. కొందరు రాజకీయ నాయకులు తమ డాబుదర్పాలను ప్రదర్శించేందుకు పులులను పెంచుకుంటారు. అయితే, పెంపుడు పులుల విషయంలో తీసుకోవాల్సినన్ని జాగ్రత్తలు తీసుకోరని అక్కడి జంతుప్రేమికులు మండిపడుతుంటారు.
Updated Date - Nov 05 , 2024 | 03:43 PM