Viral: వామ్మో.. ఎవర్రా మీరంతా! రైల్లో బెర్త్ దొరకలేదని వీళ్లేం చేశారో చూస్తే..
ABN, Publish Date - Nov 04 , 2024 | 07:21 PM
రైల్లో బెర్తు దొరకని కొందరు ప్రయాణికులు పైబెర్తుల మధ్య తాళ్లతో తమకంటూ ఓ ప్రత్యేకమైన బెర్తు అల్లిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ తీరును కొందరు తప్పుబడుతుంటే మరికొందరు వారి తెలివికి జేజేలు పలుకుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లల్లో రద్దీ సర్వ సాధారణం. దీంతో, అనేక మంది టిక్కెట్లు దొరక్క పోయినా రైళ్లలో నిలబడి ప్రయాణాలు చేస్తుంటారు. బోగీల్లోని వాష్ బేసింలు, వాష్‌రూంల పక్కన, బోగీ ఎంట్రన్స్ వద్ద ఉన్న మెట్లపై కూడా కూర్చుని ప్రయాణించే వారున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో బీదసాదలు రిస్కీ ప్రయాణాలు చేస్తుంటారు. అయితే, కొందరు మాత్రం తమ ప్రాప్తకాలజ్ఞతను ప్రదర్శిస్తూ రైల్లోనే చిన్న చిన్న ఊయలలు కట్టుకుని ప్రయాణిస్తుంటారు. కానీ తాజా వైరల్ వీడియోలో ప్రయాణికులు ఓ అడుగుముందుకేసి మరీ ఓ వింత ఏర్పాటు చేసుకున్నారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది (Viral).
Viral: లాంగ్ జర్నీల్లో కారు ఎక్కగానే నిద్రలోకి జారుకుంటున్నారా? కారణం ఇదే!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు రెండు పైబెర్తుల మధ్య తాళ్లతో మరో బెర్తు అల్లుకున్నారు. హ్యాపీగా నిద్రపోయేందుకు వీలుగా వారు రెండు బెర్తులకు ఉన్న ఇనుపరాడ్ల సాయంతో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరి బరువు కూడా మోయగలిగేలా వారు దీన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ ఏర్పాటుతో ఇతర బెర్తుల్లోని వారికి ఇబ్బంది తప్పదు. కానీ వీళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాళ్లతో బెర్తులు అల్లారు.
వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఎవర్రా మీరంతా అంటూ నోరెళ్లబెడుతున్నారు. పక్కవారి ఇబ్బంది పట్టించుకోకుండా ఇలాంటి పనులు చేయడం తప్పని తిట్టిపోశారు. కొందరు మాత్రం వారి తెలివిని మెచ్చుకున్నారు. ఎలాంటి సమస్యలనైనా చిన్న చిన్న చిట్కాలతో పరిష్కరించుకోవడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.
Health: 2 నెలల్లో 7 కిలోలు తగ్గిన యువతి! ఒకే ఒక సింపుల్ ట్రిక్‌తో..
కాగా, గతంలో కూడా జనాలు ఇలాంటి అనేక చిట్కాలతో నెట్టింట హల్‌చల్ చేశారు. ఈ ఏడాది మే నెలలో రైలు ప్రయాణికుడు ఒకరు తన బిడ్డ కోసం రైల్లో ఏకంగా ఊయల ఏర్పాటు చేసుకున్నాడు. తన బిడ్డ హ్యాపీగా నిద్రపోవాలనే ఉద్దేశంతో అతడు బెడ్ షీట్‌తో రెండు బెర్తుల మధ్య ఊయల ఏర్పాటు చేశారు. ఏకంగా ఏసీ కోచ్‌లో అతడు ఇలాంటి పని చేయడం వైరల్‌గా మారింది. మైసూర్ స్పెషల్ ఫేర్ సమ్మర్ స్పెషల్ రైల్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఆర్ఏసీ లిస్టులో తన నెంబర్ పలుమార్లు మారడంపై ఓ ప్రయాణికుడు తాజాగా నెట్టింట అసహనం వ్యక్తం చేశాడు. సెప్టెంబర్ 30న బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్టులో అతడిది 124 అని ఉంది. ఆ తరువాత అది 31కి పడిపోయింది. ఇక నవంబర్ 2న 12కు చేరుకుంది. ఇక ఫైనల్ చార్ట్ తయారు చేసినప్పుడు మాత్రం వెయిటింగ్ నెంబర్ 18కి చేరుకుంది. ఇది చూసి తీవ్ర అసహనానికి గురైన అతడు అసలేం జరుగుతోందని నెట్టింట ఆకోశ్రం వెళ్లగక్కాడు. ఇదేమి రిజర్వేషన్ వ్యవస్థ అని ప్రశ్నించాడు.
Updated Date - Nov 04 , 2024 | 07:34 PM