ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘సేవింగ్‌ డాజీ’ ఒక పొదుపు విప్లవం..!

ABN, Publish Date - Oct 20 , 2024 | 07:15 AM

దోసిళ్లలో నీళ్లను బంధించడం ఎంత కష్టమో.. ఈ రోజుల్లో డబ్బును నిలబెట్టుకోవడం అంత కష్టం. అందుకే వచ్చినట్లే వచ్చి మాయమైపోయే మాయదారి డబ్బు కోసమే ఈ పరుగు. ప్రస్తుత ప్రపంచంలో మనుగడే సవాలుగా మారడంతో.. పొదుపు చేస్తే తప్ప భవిష్యత్తు లేదన్న భయం పట్టుకుంది.

దోసిళ్లలో నీళ్లను బంధించడం ఎంత కష్టమో.. ఈ రోజుల్లో డబ్బును నిలబెట్టుకోవడం అంత కష్టం. అందుకే వచ్చినట్లే వచ్చి మాయమైపోయే మాయదారి డబ్బు కోసమే ఈ పరుగు. ప్రస్తుత ప్రపంచంలో మనుగడే సవాలుగా మారడంతో.. పొదుపు చేస్తే తప్ప భవిష్యత్తు లేదన్న భయం పట్టుకుంది. తొలిసారిగా ఆ అభద్రత చైనాలో ప్రారంభమైంది. సంపాదనలో తొంభై శాతం పొదుపు చేస్తేనే బతికి బట్టకడతాం అంటున్న చైనీయులు లేవనెత్తిన కొత్త ఆర్థిక విప్లవం ‘సేవింగ్‌ డాజీ’.


‘‘కోతుల ముందు.. ఒక గంపలో అరటిపండ్లు, మరొక గంపలో డబ్బులు పెట్టామనుకోండి! అవన్నీ డబ్బుల్ని తీసుకోకుండా.. గబగబా అరటిపండ్లనే లాక్కెళతాయి. ఎందుకంటే ఆ డబ్బుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎన్ని కావాలంటే అన్ని పండ్లను కొనుక్కోవచ్చన్న ఆలోచన రాదు. నిజానికి తొంభైశాతం మంది జనం ఆలోచనా విధానం కూడా ఇలాగే ఉంటుంది. ‘‘మీరు ఉద్యోగంలో చేరతారా? వ్యాపారం చేస్తారా?’’ అంటే మరో ఆలోచన లేకుండా ఉద్యోగమే ముద్దు అంటారు. నౌకరీ చేస్తే నెలనెలా వచ్చే వేతనాలకంటే వ్యాపారంలో వచ్చే లాభాలు కొన్ని వందల వేల రెట్లు ఎక్కువన్న ఎరుక ఉండదు. జీతాలు కేవలం తాత్కాలిక జీవనోపాధిని మాత్రమే అందిస్తే.. దీర్ఘకాలిక లాభాలు జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయన్న విజయ రహస్యం చాలామందికి తెలియదు..’’


...చైనా కుబేరుడైన జాక్‌మా పెట్టిన ఈ పోస్టు.. ఆ దేశ యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ ఆర్థిక స్థితిగతులు తలకిందులైనట్లే.. చైనాలోని పేద, మధ్యతరగతి వర్గాల జీవితాలు కూడా తారుమారయ్యాయి. సంపన్నవర్గాలకు సంక్షోభం కూడా ఒక వరమైతే.. బలహీనవర్గాలకు శాపమైంది. చిన్న చిన్న ఉద్యోగాలతో జీవితాన్ని నెట్టుకురావడమే కష్టమైపోతున్నప్పుడు.. రేపటి కోసం మిగల్చడం సవాలుగా మారింది. అందుకే చైనాలోని కొత్తతరం.. ఉద్యోగాల కంటే వ్యాపారాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు, ఉపాధిపనులు, వృత్తులను నమ్ముకున్న వాళ్లు మాత్రం.. పట్టుదలతో భారీ మొత్తంలో పొదుపు చేయడం మొదలుపెట్టారు. సంపాదనలో పది నుంచీ ఇరవై శాతం పొదుపు చేసుంటే పెద్ద వార్త అయ్యుండేది కాదు.. ఆదాయంలో తొంభైశాతం పొదుపు చేస్తున్నారు కాబట్టే... ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యిందిప్పుడు. చైనా పేద, మధ్యతరగతి వర్గాల్లో ప్రారంభమైన ఈ పొదుపు విప్లవం పేరు ‘సేవింగ్‌ డాజీ’.


సారూప్య ఆలోచనలతో..

ప్రతి వ్యక్తి చుట్టూ బంధుమిత్రులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా ఒక సోషల్‌నెట్‌వర్క్‌ అల్లుకుని ఉంటుంది. నగరాల్లో అయితే సోషల్‌గ్రూప్స్‌తో చాలామంది అనుసంధానమై ఉంటారు. ఉదాహరణకు.. కొందరికి పర్యాటకం అంటే ఇష్టం. మరికొందరికి సామాజిక సేవంటే ఇష్టం. ఇలా సారూప్య ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఆయా బృందాల్లో కలిసి సామాజిక జీవితంతో ఆనందిస్తుంటారు. ఇలా సారూప్య అభిరుచి కలిగిన సామాజిక బృందాలతో కలిసి ముందుకు వెళ్లడమే ‘డాజీ’. ఇటీవల కాలంలో చైనాలో ఈ సంస్కృతి పెరిగింది. అక్కడి ప్రభుత్వం జనాభాను నియంత్రించేందుకు ‘వన్‌ చైల్డ్‌’ అనే నిబంధనను కఠినతరం చేసింది. అందుకని దంపతులకు కొడుకో, కూతురో ఒక్కరే ఉంటున్నారు. దీనివల్ల తోబుట్టువులతో అనుబంధాలకు అవకాశం లేకుండాపోయింది.


ఇలా వచ్చిన కొత్తతరం ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ‘డాజీ’ మార్గాన్ని ఎంచుకుంది. ఎలాగూ ఆ ట్రెండ్‌ ప్రాచుర్యం సంపాదించుకుందని.. దానినే పొదుపునకు అన్వయిస్తూ ‘సేవింగ్‌ డాజీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తెచ్చారు కొందరు. చైనాలో ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ‘జియా హోంగ్షు’లో సేవింగ్‌ డాజీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అప్పట్లో న్యూస్‌ర్యాంక్‌ అంచనా ప్రకారం.. ఆ హ్యాష్‌టాగ్‌ రెండు మూడు రోజుల్లోనే పాతిక లక్షల మందికి చేరుకుంది. ‘‘ఈ ట్రెండ్‌ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల పట్ల ప్రజలకున్న భయాన్ని సూచిస్తుంది.


భవిష్యత్తు ఎంత అగమ్యగోచరంగా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది. అందుకే సేవింగ్‌ డాజీ ప్రజల్ని అంతగా ఆకట్టుకుంటోంది’’ అన్నారు నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సింగపూర్‌ ఆచార్యులు లుజీ. చైనాలో హఠాత్తుగా విదేశీ పెట్టుబడులు పడిపోవడం, స్థానిక ప్రభుత్వ రుణాలు పెరగడం.. దేశవ్యాప్తంగా ఆర్థిక ఒడుదొడుకులు ఎదురుకావడం.. వంటివన్నీ చైనీయుల్లో ఆందోళనకు కారణమనే చెప్పవచ్చు. అందుకే ముందుచూపుతో ఇప్పటి నుంచే తమకొచ్చే ఆదాయంలో ముప్పావుశాతానికి పైగా పొదుపు చేయడానికి పూనుకున్నారు.


డాజీలే ప్రేరణ..

ఒకరితో మొదలైన ‘సేవింగ్‌ డాజీ’ పదిమందితో అల్లుకుని వందలు.. వేలు.. లక్షల మందికి చేరింది. ఇందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. ‘ఈ నెల మీరెంత పొదుపు చేశారంటే.. మీరెంత దాచుకున్నారని’ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొందరైతే ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలి? రుణవిముక్తి ఎలా పొందాలి? వీలైనంత ఎక్కువ డబ్బును మదుపు చేయాలంటే ఏం చేయాలి? వంటివన్నీ చెబుతున్నారు. ఈ టిప్స్‌ కొత్తతరానికి ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునేందుకు పనికొస్తున్నాయి. ప్రతిరోజూ తమ బడ్జెట్‌ను, ఖర్చులను నమోదు చేస్తారు. అందులో ఏదైనా వృథాగా అనిపిస్తే ఇతరులు కట్టడి చేస్తారు. ఉదాహరణకు ఒక సభ్యుడు ఒక లెదర్‌బ్యాగ్‌ను కొనడానికి ఇంటర్‌నెట్‌లో వెదుకుతాడు.


‘ఇంత ఖరీదైన బ్యాగ్‌ కొనవచ్చా?’ అని అడుగుతాడు. ఆ వెంటనే కొందరు ఆ ఖరీదైన బ్యాగ్‌ అవసరమా? ఒకవేళ కొనాలంటే మరో ప్రత్యామ్నాయం ఉందా? అని చెబుతారు. దీనివల్ల వినియోగదారుని భావోద్వేగాలు నియంత్రణలోకి వస్తాయి. కాస్త ఆగి, చౌకధరలో బ్యాగ్‌ను కొనాలా? లేదంటే వాయిదా వేయాలా ఆలోచిస్తాడు. డాజీ సభ్యుల అభిప్రాయాలు ఇలా తోటివారిని ప్రభావితం చేస్తాయి. అందరూ కలిసి మూకుమ్మడిగా కొనుగోళ్లను నియంత్రించడం అన్నమాట. డాజీ గ్రూప్స్‌లో చేరిన సభ్యుల్లో చాలామంది సగానికి సగం ఖర్చు తగ్గించుకున్నారు. వినియోగ మనస్తత్వానికి అడ్డుకట్ట పడింది. ‘‘నేను ఒకప్పుడు మనసు బాలేకపోతే చాలు.. వెంటనే ఆన్‌లైన్‌ షాపింగ్‌లోకెళ్లి ఏది పడితే అది కొనేదాన్ని.


ఎందుకు కొంటున్నానో? అసలది నాకు పనికొస్తుందా లేదా అనే స్పృహ లేకుండా షాపింగ్‌ చేసేదాన్ని. ఎరుకతో వ్యవహరించేదాన్ని కాదు. ఎప్పుడైతే డాజీగ్రూప్స్‌లో చేరానో అప్పటి నుంచీ కొనుగోలు మనస్తత్వం పోయింది. కచ్చితంగా అవసరం అయితేనే కొనేంత నిగ్రహం వచ్చేసింది... దీనివల్ల వినియోగదారుల జాబితా నుంచి నేను బయటపడ్డాను’’ అన్నారు ముప్పయి ఏళ్ల ఉపాధ్యాయురాలు వెన్‌జాంగ్‌. ఇప్పుడామె ఆన్‌లైన్‌ షాపింగ్‌ తగ్గించుకుని.. మంచి పుస్తకాలు చదవడం, వినసొంపైన సంగీతం వినడం, ప్రశాంతంగా ధ్యానం చేయడం, చక్కటి పౌష్టికాహారాన్ని వండుకోవడంపైన దృష్టి సారించారు. ఈ మార్పునకు తోడు.. తను చేత్తో అల్లిన బ్యాగులను స్థానిక మార్కెట్లలో విక్రయించి అంతోఇంతో సంపాదిస్తోంది. ఎప్పుడైతే ఆమె కొనడం తగ్గించేసి.. ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి పెట్టిందో అప్పటి నుంచి ఆర్థిక ఒత్తిడి తగ్గింది. ఇప్పుడిప్పుడే మెల్లగా మిగులుబాటువైపు వెళుతోంది. ఖర్చులకు అడ్డుకట్ట వేసి మినిమలిస్టు జీవనశైలిని అనుసరిస్తున్నది.


‘సేవింగ్‌ డాజీ’లో అందర్నీ ఆకట్టుకున్న మరొక అంశం.. డిజిటల్‌ చెల్లింపులకు స్వస్తిచెప్పి కేవలం నగదుతోనే బతకడం. మన దగ్గర గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటివి ఉన్నట్లే చైనాలోనూ కొన్ని పేమెంట్‌యాప్స్‌ ఉన్నాయి. టీస్టాల్‌లో చాయ్‌ తాగినా, అంగట్లో సరుకులుకొన్నా, మార్కెట్‌లో కూరగాయలు తీసుకున్నా.. వెంటనే మొబైల్‌ఫోన్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తాం. బయటికెళితే ఏదో ఒక అవసరాల రీత్యా రోజుకు పదిసార్లు డిజిటల్‌ పే చేస్తుంటాం. ఇలా చేస్తే మన అకౌంట్‌లో ఎంత డబ్బులు ఉన్నాయి? ఎంత ఖర్చు పెడుతున్నాం? ఇంకా రేపటి అవసరాలకు ఎంత ఉంది? అన్న లెక్క తెలియదు. అసలు మనకు తెలియకుండానే డబ్బులు నీళ్ల ప్రాయంగా ఖర్చు అయిపోతుంటాయి.


డిజిటల్‌ పేమెంట్‌ టెక్నాలజీలో సౌకర్యం ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి వర్గాలు కొనుగోళ్ల ఒరవడిలో కొట్టుకుపోతారు అంటున్నారు చైనాలోని సేవింగ్‌ డాజీ సభ్యులు. అందుకే వీలైనంత వరకు చేతిలో నగదు ఉంచుకుని కొనుగోళ్లు జరపాలన్నది వారి ఉద్దేశ్యం. ‘‘‘నగదు నోట్లను మనం చేత్తో ముట్టుకున్నప్పుడు డబ్బు అనే భావన కలుగుతుంది. అదెంత ప్రియమైనదో తెలుస్తుంది. తద్వార పొదుపుగా, బాధ్యతగా ఖర్చుపెట్టే జాగ్రత్త అలవడుతుంది. ఇదివరకున్న ఆ సంప్రదాయం ఇప్పుడు డిజిటల్‌పేమెంట్స్‌ వచ్చాక పోయింది. దీనివల్లే చాలా నష్టపోతున్నాం. విచ్చలవిడిగా లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేస్తున్నాం. సాంకేతికతను కాదనలేం.. అలాగని దానికే బానిస కాకూడదు. అయితేమాత్రం.. మన చేతుల్లో నుంచి మన కష్టార్జితం సులువుగా జారిపోతుంది’’ అన్నారు షాంఘైకి చెందిన చెన్‌ అనే ఉద్యోగి. అందుకనే సేవింగ్‌ డాజీ సభ్యుల్లో చాలామంది డిజిటల్‌యాప్స్‌ ద్వారా కాకుండా నగదుతోనే కొనుగోళ్లు చేస్తున్నారిప్పుడు.


కొత్త విప్లవం..

అమెరికన్లు విలాసవంత జీవితాన్ని ఇష్టపడతారు. రేపటికంటే ఈ రోజే ముఖ్యం అన్నది వారి ఆలోచన. చాలామంది అమెరికన్లు జీవితాంతం ఒకే ఉద్యోగం చేయరు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుని.. రకరకాల ఉద్యోగాల్లో చేరుతుంటారు. మధ్య మధ్యలో కొంత విరామం తీసుకుని విహారయాత్రలు చేయడం హాబీ. సంపాదనలో పది నుంచి ఇరవై శాతం కంటే ఎక్కువ పొదుపు చేయరు. ఆ దేశ యువతలో ఎక్కువమంది అనుసరించే జీవనశైలి అది. కానీ, చైనీయులు మాత్రం అందుకు విరుద్ధం. ఖర్చు పెట్టడం కంటే పొదుపు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చైనా ప్రఖ్యాత యూట్యూబర్‌, ఆర్థిక సలహాదారుడు హంప్రీ యాంగ్‌ ఈ విషయానికి సంబంధించిన ఆశ్చర్యకర విషయాలను పేర్కొన్నాడు. అమెరికన్ల కంటే చైనీయులు పదిరెట్లు ఎక్కువ పొదుపు చేస్తారని తెలిపారు.


ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సేవింగ్‌డాజీలాంటి విప్లవాత్మక పొదుపు మార్గాలను అనుసరిస్తున్నారని చెప్పాడాయన. మన పొరుగు దేశం.. డాజీమంత్రం జపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కరోనా తర్వాత స్టాక్‌మార్కెట్‌లు కుప్పకూలడం, ప్రపంచ వ్యాప్తంగా ఒక రకమైన ఆర్థిక అనిశ్చితి ఏర్పడటం.. అమెరికాలో నిరుద్యోగం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌-పాలస్తీనా సంక్షోభం, ఉగ్రదాడులు, ఆఫ్రికా దేశాల్లో రాజకీయ అస్థిరత, ఆప్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌లలోని రాజకీయ పరిస్థితులు.. ఇలాంటి అంతర్జాతీయ సమస్యలన్నీ.. ఏదో ఒక రోజు పెద్ద సంక్షోభాలకు దారితీస్తాయని చైనీయులు ముందే అప్రమత్తమయ్యారు. సంపాదనలో తొంభైశాతం పొదుపు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న ఇలాంటి ఉక్కపోతే కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సేవింగ్‌ డాజీ మార్గాన్ని అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.


ఆ సూత్రాలు అమూల్యం..

‘డాజీ’ మార్గం ఏకంగా జీవనశైలినే మార్చేస్తోంది. కార్పొరేట్‌ కంపెనీలు ప్రజల్ని వినియోగదారులుగా, రాజకీయపార్టీలు ఓటర్లుగా మార్చేసి.. భావోద్వేగాలతో ఆడుకోవడం.. కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ప్రజలు సహించలేకపోతున్నారు. ఆ చట్రంలో నుంచి బయటపడేందుకు సేవింగ్‌ డాజీ అద్భుత ఔషధంగా పనిచేస్తోంది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే - సాధారణంగా అన్ని దేశాల యువతలాగే చైనా యువతీ యువకులు కూడా విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక స్థోమత లేకపోయినా ఆడంబరాలకు ఖరీదైన వస్తువుల్ని అప్పులు చేసి మరీ కొనడం.. డాంబీకాలను ప్రదర్శించడం.. తమ చుట్టూ ఉన్న వారి మధ్య ప్రత్యేకతను చాటుకోవడానికి తహతహలాడటం వంటి జాఢ్యాల్ని ‘సేవింగ్‌ డాజీ’ పోగొడుతుంది.


స్టేటస్‌ అనేది వ్యక్తిత్వంతో వస్తుంది కానీ వస్తువులతో కాదని బోధిస్తుంది. బాహ్య ప్రపంచం కోసం బతక్కుండా.. ఇంట్లోని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సహోద్యోగులు, ఇరుగుపొరుగు వారితో కలిసి జీవిస్తూ.. కష్టసుఖాలను పంచుకుంటూ బతకాలన్నది డాజీ ఉద్దేశ్యం. ఇలాంటి మానవ సంబంధాలతో గడిపితే కొనుగోళ్ల కోసం మనసు ఆరాటపడదు. డబ్బులు కూడా ఖర్చు కావు. ఈ గ్రూప్‌లలోని సభ్యులు అందరూ అనుసరించే మొదటి సూత్రం ఇది. ఇక, రెండోది.. పేదరికంలో పెరిగిన చాలామంది చైనీయులు 10 : 1 నియమాన్ని పెట్టుకున్నారు. పది రూపాయలు సంపాదిస్తే అందులో కేవలం ఒక్క రూపాయిని మాత్రమే ఖర్చు పెట్టాలన్నది నిబంధన. ఇది వాస్తవికంగా కష్టసాధ్యమైనప్పటికీ అనుసరిస్తున్నారు. కార్మికులు తమ కోరికలను చంపుకుని.. పైసా పైసా పోగేసి.. పొదుపు చేస్తున్నారు. రేపటి భయమే వారిని అలా నడిపిస్తోందని సేవింగ్‌ డాజీ సభ్యులు చెబుతున్నారు.


మూడో సూత్రం... సేవింగ్‌ డాజీలోకి వచ్చాక ఏది అవసరం? ఏది అనవసరం? అన్న అభిప్రాయంలో చైనీయులకు స్పష్టత వచ్చింది. ‘అనవసరమైన వాటిని కొంటూ పోతే రేపు అవసరమున్న వాటికే డబ్బులు ఉండవు’ అనే భారతీయ సామెత చైనీయులకు బాగా నచ్చింది. తాత్కాలిక కోరికల కోసం డబ్బును ఖర్చు చేస్తే రేపటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను కోల్పోవాల్సి వస్తుందన్నది వారి భయం. అన్నిటికంటే ముఖ్యమైన నాలుగో సూత్రం... సేవింగ్‌ డాజీ సభ్యులందరూ ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వడం. ఏదో ఒక ముఖ్యమైన వేడుక వస్తే తప్ప హోటళ్లలో భోజనం చేయకూడదు. ఎందుకంటే బయటి తిండి చాలా ఖరీదైపోయింది. మనకు తెలియకుండానే హోటళ్ల బిల్లులే ఇరవై శాతం ఆదాయాన్ని హరిస్తాయి.


అందులోనూ అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయంటారు సభ్యులు.. కొందరైతే కమ్యూనిటీ క్యాంటీన్లలో చౌకధరల్లో లభించే ఆహారపదార్థాలను తింటూ జేబుకు చిల్లు పడకుండా చూసుకుంటున్నారు. ఆఖరిగా వీళ్లు అనుసరించే ఐదో సూత్రం.. సామాజిక మాధ్యమాల్లో సేవింగ్‌ డాజీ గ్రూపుల్లో చేరడం. ఖర్చులను నియంత్రణలో పెడుతూ.. అధికంగా పొదుపుచేసే విజేతల అనుభవాలను, అనుసరిస్తున్న వ్యూహాలను వినడం.. ప్రేరణ పొందడం. ఒక రకంగా అనుభవజ్ఞుల ఆలోచనలే సేవింగ్‌ డాజీకి రథచక్రాలు అయ్యాయి. సామాజిక మాధ్యమాల పుణ్యమాని.. చైనాలో మొదలైన సేవింగ్‌ డాజీ మెల్లమెల్లగా ప్రపంచమంతా విస్తరిస్తోంది.

- సండే డెస్క్‌

Updated Date - Oct 20 , 2024 | 07:15 AM